శేఖర్ కమ్ములకు వానంటే ఎందుకంత ఇష్టం?
on Jul 30, 2017
వర్షం... ప్రకృతిలో ఓ అద్భుతం. వర్షాన్ని ఇష్టపడని వారు బహుశా ఉండరేమో. ఎందరో కవులకు వర్షం ఓ ప్రేరణ. భావాలను వ్యక్తీకరించలేని వారిని సైతం భావుకతలో ముంచి తేల్చే శక్తి వర్షానికి ఉందని ప్రత్యేకించి చెప్పాలా.
ఇక సకల కళల సమ్మేళనమైన సినిమాకు వర్షం నిజంగా ఓ ప్రత్యేక ఆకర్షణ. వర్షంలో పాటంటే ఆ క్రేజే వేరు. ఇక వర్షంలో ఫైట్ అంటే... ఆ కిక్కే వేరు.
సినిమా అంతా ఎలా ఉన్నా అందులో ఓ వర్షం పాట కానీ... ఓ వర్షం ఫైట్ కానీ ఉంటే... అది సినిమాకే స్పెషల్ అట్రాక్షన్. అప్పటిదాకా సినిమాను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న జనాలు.. వర్షం పాట రాగానే.. ఒక్కసారిగా అలెర్ట్ అయపోతారు.
మాస్ ప్రేక్షకులనే కాదు... క్లాస్ ప్రజానీకాన్ని కూడా ఒక్కోసారి వర్షం భలే మయ చేస్తుంటుంది. వర్షంలో తీసే కొన్ని సన్నివేశాలు... ప్రేక్షకులకు సైతం చలిపుట్టిస్తాయి. ఇలాంటి సన్నివేశాలు తీయడంలో ఇప్పుడు దర్శకుల్లో శేఖర్ కమ్ముల అగ్రగణ్యుడు.
అతని ‘ఆనంద్’ సినిమానే తీసుకోండి. అందులో ఓ సన్నివేశం ఉంది. రూప ఇంటి పక్క పోర్షన్ లో ఆనంద్ దిగుతాడు. సన్నివేశాలన్నీ సరదాగా ఆసక్తిగా సాగుతుంటాయి. అలాంటి సమయంలో ఓ సారి భోరున వర్షం. ఇంట్లో రూప వేడి వేడి పొకోడీలు వేసుకొని తింటూ ఉంటుంది. టీవీలో ‘మల్లీశ్వరి’లోని పాట. ‘మనసున మల్లెల మాలలూగెనే...’...అబ్బబ్బబ్బా వాట్ ఏ రొమాంటిక్ సిట్యూవేషన్. సరిగ్గా అలాంటి టైమ్ లో ఆనంద్ అక్కడికి వస్తాడు. వాతావరణ ప్రభావం మనసుపై చాలా బలంగానే ఉంటుంది. అలాంటి సిట్యూవేషన్లో అమ్మాయికీ అబ్బాయికీ ప్రేమ చిగురించకుండా ఉంటుందా! చెప్పండి?
‘గోదావరి’లో కూడా శేఖర్ ఇలాంటి మేజిక్కే చేశాడు. ఉందేమో గోదారి మధ్య... చుట్టూ పాపికొండలు. అలాంటి ప్లేస్ లో వాన మొదలైతే... మనసు తడవకుండా ఉంటుందా? పైగా అమ్మాయి పేరు సీత అయితే... అబ్బాయి పేరు రామ. పైకి కోపతాపాలు ఎన్నున్నా... అంతర్లీనంగా మాత్రం ప్రేమ పుట్టడం ఖాయం. ఆ సినిమాలో కూడా అదే జరిగింది.
శేఖర్ కమ్ములకు వాన అనేది సెంటిమెంటో ఏమో కానీ... ‘హ్యాపీడేస్’లో కూడా హీరోహీరోయిన్లను కలపడానికి వాననే వాడుకున్నాడు.
‘ఫస్ట్ టైమ్ నా బైక్ మీద నా చెల్లెలు కాకుండా ఇంకో అమ్మాయి... అది కూడా ఓణీలో... అది కూడా వానలో’అంటూ పులకించిపోతాడు అందులో వరుణ్ సందేశ్. అతని పాత్ర పేరు చందు. తమన్నా పాత్ర పేరు ఇందు. చక్కగా ఇందూని బైక్ ఎక్కించుకొని వానలోనే షికార్లు కొడతాడు.
పైన వర్షం... పక్కన అందమైన అమ్మాయి. చెట్టుకింద బైక్ ఆపి... వేడి వేడిగా కాలిన కండెల్ని ఇద్దరూ కలిసి తింటుంటే... అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. కుర్రాళ్ల మనసులోని ఊహలకు అందమైన రూపాన్నిచ్చి.. తెరపై ఉన్నతారల్లో తమకు తాము చూసుకునేట్టుగా చేసే మాయగాడు శేఖర్ కమ్ముల. ‘హ్యాపీడేస్’ విషయంలో జరిగింది అదే కదా!
సోయిలేని హాయిలో ఉన్నప్పుడు... గాలివాన కమ్ముకుందనుకోండి... ఇక లోనంతా గిలిగింతలేగా? అలాంటి సమయంలో ఒక్కరే ఉంటే ఓ బాధ.. తోడుంటే ఇంకో బాధ... ‘ఫిదా’లో ఆ జంట ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి. స్నేహానికీ, ప్రేమకూ మధ్యలో ఉన్న ఓ దారపు పోగుని వర్షంలో తడిపి తెగొట్టాడు శేఖర్ కమ్ముల. దాంతో ఆ ప్రేమ వర్షంలో ప్రేక్షకులు కూడా తడిసి ముద్దయిపోతున్నారంటే నమ్మండి.
మొత్తంగా ఈ శేఖర్ కమ్ముల గారికి కోటి వందనాలు... ఆయన ‘వాన’కు శతకోటి వందనాలు. ఇలాగే... తన సెంటిమెంట్ ని కొనసాగిస్తూ... ప్రేక్షక హృదయాలలో జడివానలు కురిపించాలని ఆశిస్తూ... మీ తెలుగువన్.