.webp)
హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలసు పాటిస్తుంటాం. అలాగే పరమశివుడి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించడం పరిపాటి. సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై కనిపిస్తారు. శివాలయానికి వెళ్లే భక్తులు శివుడిని దర్శించుకోవడమే కాకుండా, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం లేదా నంది చెవిలో తమ మనసులోని కోరికలను చెప్పుకోవడం చేస్తుంటారు. అయితే నందీశ్వరుడిని పట్టించుకోకుండా శివుడిని దర్శనం చేసుకునేవారు చాలామంది ఉంటారు. అసలు శివాలయంలో నందీశ్వరుడి ప్రాముఖ్యత ఏమిటి? నందీశ్వరుడి దర్శనం చేసుకోకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా శివుడి దర్శనం చేసుకోవచ్చా? దీని గురించి మన పురాణాలు , ఆధ్యాత్మిక పండితులు స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్నది ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
శివాలయంలో నందీశ్వరుడు..
మన సనాతన సంప్రదాయం ప్రకారం శివాలయంలో నందీశ్వరుడి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. నందీశ్వరుడు కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు, ఆయన శివుడికి పరమ భక్తుడు , ద్వారపాలకుడు కూడా. శివాలయంలోకి అడుగుపెట్టినప్పుడు పరమశివుడి అనుగ్రహం పొందడానికి ముందుగా నందీశ్వరుడి అనుగ్రహం పొందడం చాలా అవసరం. నందీశ్వరుని అనుమతి లేకుండా చేసే శివ దర్శనాన్ని పరమశివుడు స్వీకరించడని, అంగీకరించడని పురాణాలు చెబుతున్నాయి.
నందీశ్వరుడి అనుమతి..
శివ దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా నందీశ్వరుడి వద్ద నిలబడి నమస్కరించుకుని, ఆయన అనుమతిని కోరవలసి ఉంటుందట. నందీశ్వరుడు అనుగ్రహిస్తేనే మన పూజలు , ప్రార్థనలు పరమశివుడికి చేరుతాయట. నందీశ్వరుడికి ప్రణామం చేసి, ఆయన ద్వారా శివుడి దృష్టిని మనవైపు తిప్పుకోవాలని చెబుతున్నారు. అందుకే ఆలయానికి వెళ్లినప్పుడు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం లేదా నందీశ్వరుడి అనుమతి పొంది గర్భగుడికి వెళ్లడం పద్ధతిగా చెబుతారు.
నందీశ్వరుడి తపస్సే కారణం..
శివపురాణంలో శిలాద మహర్షి కథ ప్రకారం, శిలాదుడు సంతానం కోసం పరమశివుడిని ప్రార్థించగా, ఆయన అనుగ్రహంతో నందీశ్వరుడు జన్మించాడు. నందీశ్వరుడు చిన్నతనం నుంచే పరమశివుడిపై అపారమైన భక్తిని కలిగి ఉన్నాడు. శివుడిని మెప్పించడం కోసం ఆయన తీవ్రమైన తపస్సు చేశాడు. నందీశ్వరుడి భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై, ఆయనను తన వాహనంగా, గణాధ్యక్షుడిగా , ద్వారపాలకుడిగా స్వీకరించాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు నందీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ప్రసాదించాడు.
తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే, ముందుగా ద్వారపాలకుడైన నందీశ్వరుడి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, నందీశ్వరుడి అనుమతి పొంది, ఆయనను పూజించిన తర్వాత మాత్రమే చేసే శివ దర్శనం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని శివుడే నియమం పెట్టాడట.
కాబట్టి శివాలయానికి వెళ్లిన ప్రతిసారీ నందీశ్వరుడిని నిర్లక్ష్యం చేయకుండా, ముందుగా ఆయనకు నమస్కరించి అనుగ్రహం పొందాలి. నందీశ్వరుడి ఆశీస్సులతో చేసే శివ దర్శనమే సంపూర్ణమైనదిగా, ఫలప్రదమైనదిగా భావిస్తారు. ఈ చిన్న నియమాన్ని పాటించడం ద్వారా శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు.
*రూపశ్రీ.





.webp)
