ఈ 7 దానాలు గుడిలో చేస్తే కీర్తి, సంపద పెరుగుతాయి!
ఈ 7 దానాలు గుడిలో చేస్తే కీర్తి, సంపద పెరుగుతాయి!
దానానికి ప్రతి మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దానాలు చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందుతారని చెబుతారు. ఇంకొక విషయం ఏంటంటే దానం వల్ల పేదలకు సహాయం చేయడం, పుణ్యాన్ని పోగు చేసుకోవడం కూడా దీని ముఖ్య ఉద్దేశ్యం అని పెద్దలు చెబుతుంటారు. అయితే దానాలకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయని కొన్ని గ్రంథాలు చెబుతాయి. అయితే దానాన్ని పుణ్యం కోసం చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ సరైన వస్తువులను సరైన సమయంలో, సరైన ప్రదేశంలో చేయడం వల్ల ఆ దానానికి చాలా గొప్ప ఫలితం ఉంటుంది. అది కీర్తిని, సంపదను, ఆనందాన్ని కూడా చేకూరుస్తుంది. గుడిలో చెయ్యాల్సిన దానాల గురించి తెలుసుకుంటే..
ఆలయానికి చేయాల్సిన దానాలు..
ఆలయానికి కలశాన్ని దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందట. జీవితంలో ఎదుగుదల చాలా మెరుగ్గా ఉంటుందట.
గుడులను గమనిస్తే గుడి గోపురం మీద జెండాలు ఉంటాయి. ఇలా గుడి గోపురం మీద అమర్చడానికి కావలసిన జెండాను గుడికి దానం చేస్తే అది సమాజంలో గౌరవాన్ని తెచ్చి పెడుతుందట. ప్రజాదరణ పెరుగుతుందట.
దేవాలయానికి దీపాలను దానం చేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పిత్త సంబంధిత రుగ్మతలు తగ్గుతాయని చెబుతారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
అగ్గిపుల్లలను.. అంటే అగ్గి పెట్టెలను దేవాలయానికి దానం చేయడం వల్ల చెడు శకునాలు ఏవైనా ఎదురవుతూ ఉంటే అవన్నీ తగ్గిపోతాయట. అలాగే అప్పుల బాధలు ఉంటే అవన్నీ తీరిపోతాయట. జీవితంలో ప్రతికూల పరిస్థితులు కూడా మెల్లిగా తగ్గుతాయట.
కర్పూరాన్ని దానం చేయడం కూడా చాలా మంచిదియ ఇది పిల్లలకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో చాలా సహాయపడుతుంది. అలాగే కుటుంబంలో ఆనందం తీసుకుని వస్తుంది.
ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు, దేవుడి ఊరేగింపు వంటివి జరిగినప్పుడు దేవుడికి గొడుగు పెడుతూ ఉంటారు. ఇలాంటి గొడుగును దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఆర్థిక సంక్షోభాలు తగ్గుతాయి. జీవితంలో కష్టాలు కూడా క్రమంగా తగ్గుతాయి.
పూజలు, ఉత్సవాలు, ప్రత్యేక తిథులలో గుడిలో ఆహారం వితరణ చేయడం చాలా మంచిది. అలాంటి సమయంలో ఎంతో మంది ఆకలికి అలమటించే వారు వస్తుంటారు. అలాంటి వారిని గమనించి వారికి ఆహారం దానం చేయడం వల్ల అటు పుణ్యాన్ని, ఇటు కీర్తిని కూడా పొందుతారు.
దానం చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
పెద్దలైనా, పండితులు అయినా, జ్యోతిష్యులు అయినా.. దానం విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని నిక్కచ్చిగా చెబుతారు.. అదే దానం చేయడం అంటే ఆడంబరం కాదు.. దానాన్ని ఎప్పుడూ నిష్కల్మషమైన మనసుతో, హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడే చేసిన దానానికి తగిన ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.