ఎక్కువ డైలాగులు చెప్పాను కదా..! కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించు
on Jul 26, 2017
మహానటుడు అక్కినేని నటించిన ‘శ్రీమంతుడు’సినిమా సెట్ లో ఓ గమ్మత్తయిన సంఘటన జరిగింది. ఆ సినిమాలో సూర్యకాంతం గారిది కీలకమైన పాత్ర. దర్శకుడు కె.ప్రత్యగాత్మ ఆమె పైనే సన్నివేశాన్ని
చిత్రీకరిస్తున్నారు. అప్పడు జరిగింది ఆ సంఘటన.
డైలాగ్ పేపర్ ని ముందు సూర్యకాంతానికి ఇచ్చారు. ఎదుట ఉన్న నటునిపై తిట్ల పురాణం లంకించుకునే సీన్ అది. అలాంటి సన్నివేశం అంటే ఇక చెప్పేదేముంది? సూర్యకాంతం అంటే ఏంటో తెలుసుగా...?
ఆమె ఓ రెండు నిమిషాలు డైలాగ్స్ చూసుకొని ‘ఓకే’ అన్నారు.
దర్శకుడు ‘సైలెన్స్... షాట్ రెడీ.... రోలింగ్... యాక్షన్’ అని పెద్దగా అరిచారు.
లొకేషన్ నిశ్శబ్ధం. సూర్యకాంతం పాత్రలోకి వెళ్లిపోయారు.. తన దైన శైలి ఎడమ చేతిని విసురుతూ... ఎదురున్న ఆర్టిస్ట్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు.
లొకేషన్లో వారందరూ స్టన్ అయిపోయి ఆమెను అలా చూస్తున్నారు.. అందరితో పాటు దర్శకుడు ప్రత్యగాత్మ కూడా విస్తుపోయి చూస్తుండి పోయారు. ఈ తన్మయత్వంలో పడి ‘కట్’ చెప్పడం కూడా
మరచిపోయాడు. సూర్యకాంతం మాత్రం డైలాగులు అయిపోయాక కూడా దర్శకుడు ‘కట్’ చెప్పకపోయే సరికి ..సొంత డైలాగులు అల్లుకొని చెప్పుకుంటూ వెళుతున్నారు.
అయినా... ఎంత సేపటికీ కట్ చెప్పకపోయే సరికి ఆమే ఆగిపోయి..‘ఏం నాయనా.. కట్ చెప్పవే?’ అని అడిగారు వెటకారం, కోపం కలిసి ఎక్స్ ప్రెషన్ తో. ఠమీమని స్పృహలోకి
వచ్చిన దర్శకుడు ప్రత్యగాత్మ... ‘ఏమీ లేదమ్మా... బాగుంది కదా... అందుకే అలా వదిలేసి చూస్తుండిపోయాం’అన్నాడట నవ్వుతూ.
‘అహా... బాగుందని అలా చూస్తుండి పోయావా? మా నాయనే... అదనంగా డైలాగులు చెప్పాను కదా... అంచేత మరికాస్త అదనంగా డబ్బులిప్పించరాదూ?’అని తడుముకోకుండా అనేశారట సూర్యకాంతం.
అంతే... లొకేషన్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయిందట. అయితే...
అక్కడే లొకేషన్లో కూర్చున్న నిర్మాతలు మాత్రం గతుక్కుమన్నారట.
దాదాపు 47 ఏళ్ల క్రితం జరిగిన ముచ్చట ఇది.
-నరసింహ బుర్రా
Also Read