బగళాముఖీ జయంతి .. శత్రువుల ఆటలు  కట్టించాలంటే  ఇలా చేయండి!

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు, శత్రువులు ఇద్దరూ ఉంటారు.  స్నేహితులు మంచి కోరితే.. శత్రువులు చెడు కోరతారు.  కొందరు శత్రువులు చేసే కుట్రలు తెలిసి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతారు. కానీ దుష్టులకు,  ముఖ్యంగా శత్రువులకు గుణపాఠం చెప్పి,  వారి నోరు కట్టిపడేసే అమ్మవారు బగళాముఖి.  బగళాముఖి అమ్మవారు దశ మహావిద్యలలో ఎనిమిదవ దేవత. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్ష అష్టమి నాడు బగళాముఖి జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది బగాళాముఖి జయంతి ఏప్రిల్ 24వ తేదీన వచ్చింది. ఈ రోజు బగళాముఖి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో గొడవలు,  దుఖం,  కష్టాలు,  ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శత్రువులను ఓడించి వారి నోళ్లు మూయించడానికి బగళాముఖి జయంతి రోజున కొన్ని పరిహారాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..


హవనం..

బగళాముఖి రోజున హవనం చేయడం వల్ల శత్రువుల బాధ తప్పుతుంది.  శత్రువులు ఓడిపోతారు. ఇందుకోసం బగళాముఖి జయంతి రోజు స్నానం చేసి పసుపు ఆవాలు తీసుకుని వాటితో హవనం చేయాలి.  ఇది చాలా ప్రభావవంతమైన, సులభమైన మార్గం.

కవచం..

బగళాముఖి జయంతి రోజు బగళాముఖి కవచాన్ని పఠించడం కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎంత బలమైన శత్రువు అయినా సరే.. బగళాముఖి కవచాన్ని పఠించడం వల్ల వారిని ఓడించవచ్చు.  ముఖ్యంగా కోర్టు లేదా న్యాయపరమైన సమస్యలలో,  వివాదాలలో ఉన్నవారు బగళాముఖి కవచాన్ని పఠించడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది.

ఆరోగ్యం కోసం..

ఆరోగ్య సంబంధ సమస్యలు తొలగించడానికి బగళాముఖి జయంతి రోజు గరిక,  గుడూచి,  తేనె, నెయ్యి,  పంచదార,  లవంగాలు కలిపి హవనం వేయాలి.  దీని వల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.

కుటుంబ సమస్యలకు..

కుటుంబాలలో పెద్ద సమస్యలు  పరిష్కరించుకోవడానికి బగళాముఖి జయంతి రోజున ఇంటి ఆవరణలో ఒక చోట కొంత మట్టి సేకరించి,  గోధుమ రంగు వస్త్రంలో చుట్టి,  ఆ తర్వాత దానిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి పాటిపెట్టాలి.  ఈ పరిహారాన్ని బగళాముఖి జయంతి రోజున.. ఇంటి యజమాని చేయాలి.  ఇలా చేస్తే కుటుంబంలో పెద్ద సమస్యలు కూడా తగ్గిపోతాయి.

వ్యాపారంలో సమస్యలు..


వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉన్నా లేదా నష్టాలు వస్తున్నా, బగళాముఖి జయంతి రోజున ఒక తెల్లని పూల మొక్కను దాని కుండీతో పాటు గుడికి దానం చేయాలి. వ్యాపార భాగస్వామికి మరొక కుండీలోని మొక్కను బహుమతిగా ఇవ్వాలి.  ఇలా చేస్తే  వ్యాపారంలో భాగస్వామ్యం ద్వారా సమస్యలు తొలగి,  వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుందట.

మానసిక ప్రశాంతత కోసం..

మానసిక ప్రశాంతత కోసం, బగళాముఖి జయంతి రోజున వండిన అన్నంలో పంచదార పొడి కలిపి ఒక తెల్ల ఆవుకు తినిపించాలి. అలాగే చేతులు జోడించి గోమాత ఆశీర్వాదం తీసుకోవాలి.

దాంపత్య జీవితానికి..

 వైవాహిక సమస్యలు పరిష్కారం కాకపోతే, బగళాముఖి జయంతి రోజున నైరుతి దిశగా ముఖం చేసి, అమ్మవారిని ధ్యానించి, నమస్కరించాలి. శక్తి మేరకు పూజ చేసుకోవాలి.  పేదలకు అన్నదానం చేయాలి. ఆనందం పెరుగుతుంది.

పైన చెప్పుకున్న విధంగా బగళాముఖి జయంతి రోజు..    పరిహారాలు పాటిస్తే.. అమ్మవారి కరుణ వల్ల సమస్యలు అన్నీ తొలగి  సమస్యలన్నీ తగ్గుతాయి.  అమ్మవారు చాలా శక్తివంతమైన వారు.. కాబట్టి మంచి పనుల కోసం మాత్రమే అమ్మవారిని  పూజించి పరిహారాలు చేయడం మంచిది.

                                 *రూపశ్రీ.


More Others