షకీలా జీవితంపై సినిమా..!
on Jun 11, 2016
షకీలా..ఈ పేరు కొన్నేళ్ల క్రితం ఇండియాలోని బీగ్రేడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలకైతే కొన్ని చోట్ల స్టార్ హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ లభించేవి. రికార్డ్స్ సృష్టించేవి. మళయాళం స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లు కూడా ఆమె సినిమా రిలీజవుతున్నప్పుడు జంకేవారంటే షకీలా హవా ఎంతలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఆ తర్వాత ఆమె ప్రభ తగ్గుతూ వచ్చింది. సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. తను ఇంతలా డౌన్ అవ్వడానికి గల కారణాలను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిందామె. ఇలాంటి ఎత్తు పల్లాలున్న షకీలా జీవితాన్ని ఒక సినిమాగా మలచాలనే ఆలోచన చేస్తున్నాడు కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్. ఆమె జీవితంపై పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన లంకేష్, త్వరలోనే హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రగా షకీలా బయోపిక్ ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. కన్నడ, హిందీ భాషల్లో సినిమాను తీసి, ఆ తర్వాత మిగిలిన దక్షిణ భారత భాషల్లోకి సినిమాను డబ్ చేస్తారని సమాచారం. సినిమాలో నటించడం కోసం, హ్యూమా ఖురేషీ తన శరీరాన్ని షకీలా శరీరంలా మార్చుకోవడం విశేషం.