మీలో ఈ మార్పులు కనిపిస్తే.. దేవుడు మీ తోడు ఉన్నట్టే..!
.webp)
మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టాం, మన జన్మ వెనుక ఉన్న అసలైన పరమార్ధం ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడైనా ఎవరికైనా కలగవచ్చు. దేవుడు మనలోనే ఉన్నాడని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మరి ఆ పరమాత్మ నిజంగా మన అంతరంగంలోనే ఉన్నాడని తెలుసుకోవడం ఎలా? సమాజంలో డబ్బు లేని సగటు మనిషి కావచ్చు, పెద్దగా ఉపన్యాసాలు చెప్పే వ్యక్తి కావచ్చు, ధనవంతులు కావచ్చు, తెలివితేటలు లేని వ్యక్తులు కావచ్చు..అలాంటి వారి గుండెల్లో కూడా దేవుడు నివసిస్తాడా అనే ప్రశ్నకు మనకు అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధించిన ఆత్మజ్ఞాన మార్గంలో అద్భుతమైన సమాధానం దొరుకుతుంది.దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
లోకానికి కనిపించే బయటి ఆడంబరాలు, రోజువారీ పూజలు, గుళ్లకు వెళ్లడం భగవంతుని పట్ల మనకున్న ప్రేమను తెలపడానికి మంచి మార్గాలే కావచ్చు. కానీ ఆ దేవుడు నిజంగా మనలోనే ఉన్నాడని చెప్పడానికి ఇవి మాత్రమే సరిపోవు. పెదవులతో దేవుడి పేరు పలకడం చాలా సులభం, కానీ ఆ దైవత్వాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడమే అసలైన పరీక్ష. ఎవరి మనసులో అయితే నిజమైన భక్తి మేల్కొంటుందో, వారిలో స్పష్టంగా కనిపించే ముఖ్యమైన మార్పులు ఉంటాయి. అవేంటంటే..
మనిషిలో అపారమైన కరుణ మేల్కొనడం..
ఎవరి హృదయాంతరంగంలో అయితే దైవ ప్రవాహం మొదలవుతుందో, అక్కడ మొట్టమొదట పుట్టేది స్వచ్ఛమైన కరుణ. ఎదుటివారి కష్టాన్ని మన సొంత కష్టంగా భావించడమే అసలైన కరుణ. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యం తెలిసినవాడు ఎప్పుడూ ఇతరుల బలహీనతలను చూసి అహంకారంతో నవ్వడు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, తోటివారి కష్టాలను అర్థం చేసుకోవడం జ్ఞానానికి నిదర్శనం. ముఖ్యంగా మనకు కీడు చేసినవారు, వెన్నుపోటు పొడిచినవారు ఎదురుపడినప్పుడు మన గుండెలో పగ, ప్రతీకారం అనే అగ్ని చల్లబడిపోయిందంటే, మన మనసు సరైన మార్గంలో రూపాంతరం చెందుతోందని అర్థం.
నేను అనే అహంకారం పూర్తిగా అరిగిపోవడం..
ఇదంతా నేనే సాధించాను, నా తెలివితేటల వల్లే ఇదంతా జరుగుతోంది అనే అహంకారపు భావనే మనిషిని దేవుడికి దూరం చేస్తాయి. మన పుట్టుక నుండి శ్వాస వరకు ఏదీ మన చేతిలో లేదనే సత్యాన్ని గ్రహించినప్పుడు అహంకారం దానంతట అదే కరిగిపోతుంది. పండ్ల బరువు పెరిగే కొద్దీ చెట్టు కొమ్మలు ఎలా వంగుతాయో, ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే కొద్దీ మనిషిలో వినయం అలా పెరుగుతుంది. తాను చేసిన సహాయాన్ని నలుగురిలో డప్పు కొట్టుకోకపోవడం, ఎదుటివారు కృతజ్ఞతలు చెప్పకపోయినా బాధపడకపోవడం నిజమైన వినయానికి నిదర్శనం.
సుఖ దుఃఖాలకు చలిచకపోవడం..
దేవుని నమ్మితే జీవితంలో ఎప్పటికీ కష్టాలే రావు అనుకోవడం భ్రమ. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఈ సమయం కూడా ఎంతో కాలం నిలవదు, ఇది కూడా దాటిపోతుంది అనే నిశ్చలమైన నమ్మకం కలిగి ఉండటమే ముఖ్యం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం వస్తే కుప్పకూలిపోకుండా సమతుల్యంగా జీవించడం నేర్చుకోవాలి. జీవితంలో ప్రతి సంఘటన వెనుక ఒక పరమార్ధం ఉంటుంది.
అందువల్ల దేవుడిని ఎక్కడెక్కడికో వెళ్లి వెతికే బదులు మన అంతరంగంలోనే చూసుకోవాలి. పక్కవాడి కన్నీళ్లు చూస్తే స్పందించే మనసు ఉండటం, అహంకారాన్ని వదిలేయడం, ఎలాంటి పరిస్థితిలోనూ ప్రశాంతత కోల్పోకపోవడం ఇవే దేవుడు మనతో ఉన్నాడనడానికి అసలైన సంకేతాలు. ఈ సత్యం అర్థమైనవాడు దేవుడిని గుడిలో మాత్రమే కాకుండా ప్రతి జీవిలోనూ చూస్తాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధితులను ఓదార్చడం, తోటివారిని క్షమించడమే నిజమైన దైవారాధన అవుతుంది.
*రూపశ్రీ.





