ధనత్రయోదశి వాస్తవాలు.. యమదీపం ఎప్పుడు, ఎలా వెలిగించాలి.!

హిందూ సనాతన ధర్మంలో దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు ధనత్రయోదశి వస్తుంది. దీపావళి పండుగ అమావస్య రోజున వస్తే, దానికి ముందు వచ్చే త్రయోదశి తిథినే ధనత్రయోదశి లేదా ధన్తేరస్ గా జరుపుకుంటారు. ఈ పర్వదినం రోజునే ధనలక్ష్మీదేవి పూజతో పాటు యమదీపం వెలిగిస్తారు. ఈ పవిత్రమైన రోజును ధనత్రయోదశి లేదా యమత్రయోదశి అని పిలుస్తారు. ఈ పండుగ రోజున ధనలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు, యమధర్మరాజును స్మరిస్తూ యమదీపం వెలిగించడం ఆచారంగా వస్తోంది. ఈ పర్వదినం వెనుక ఉన్న ముఖ్యమైన విశేషాలు, పూజా విధానం , యమదీపం వెలిగించే సరైన పద్ధతి గురించి వివరంగా తెలుసుకుంటే..
ధనత్రయోదశి రోజు ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో ధనలక్ష్మీదేవిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. మంచి ఆరోగ్యం, మూడు పూటల చక్కటి భోజనం, ప్రశాంతమైన నిద్ర, కుటుంబంలో అన్యోన్యత, మంచి సంతానం, ఆయురారోగ్యాలు, వాహన ప్రాప్తి వంటి అన్నీ కలగడమే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం. ఈ రోజు లక్ష్మీదేవిని మనసారా కొలిస్తే దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.
యమత్రయోదశి..
ధనత్రయోదశినే యమత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సాయం సంధ్యా వేళలో ఇంటి గుమ్మం వద్ద యమదీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
యమదీపం ఎందుకు వెలిగిస్తారు?
భూలోకంలో మానవులు అనారోగ్యాలు, ప్రమాదాల కారణంగా చిన్న వయసులోనే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటే యమభటులు బాధపడేవారట. అప్పుడు మానవులకు అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి మార్గం ఏమిటని యమభటులు యమధర్మరాజును అడిగారట. దానికి యమధర్మరాజు ఆశ్వయుజ మాస త్రయోదశి నాడు ఎవరైతే తమ ఇంటికి దక్షిణం వైపు యమదీపం వెలిగించి భక్తితో నమస్కరిస్తారో, వారిని ఆ సంవత్సరం పాటు యమభటులు ఎవరూ సమీపించవద్దని, వారికి అకాల మృత్యు భయం ఉండదని చెప్పినట్లు స్కంద పురాణంలో ఉంది. అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ రోజు యమదీపం వెలిగించడం చాలా మంచిది.
ధనత్రయోదశి..
ధనత్రయోదశి రోజు ఉదయమే తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గడపను శుభ్రంగా తుడిచి, పసుపు కుంకుమలతో అలంకరించి ద్వారలక్ష్మికి నమస్కరించుకోవాలి. పూజా మందిరంలో దీపారాధన చేసి, రోజంతా భక్తితో ఉపవాసం ఉండవచ్చు. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.
సాయంత్రం సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో లక్ష్మీదేవి పూజ చేయాలి. పళ్లేం మీద పసుపు కుంకుమలతో పద్మం వేసి, కలశం ఏర్పాటు చేసి అందులో అమ్మవారిని ఆవాహనం చేయాలి. విగ్రహం ఉన్నవారు విగ్రహాన్ని ఉంచి ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి. కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. అమ్మవారికి పాలు, అరటిపండ్లు లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.
బంగారం కొనుగోలు..
ఈ రోజు బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శక్తి ఉన్నవారు బంగారం లేదా వెండి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కొనలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంట్లోని బంగారాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజలో ఉంచి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. అలాగే కళ్ళు ఉప్పు, ధనియాలు, పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకోవడం కూడా లక్ష్మీప్రదంగా భావిస్తారు.
యమదీపం వెలిగించే విధానం..
యమదీపం వెలిగించే విధానంలో నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు సింహద్వారానికి కుడి వైపున ఒక పళ్ళెంలో విస్తరాకు లేదా ఐదు తమలపాకులు ఉంచాలి. దానిపై కొంత కళ్ళు ఉప్పు పోసి, దానిపైన మట్టి ప్రమిదను పెట్టాలి. ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులను ఉంచాలి. ఒక వత్తి తూర్పు వైపునకు, మరొక వత్తి పడమర వైపునకు, మూడవ వత్తి దక్షిణం వైపునకు చూసేలా అమర్చాలి. నేరుగా అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతి ద్వారా దీపాన్ని వెలిగించి, ఆపై దక్షిణం, తూర్పు, పడమర వరుసగా వత్తులను వెలిగించాలి. ఆ దీపానికి గంధం, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పించి బెల్లం లేదా అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి.
చివరగా దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజును మనసారా తలచుకుంటూ మా కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను ప్రసాదించి, అకాల మృత్యువులను తొలగించమని భక్తితో నమస్కరించుకోవాలి. దీపం పూర్తిగా కొండెక్కక ముందే నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. దీపం పూర్తిగా శాంతం అయిన తర్వాత కింద ఉన్న ఉప్పును నీటిలో కరిగించి మొక్కలకు పోయాలి. ఉపయోగించిన తమలపాకులు , ప్రమిదను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ యమదీపాన్ని ఇంటి యజమాని లేదా గృహిణి ఎవరైనా వెలిగించి అందరూ నమస్కరించుకోవచ్చు. ఈ విధంగా విధివిధానాలతో ధనత్రయోదశి పూజ , యమదీపారాధన చేయడం వల్ల కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం , ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయి.
*రూపశ్రీ.






