ఫిదా మూవీ రివ్యూ: అందర్నీ ‘ఫిదా’చేసేసినరు బయ్...
on Jul 21, 2017
చేసిన పుణ్యమా అని ‘సినిమా వాళ్లు’అయ్యేవారు కొందరైతే... సినిమానే చేసిన పుణ్యమా అని ‘సినిమా వాళ్లు’ అయ్యేవారు కొందరు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెండో కోవకు చెందిన సినిమావాడు. ‘ఫీదా’చూసిన తర్వాత ఎవరి అభిప్రాయమైనా ఇలాగే ఉంటుంది.
సాధారణంగా శుభం కార్డ్ పడగానే... అది ‘హిట్’ సినిమా కావచ్చూ... ‘ఫట్’ సినిమా కావచ్చు... జనాలు మాత్రం మౌనంగా థియేటర్ నుంచి బయటకు వస్తుంటారు. ఇక జడ్జిమెంట్ అంటారా! మీడియా రిపోర్ట్ ఎలా వున్నా... అసలు రిపోర్ట్ మాత్రం సాయంత్రం లోపు ఎలాగూ వచ్చేస్తుంది. కానీ సాయంత్రం దాకా కూడా ఆగకుండా... సినిమా పూర్తయి టైటిల్స్ దిగుతుంటే... ఆడియన్స్ అందరూ పైకి లేచి, అలాగే నిలబడి.. కాసేపు చప్పట్లు కొడుతూ.. అక్కడే సినిమా విజయాన్ని ప్రకటించేయటం ఎప్పుడైనా చూశారా? అది జరిగింది. శేఖర్ కమ్ముల ‘ఫీదా’సినిమాకు జరిగింది. నాకు తెలిసి ఓ వంద రోజుల పాటు అలా జరుగుతూనే ఉంటుంది. అంటే.. సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోండి.
ఈ సినిమా కథను లోతుగా పరిశీలిస్తే... శేఖర్ కమ్ముల తన ప్రేమకథనే సినిమాగా తీశాడా? అనిపిస్తుంది. అదిలెగంటారా?
ఇందులో హీరో ... ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికాలోని తన విలువైన జీవితాన్ని కూడా వదిలేసి ‘ప్రేమే నా జీవితం’ అంటూ ఇండియా వచ్చేస్తాడు. శేఖర్ కమ్ముల కూడా అంతే కదా... సినిమాను ప్రేమించాడు. ఆ సినిమా కోసం విలువైన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ప్రస్తుతం ఆ ప్రేమలోనే మునిగి తేలుతున్నాడు. సినిమాను అంతగా ప్రేమిస్తాడు కాబట్టే... సినిమాలు ఇంతబాగా తీయగలుగుతున్నాడు.
ఈ సినిమాకు రివ్యూలు గట్రా.. రాయడం నిజంగా అనవసరం. ఎందుకంటే... ఊరకే అది బాగుందీ... ఇది బాలేదూ అని రాసుకుంటూ పోతే... మామూలు సినిమాకీ... శేఖర్ కమ్ముల సినిమాకీ పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి. అందుకే... సరదాగా కాసేపు సినిమా గురించి ముచ్చటించుకుందాం. పొద్దున్నే చక్కగా తెల్లారిందనుకోండి. ఆ ఉషోదయం చూడ్డానికి ఎలా ఉంటుంది. సరిగ్గా అలా ఉంది ఈ సినిమా. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తూ వుంటే... ‘ఎప్పుడూ అయిపోతాయా...!’ అనిపించింది. కానీ ఈ సినిమా చూస్తుంటే.. ‘అప్పుడే అయిపోతుందేమో.!’అని బెంగేసింది. అంతగా ఇబ్బంది పెట్టేశాడు శేఖర్ కమ్ముల.
అప్పుడెప్పుడో... కె.విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరోయిన్లు.. ఇంటిపై ఒడియాలు ఎండపెడుతూ... అప్పడాలు అమ్ముకుంటూ... చక్కగా చీరకట్టుకొని పక్కింటి అమ్మాయిల్లా కనిపించేవారు. అలాంటి అమ్మాయిలు తెరపై కనిపించి ఎన్నాళ్లయ్యింది చెప్పండి? ఆ బాధను ‘ఫిదా’తో తీర్చేశాడు శేఖర్ కమ్ముల.
చక్కగా ఇందులో హీరోయిన్ అమ్మ చెప్పిందని కొట్టుకెళ్లి కోడిగుడ్లు, శనగపిండి తెస్తుంది.
