బడ్జెట్ తడిసి మోపెడయ్యిందట!
on Aug 8, 2017
ఎప్పుడైతే పవర్ స్టార్ సినిమా షూటింగ్ మొదలైందో... అప్పట్నుంచే అభిమానుల ఎదురు చూపులూ మొదలవుతాయి. ఆయన సినిమాపై వారికుండే ప్రేమ అలాంటిది. త్రివిక్రమ్-పవర్ స్టార్ సినిమా మొదలైనప్పట్నుంచీ షూటింగ్ అప్ డేట్లన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు విషయంలో మాత్రం వారు చాలా అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లొకెళ్తే...
వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలని ముందనుకున్నారు. కానీ.. నిర్మాణం నత్త నడకతో సాగుతుండటంతో ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించినట్లు టాక్. అదీ కుదరని పక్షంలో సంక్రాంతికీ, అదీ కుదరపోతే... సమ్మర్లో విడుదల చేయడానికి కూడా షెడ్యూళ్లని ప్రిపేర్ చేశారని వినికిడి. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పడం ఇత్యాది కారణాలే ఈ సినిమా నిర్మాణ జాప్యానికి కారణం అని తెలుస్తోంది. మరో వైపు పవన్ కి కుదిరినప్పుడు మిగిలిన నటీనటుల డేట్లు అడ్జస్ట్ కాకపోవడం కూడా ఈ సినిమా విషయంలో ఇబ్బందిగా మారిందని యూనిట్ వర్గాల సమాచారం.
ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ 95 కోట్లు. అయితే.. ఈ అంతరాయాల వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ ఏకంగా 128 కోట్లకు చేరినట్టు తెలిసింది. పవన్ కెరీర్ లో ఇప్పటి వరకూ వేయని పెద్ద పెద్ద సెట్లు ఈ సినిమా కోసం వేశారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ఈ సెట్ లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ఇంత వరకూ ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదు. అయితే... ‘సాఫ్ట్ వేర్ ఇంజనీర్’, ‘గోపాలకృష్ణుడు’అనే రెండు టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో... అభిమానుల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో.