ఉద్యోగం, వ్యాపారాలలో మంచి ఎదుగుదలకు బుధవారం రోజు ఈ పరిహారం పాటిస్తే చాలు!
.webp)
బుధవారం వినాయకుడికి ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. వినాయకుడు విఘ్నాలను తొలగించే వాడు, ఏ పనులు చేపట్టినా, ఏ శుభకార్యాలలో అయినా మొదటగా వినాయకుడిని పూజించడం సంప్రదాయం. ప్రసన్నం చేసుకున్న వారికి ఆయన జ్ఞానం, వివేకం ప్రసాదిస్తాడు. అంతేకాకుండా, వారి జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల కావాలని అనుకునే వారు బుధవారం రోజు వినాయకుడికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అవేంటో తెలుసకుంటే..
ఉద్యోగంలో ఎదుగుదలకు..
ఉద్యోగంలో మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఉద్యోగంలో ఎదుగుల లేకపోవడం, పదేపదే పదోన్నతి లభించకపోవడం వంటివి జరుగుతుంటే.. ప్రతి బుధవారం వినాయకుడిని పూజించాలి. 21 గరిక పోచలను గంగాజలంతో శుద్ధి చేసి గణేశుడికి సమర్పించాలి. "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. అలాగే ప్రతి బుధవారం ఒక ఆవుకు పచ్చగడ్డిని మేతగా వేయాలి. ఇది వృత్తిలో పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.
వ్యాపారంలో వృద్దికి..
రోజులు గడిచేకొద్దీ వ్యాపారంలో నిరంతరం నష్టాలు వస్తూ, పెద్దగా అమ్మకాలు, లాభాలు ఏవీ లభించకపోతే బుధవారం నాడు గణేశుడిని పూజించి, గరిక పోచలు కలిపిన నీటితో ఆయనకు అభిషేకం చేయాలి. ఆ తర్వాత కుంకుమ సమర్పిస్తూ, వ్యాపార సంబంధిత సమస్యలన్నిటి నుండి విముక్తి చేయమని గణేశుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. గణేశుడి మంత్రం లేదా వక్రతుండ మహాకాయ అ నే శ్లోకం లేదా శుక్లాం బరదరం వంటి శ్లోకాలు కనీసం 51 సార్లు అయినా జపం లాగా చేయాలి. ప్రతి రోజు సంకట నాశన గణేశ స్తోత్రం పఠిస్తున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
అదృష్టం కోసం..
ప్రయత్నాలతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చినప్పుడే మంచి ఎదుగుదల ఉంటుంది. ఎంతగా ప్రయత్నించినా అదృష్టం మిమ్మల్ని వరించట్లేదని, జీవితంలోని అడ్డంకులు తొలగిపోవట్లేదని, పనులలో నిరంతరం ఆటంకాలు ఎదుర్కొంటున్నారని అనిపిస్తే, బుధవారం నాడు ఒక ప్రత్యేక పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించాలి. బుధవారం ఉదయం, గణేశుడిని పూజించి, కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అలాగే 21 గరిక పోచలను కూడా సమర్పించాలి. వినాయకుడికి కుంకుమతో అర్చన చేసుకోవాలి. ఈ కుంకుమను ప్రతిరోజూ దరిస్తూ ఉండాలి. అలైగే వినాయకుడికి కొబ్బరినూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్టమైన ఫలితాన్నిఇస్తుంది. ఈ పరిహారం దురదృష్టాన్ని అదృష్టంగా మారుస్తుంది, నిలిచిపోయిన పనులు, నెరవేరని కోరికలు నెరవేరడం ప్రారంభమవుతాయి.
రోజు బాగుండాలంటే..
ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది, కాబట్టి బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ఆ రోజును మరింత శుభప్రదంగా చేస్తుంది. ఒకవేళ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించలేకపోతే, ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు లేదా పనికి వెళ్లేటప్పుడు జేబులో ఒక ఆకుపచ్చ రుమాలు ఉంచుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ ఒక్క పని జీవితంలోకి ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని, రోజంతా విజయంతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే బుధ గ్రహం శుభ ఫలితాలు ఇస్తుందట. బుధవారాల్లో నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండేందుకు ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు.
*రూపశ్రీ.


