మెగా ఫ్యాన్స్!... ఇక పండగ చేసుకోండి!
on Jul 28, 2017
‘మెగా ఫ్యామిలీలో పొరపచ్చులు ఉన్నాయట’. ‘అన్నదమ్ములకు అస్సలు పడటం లేదట’. ‘అబ్బాయి మీద బాబాయ్ గుర్రుగా ఉన్నాడట’.. పొద్దున లేచిందగ్గర్నుంచీ ఈ గాలివార్తలే... కొందరికి టైమ్ పాస్ బటాణీలు. చిరంజీవి కుటుంబం విషయంలోనే ఎందుకొస్తుంటాయ్ ఈ పుకార్లు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. కాయలున్న చెట్లకే కదా... రాళ్ల దెబ్బలు. మీడియా ఎన్ని కథనాలు అల్లినా... సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు షికార్లు చేసినా... నిజానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కలిసే ఉంది. వారి సినిమాల రిలీజుల్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. అది ఎంత నిజమో అర్థమవుతుంది. బాబాయ్ సినిమా విడుదలవుతుందంటే... పొరపాటున కూడా చరణ్ తన సినిమాను విడుదల చేయడు. తన సినిమా పూర్తయినా... ఆపుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
చరణ్ అప్పుడప్పుడు బాబాయ్ దగ్గరకెళ్లి కలిసి రావడం, పవన్ ఖాళీ దొరికినప్పుడు అన్నావదినలను పలకరించి రావడం చూస్తూనే ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ పుకార్లన్నింటికీ తెర దించుతూ... త్వరలో చరణ్ కథానాయకునిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడట పవర్ స్టార్. ఈ సినిమా పట్టాలెక్కితే... చాలామంది గాసిప్పు రాయుళ్ల నోళ్లకు మూతలు పడతాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించిన పవర్ స్టార్... ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రం నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. ఇంతకీ అబ్బాయితో బాబాయ్ నిర్మించబోతున్న ఆ చిత్రానికి దర్శకుడెవరో చెప్పనే లేదు కదూ.... త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన ఓ కథ పవన్ కి బాగా నచ్చిందట. ‘ఈ కథ చరణ్ కి బావుంటుంది. మీరే దర్శకుడైతే ఇంకా బావుంటుంది’ అని త్రివిక్రమ్ ని కూడా ఒప్పించారట పవన్. ఇక అబ్బాయికి బాబాయి మాటంటే శాసనమేగా. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనమాట. మెగా అభిమానులకు ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
