ENGLISH | TELUGU  

శేఖర్ కమ్ముల సినిమాలు ఎడారిలో ఒయాసీస్సులు

on Jul 21, 2017

చూడ్డానికి ఇంగ్లిషు మాస్టారిలా కనిపిస్తాడు గానీ... దర్శకుడు శేఖర్ కమ్ముల మహా రొమాంటిక్. ఎందుకలా అనిపించింది! అనుకుంటున్నారా? శేఖర్ హీరోయిన్లను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకే అర్థమవుతుంది. బాపూ బొమ్మల్లాగా... శేఖర్ హీరోయిన్లు కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంటారు. 

ఉదాహరణకు ‘ఆనంద్’లో కమలినీ ముఖర్జీ. అబ్బబ్బబ్బా! ఆ చీరకట్టులో... అప్పుడే ఫ్రిజ్ లోంచి తీసిన పెరుగు కప్పులా ఉంటుంది. ‘గోదావరి’లో అయితే... ఇక చెప్పేదేముంది ఆ పాపి కొండల్ని చూడాలో... ఆమె నడుము ఒంపుల్ని చూడాలో అర్థం కాదు. ఇక తమన్నా... ‘హ్యాపీడేస్’ ఏ ముహూర్తాన విడుదలైందో... ఈ మిల్కీబ్యూటీకి అన్నీ హ్యాపీడేసే. అప్పటికి తను రెండుమూడు సినిమాల్లో చేసినా... ఆ అందాన్ని ఎవరూ సెల్యులాయిడ్ పై సరిగ్గా ఆవిష్కరించలేకపోయారు. ‘శంఖంలో పోస్తేనే తీర్థం’ అంటారు కదా! అలాగే... శేఖర్ కమ్ముల చేతిలో పడింది. సినిమా విడుదలైంది. ఇంకేముందీ... యూత్ పల్స్ రేట్ పెరిగిపోయింది. లేడి కళ్ల లేజర్లా... ప్యారడైజ్ ఫ్లవర్లా ఉన్న తమన్నాను చూసి కుర్రకారు కిర్రెత్తిపోయారు. అమ్మాయిలైతే... తమన్నాల్లా మారిపోయారు. అది శేఖర్ కమ్ముల అంటే..

‘లీడర్’సినిమాలో ఇద్దరమ్మాయిల్ని తెరకు పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల. ఒకమ్మాయి అప్పడే కొన్న న్యూ జనరేషన్ ఐఫోన్ లా ఉంటుంది. ఇంకో అమ్మాయి మంచులో తడిసిన మల్లెపూలా ఉంటుంది. ఇది కుర్రాళ్ల ఒపీనియన్. ఇంతకీ ఆ అమ్మాయిల పేర్లు చెప్పలేదు కదూ... రీచా గంగోపాథ్యాయ, ప్రియా ఆనంద్. ఈ ఇద్దరమ్మాయిలూ... కొన్నాళ్ల పాటు వెండితెరను వండేసుకున్నారు. 

ఏది ఏమైనా.. శేఖర్ కమ్ముల హీరోయిన్లను సెలక్ట్ చేసే విధానమే భిన్నంగా ఉంటుందబ్బా...  కంటికి వంటికీ నచ్చే అందాల్ని తను సెలక్ట్ చేయడు. మనసుకు నచ్చే అందాల్ని సెలక్ట్ చేస్తాడు. అందుకే అతను శేఖర్ కమ్ముల. ఇప్పుడందరూ సాయి పల్లవి గురించే మాట్లాడుకుంటున్నారంటే కారణం అదే. కుర్రాళ్లయితే... ఆ అమ్మాయిలోని నాచులర్ బ్యూటీని చూసి ‘ఫీదా’ అయిపోయారంటే నమ్మండి. లేత తమలపాకు లాంటి ఆ సోయగం... ఆ ఉంగరాల జుత్తు.. బుగ్గల మీద ఆ పింపుల్స్... ఓ కొత్త అనుభూతిని రేకెత్తించే అందం.. సాయి పల్లవి సొంతం. అయితే... ఆ అందాన్ని శేఖర్ కమ్ముల చూపించడం కూడా భిన్నంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే... తన హీరోయిన్లందరూ డిగ్నిఫైడ్ గా... కాస్తంత గంభీరంగా, ఎడ్యుకేటెడ్స్ గా ముక్కు మీద కోపంతో, ముక్కు సూటిగా మాట్లాడేస్తూ కనిపిస్తారు. కానీ... ఇటీవల విడుడలైన ‘ఫీదా’ ట్రైలర్స్ లో ఈ అమ్మాయి మాత్రం పల్లెటూరి అల్లరి పిల్లగా, తెలంగాణ యాసలో న్యూ లుక్ తో..  అదరగొట్టేస్తోంది. ఏదైనా శేఖర్ కమ్ముల దృక్కోణంలోనే ఉంటుంది ఆ ఫ్రెష్ నెస్. 

‘ఫీదా’ తర్వాత తెలుగు తెరపై సాయిపల్లవి హవా మొదలవ్వడం ఖాయం అని అప్పుడే ఫిలిం వర్గాల టాక్. ఇక దర్శకునిగా శేఖర్ కమ్ముల గురించి చెప్పుకుంటే... నిజంగా గర్వంగా అనిపిస్తుంది. కోట్లు గుమ్మరించే ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. సినిమా మీదున్న పేషన్ తో దర్శకుడయ్యాడు శేఖర్. ‘డాలర్ డ్రీమ్స్’తో డైరెక్టర్ అవ్వాలనుకున్న తన డ్రీమ్ ని నిజం చేసుకున్నాడు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్... ఇలా శేఖర్ కమ్ముల తీసిన ఏ సినిమా తీసుకున్నా... ఉన్నత విలువలు ఉన్నతంగానే ఉంటాయి. నైతిక విలువలతో కూడిన ఆధునిక  భావాలు శేఖర్ కమ్ముల సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. 

అతిశయోక్తి అంటేరేమో కానీ... బాపూ గారి సినిమాల్లో కనిపించే తెలుగుదనం... కాస్తోకూస్తో... శేఖర్ కమ్ముల సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఇది నిజం అందుకే... కేవలం కుర్రాళ్లకే కాకుండా... అన్ని వయసుల వారికీ అభిమాన దర్శకుడయ్యాడాయన. ఎందరో యువ దర్శకులకు కూడా ఆదర్శమయ్యాడు. 

శేఖర్ కమ్ముల సినిమాలు ఎండాకాలపు ఉదయాలు... 
శేఖర్ కమ్ముల సినిమాలు చలికాలపు సాయంకాలాలు...
విలువలకు వలువలు ఊడిపోతున్న నేటి తరుణంలో... శేఖర్ కమ్ముల సినిమాలు ఎడారిలో ఒయాసీస్సులు.  

 

-నరసింహ బుర్రా


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.