తరుణ్ బాబు... ఇదే ఆఖరి ఛాన్సు
on May 6, 2017

కెరీర్‌ని అద్భుతంగా ప్రారంభించి.... చటుక్కున కిందపడిపోయిన కథానాయకుల జాబితాలో తరుణ్ కూడా ఉంటాడు. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు.. ఇలా వరుస విజయాల్ని అందుకొన్న తరుణ్ కెరీర్ ఒక్కసారిగా అధః పాతాళానికి కూరుకుపోయింది. లవ్ స్టోరీల నుంచి మాస్ కథలవైపు మళ్లినా విజయం దక్కలేదు. కొన్నాళ్లుగా తరుణ్ నుంచి సినిమాలేం రాలేదు. మళ్లీ ఇంతకాలానికి ఇదీ నా లవ్ స్టోరీ సినిమాతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఇది వరకటి సినిమాల్లో కథల ఎంపిక విషయంలో ఎంత తప్పు చేశాడో, పబ్లిసిటీ విషయంలోనూ అంతే తప్పు చేశాడు. సరైన సమయంలో తన సినిమాల్ని విడుదల చేసుకోలేకపోయాడు. ఆ తప్పుల్ని విశ్లేషించుకొన్నాడేమో... ఈసారి పబ్లిసిటీ విషయంలో పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తున్నాడు. అందుకే టీజర్‌ని నాగార్జున చేతులమీదుగా తీసుకొచ్చాడు. ఆడియో ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేయాలని భావిస్తున్నాడట. అవసరమైతే ఎదురు డబ్బులు పెట్టి, పబ్లిసిటీ విషయంలో ఏలోటూ రాకూడదని ప్రయత్నిస్తున్నాడని సమాచారం. తరుణ్ గమనించాల్సింది ఏంటంటే... సాదాసీదా కథలతో సినిమా చేస్తేఎవ్వరూ పట్టించుకోరు. తరుణ్ నిలబడాలంటే, ప్రేక్షకుల్ని థియేటర్ వరకూ రప్పించుకోవాలంటే... కథలో, తన పాత్రల్లో ఏదో మ్యాజిక్ ఉండాల్సిందే. లేదంటే.. పబ్లిసిటీ కోసం ఎన్ని కోట్లు ధారబోసినా అనవసరమే. ఏదేమైనా తరుణ్‌కి ఇదే ఆఖరి ఛాన్స్. నిలదొక్కుకొన్నాడా సరే.. లేదంటే.. దుకాణం కట్టేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