చక్కగా ఇందులో హీరోయిన్ అమ్మ చెప్పిందని పక్కింటికెళ్లి ఉసిరికాయ పచ్చడి తెస్తుంది.
ట్రాక్టర్ ఎక్కి దర్జాగా పొలం దున్నుతుంది. అందంగా చీరకట్టుకొని... బతుకమ్మ ఆడుతుంది.
అల్లరి చేస్తుంది... ఆటపట్టిస్తుంది... మన ఇంటి అమ్మాయో.. లేక పొరిగింటి అమ్మాయో అనిపిస్తుంది.
ఆ పొగరు... ఆ వగరు... ఆ వయ్యారం... ఆ కొంటెతనం... ఆ నవ్వు... ఆ ముక్కుమీద కోపం... ఆ ముక్కుసూటి తనం...
అబ్బబ్బబ్బా.. ఏం సాయిపల్లవి అండీ బాబూ... ఆ అమ్మాయికి నటించడం అస్సలు చేతకాదు. బిహేవ్ చేయడమే తెలుసు. తెరపై ఆ బిహేవియర్ తోనే ప్రేక్షకుల్ని కళ్లు తిప్పుకోనీయకుండా చేసిందంటే నమ్మండి. అచ్చు ఆరణాల తెలంగాణ అమ్మాయి ఎలా ఉంటుందంటే... సాయిపల్లవిలా ఉంటుంది. ఆ అమ్మాయి దెబ్బకు రెండు రాష్ట్రాల కుర్రకారూ ‘ఫీదా’అయిపోవడం ఖాయం. ఓ అయిదారేళ్లు సాయిపల్లవివే. రాసేసుకోవచ్చు. తెలంగాణ యాస అందంగా ఉంటుందని తెలుసుకానీ... మరీ ఇంత అందంగా ఉంటుందా? అనిపించింది ఈ సినిమా చూస్తే.. ‘గట్టిగనుకో... జరుగుద్దిలే...’అని కొంటెగా చూస్తూ సాయి పల్లవి అంటుంటే.. మనసంతా అదోలా అయిపోయిందండీ.
తెలంగాణ యాస, సంప్రదాయాలు, నమ్మకాలు... మనుషులు... వారి మనసులు.. వీటన్నింటికీ అద్దం పట్టేశాడు శేఖర్ కమ్ముల. అనవసరపు పాత్ర గానీ... అనవసరపు సన్నివేశం కానీ... బూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఇక సినిమాను నడిపించే తీరు అంటారా? చెప్పానుగా,,! అప్పుడే అయిపోయిందా.. అనిపించాడు. శేఖరా మజాకా. ఇక వరుణ్ తేజ్... హీమేన్. చక్కగా తూకానికి తగ్గట్టుగా ఎక్కువ, తక్కువ లేకుండా చేశాడు. సునిశితమైన చిన్న చిన్న భావాలు కూడా అతనిలో ఈజీగా పలుకుతున్నాయి. నాకు తెలిసి... తన కెరీర్ లో ఇప్పటి దాకా అయితే... ‘ఫిదా’నే బెస్ట్.
మనం ఇన్నాళ్లూ తెరపై కోనసీమ అందాలను మాత్రమే చూశాం. ‘ఫీదా’ చూస్తే తెలంగాణ అందం ఎంటో తెలుస్తది. నిజం బయ్. కెమెరామేన్ జబర్దస్త్ గా చేసిండు. సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల. ఏం గొట్టిండిరా బయ్. పాటలు వండర్ అన్నట్టు. మన పాత ‘మల్లీశ్వరి’గుర్తున్నదా...! ఆ సంగీతం యాదొచ్చిందంటే.. నమ్మండి. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. ‘బొమ్మరిల్లు’ తర్వాత ‘దిల్’రాజు సారుకు.. ఆ రేంజ్ హిట్ లే. ఆ లోటు కూడా ‘ఫిదా’తీర్చేస్తది. అమ్మతోడు బయ్. మొత్తంగా... ప్రేక్షకులు... గుండెల నిండా సంతోషాన్ని.. కళ్ల నిండా ఆనందాన్ని నింపుకొని... రెండు గంటల పాటు చెదరని చిరునవ్వులతో... అలా చూస్తూ కుర్చునేటట్లు చేసిన శేఖర్ కమ్ములకు మనం థ్యాంక్స్ చెప్పక తప్పదు.
ఇక రేటింగులు దేనికి బయ్.. ఇంటిల్లిపాది ఎల్లి చూసొచ్చేయాలని గట్టిగ అనుకోండి. జరుగుద్దిలే
- నరసింహ బుర్రా