ఎన్టీఆర్ కు జపాన్ ఫ్యాన్ షాక్..!
on Apr 26, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కేవలం మనదేశంలోనే కాక వేరే దేశాల్లో కూడా అభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లకు లెక్క లేదు. ఇండియాలో రజనీ కాంత్ తర్వాత జపనీస్ ఎక్కువగా ఆదరించేది ఎన్టీఆర్ సినిమాలనే. తారక్ సినిమాలు చాలా వరకూ జపనీస్ లో కూడా డబ్ అవుతుంటాయి. బాద్ షా సినిమా జపాన్ లో సూపర్ హిట్ కూడా. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కు జపాన్ లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చూపించే సంఘటన ఒకటి జరిగింది. నాన్ అనే ఒక జపనీస్ మహిళా అభిమాని ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ ఏకంగా జనతా గ్యారేజ్ సెట్ కు వచ్చేసింది. మంగళవారానికి హైదరాబాద్ చేరుకున్న అభిమాని, ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సెట్లో ఉన్నాడని తెలుసుకుని డైరెక్ట్ గా అక్కడికే వెళ్లిపోయి తారక్ ను కలిసింది.
ఎన్టీఆర్ ను కలిసిన తర్వాత ఆమె ఆనందానికి హద్దు లేదు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ తెలుగులో చెప్పి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకూ తారక్ చేసిన ఏ సినిమాను తాను మిస్ కాలేదని చెబుతోందీ వీరాభిమాని. ఎన్టీఆర్ తన కారవాన్ లో కూర్చోబెట్టి ఆమె చెప్పినవన్నీ వినడం విశేషం. త్వరలోనే తాను తెలుగు నేర్చేసుకుంటానని, తెలుగంటే తనకు చాలా ఇష్టమని చెప్పడమే కాక, నాకు తెలుగంటే చాలా ఇష్టం అని తెలుగులో రాసి ఉన్న టీషర్ట్ ను వేసుకుని వచ్చింది. ఎన్టీఆర్ తో పాటు, యూనిట్ మొత్తానికి ఈ అభిమాని రాక ఫుల్ జోష్ ను ఇచ్చింది. కాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జనతా గ్యారేజ్ ఆగష్ట్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



