
- సరికొత్త చరిత్రను లిఖించిన తెలుగువన్
- 10 బిలియన్ వ్యూస్ తో అత్యంత అరుదైన ఘనత సొంతం
భారతదేశపు తొలి యూట్యూబ్ ఛానెళ్లలో ఒకటిగా 'తెలుగువన్' పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ. వైవిధ్యమైన కంటెంట్ తో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న 'తెలుగువన్', ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అందుకుంది. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 1000 కోట్ల వ్యూస్ (10 బిలియన్ వ్యూస్)ను సాధించి, యూట్యూబ్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
శ్రీ కంఠంనేని రవిశంకర్ గారి మస్తిష్కం నుంచి పుట్టింది 'తెలుగువన్'. ఇంటర్నెట్ గురించి పెద్దగా ఎవరికి సమయంలోనే, భవిష్యత్ అంతా డిజిటల్ యుగమే అని ముందుచూపుతో ఆలోచించి.. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు కంఠంనేని రవిశంకర్. ఈ క్రమంలోనే వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ ప్రపంచవేదికపై తెలుగువారిని నెం.1 గా నిలపాలనే లక్ష్యంతో 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్ ను స్థాపించారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా గొప్ప సామ్రాజ్యంలా ఎదిగిందీ ఛానల్.
రెండు దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ, కోట్లాది కుటుంబాలలో భాగమైన 'తెలుగువన్'.. ఇప్పుడు 1000 కోట్ల వ్యూస్ తో సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సందర్భంగా 'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, రెండు దశాబ్దాలుగా తరగని ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ, మరిన్ని మైలురాళ్ళను అందుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.







