Home » Temples » అలంపూర్ జోగులాంబ.. ఈ అమ్మవారు ఎలా ఆవిర్బవించారు.!

అలంపూర్ జోగులాంబ.. ఈ అమ్మవారు ఎలా ఆవిర్బవించారు.!

తెలంగాణలోని తుంగభద్ర నదీ తీరాన వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం అలంపూర్. ఇక్కడ కొలువైన జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠంగా పూజలందుకుంటున్నారు. సాధారణంగా శక్తిపీఠాలు అంటే దేవీ ఉగ్రరూపం లేదా శాంతరూపం గుర్తొస్తుంది. కానీ అలంపూర్ క్షేత్రంలో అమ్మవారి ఆవిర్భావం, ఇక్కడి ప్రతి స్తంభం, ఆలయ నిర్మాణం వెనుక ఎవరికీ  తెలియని అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి.అసలు ఈ అమ్మవారు ఎలా ఆవిర్బవించింది?  ఈ శక్తి పీఠం గురించి ఆశ్చర్యపరిచే నిజాలేమిటి? వివరంగా తెలుసుకుంటే..

అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న కథ..

సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహుతి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి పవిత్ర దేహాన్ని ఖండించినప్పుడు, ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. అందులో భాగంగా సతీదేవి ఊర్థ్వ దంత పంక్తి, అంటే పైవరుస పళ్ళు పడిన  స్థలమే ఈ అలంపూర్. అందుకే ఈ క్షేత్రానికి అపారమైన శక్తి ఉందని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారు యోగిని రూపంలో కొలువై ఉండటం వల్ల జోగులాంబ అని పిలుస్తారు.

ఎవరికీ తెలియని రహస్యాలు , ఆశ్చర్యపరిచే నిజాలు..

ఉగ్రరూపం వెనుక ఉన్న విచిత్ర నిర్మాణం..

జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉంటారు. అమ్మవారి తలపై జడలు, నాలుక బయటకు చాపిన రూపంలో, చేతిలో ఖడ్గం, కపాలం ధరించి కనిపిస్తారు. అయితే ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే, అమ్మవారి ఉగ్రతను చల్లబరచడానికి విగ్రహం కింద నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా ప్రాచీన కాలంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ నీటి తడి వల్ల అమ్మవారు శాంతిస్తారని అర్చకులు చెబుతారు.

కేశాల(వెంట్రుకలు) రహస్యాలు..

జోగులాంబ అమ్మవారి ప్రతిమలో అమ్మవారి కేశాలు (జడలు) సాధారణ స్త్రీలలాగా కిందకు కాకుండా, పైకి లేచి ఊర్థ్వ ముఖంగా ఉంటాయి. శాస్త్రాల ప్రకారం, ఊర్థ్వ కేశాలు ఉగ్ర రూపాన్ని , అనంతమైన శక్తిని సూచిస్తాయి. అమ్మవారు శంబరాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి వహించిన అగ్ని స్వరూపానికి ఇది ప్రతీక.

అమ్మవారి శిరస్సుపై ఉన్న జడల అమరికలో కొన్ని విచిత్రమైన చిహ్నాలు చెక్కబడి ఉంటాయి.  అమ్మవారి కేశాలలో తేలు, బల్లి, కప్ప , నక్షత్రం వంటి ఆకారాలు కనిపిస్తాయి.

భూమి కింద దాగిన శక్తి..

చాలా ఏళ్ల క్రితం విదేశీ దండయాత్రల సమయంలో ఆలయాన్ని కాపాడుకోవడానికి స్థానిక భక్తులు, సాధువులు ఒక గొప్ప ఆలోచన చేశారు. అమ్మవారి మూలవిగ్రహాన్ని ఇతరులు నాశనం చేయకుండా ఉండటానికి భూమి కింద ప్రత్యేక రహస్య గదిలో భద్రపరిచారు. శతాబ్దాల పాటు అమ్మవారు భూగర్భంలోనే పూజలు అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల క్రితమే మూలవిగ్రహాన్ని మళ్లీ బయటకు తీసి కొత్త ఆలయంలో ప్రతిష్టించారు. ఇప్పటికీ పాత ఆలయ ఆనవాళ్లు భూగర్భ మార్గాలతో ముడిపడి ఉంటాయని అంటారు.

నవబ్రహ్మ ఆలయాల రహస్యం..

అలంపూర్ అంటే కేవలం శక్తిపీఠం మాత్రమే కాదు. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు అని పిలిచే తొమ్మిది శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణ శైలి చాలా అరుదైనది. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు సూర్యరశ్మి ఆలయంలోని నిర్దిష్ట ప్రాంతాల మీద పడేలా రాళ్లను మలిచారు. కంప్యూటర్లు లేని ఆ కాలంలోనే వెలుగు నీడల గణితాన్ని ఉపయోగించి ఈ ఆలయాలను నిర్మించడం నిజంగా ఒక అద్భుతం.

రససిద్ధుల రహస్య కేంద్రం..

పూర్వకాలంలో ఈ క్షేత్రం రససిద్ధులకు ప్రసిద్ధి చెందింది. అంటే ఇనుమును బంగారంలా మార్చే మూలికా విద్యలు, సిద్ధి విద్యలు తెలిసిన యోగులు ఇక్కడ నివసించేవారు. అలంపూర్ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొన్ని రాళ్లపై ఉండే గుప్త లిపి ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆ లిపిలో రహస్య మూలికలు, రసవాద విద్యల సమాచారం ఉందనే ప్రచారం ప్రసిద్ధి పొందింది.

కాళరాత్రి పూజల ప్రాముఖ్యత..

సాధారణంగా దేవీ ఆలయాల్లో ఉదయం వేళల్లో ఎక్కువ పూజలు జరుగుతాయి. కానీ అలంపూర్ లో రాత్రి వేళల్లో చేసే పూజలకు, ముఖ్యంగా అమావాస్య రాత్రి చేసే దేవీ ఉపాసనకు అపారమైన శక్తి ఉంటుందని చెప్తారు. ఇక్కడ రాత్రి వేళ ప్రాంగణంలో సానుకూల శక్తి  చాలా ఎక్కువగా ఉంటుందని భక్తుల అనుభవం.

సర్ప భయం తొలగించే తీర్థం..

అలంపూర్ క్షేత్రంలో ప్రవహించే తుంగభద్ర నది నీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సర్ప దోషాలైనా తొలగిపోతాయని అంటారు. అలాగే మానసిక భయాలు, నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే వెంటనే ప్రశాంతత లభిస్తుందట.

అలంపూర్ క్షేత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, మన ప్రాచీన విజ్ఞానానికి, నిర్మాణ అద్భుతాలకు నిలువెత్తు నిదర్శనం. తరతరాలుగా వస్తున్న ఈ క్షేత్ర మహిమలు ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
  

                                                                                                                              *రూపశ్రీ.

google-ad-img