Home

»

Latest News

'వెంకీమామ' మూవీకీ, బాబీ మేనమామలకీ లింకేమిటి?

Dec 12, 2019 5:30PM

 

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటించిన 'వెంకీమామ' సినిమా శుక్రవారం (డిసెంబెర్ 13) విడుదలవుతోంది. నాగచైతన్యకు ఈ చిత్ర నిర్మాత సురేశ్‌బాబు పెద్ద మేనమామ అయితే, వెంకటేశ్ చిన్న మేనమామ అనే విషయం తెలిసిందే. సినిమాలోనూ చైతన్యకు వెంకీ మేనమామగా నటించారు. కాగా ఈ సినిమా దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర)కీ, ఈ సినిమా కథకీ కూడా లింక్ ఉంది. అదేమిటో బాబీ మాటల్లోనే చదువుదాం.

"ఇక నాకు ముగ్గురు మేనమామలు. డీబాబు అని మా రెండో మావయ్య ఉండేవాడు. ఆయన అసలు పేరు ప్రభాకర్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయినప్పటికీ నా చిన్నతనంలో నా బర్త్‌డేని మా నాన్న గ్రాండ్‌గా చేసేవాడు. ఆయన చిట్‌ఫండ్ బిజినెస్ చేసేవాడు. చిట్టీలు పాడుకున్నవాళ్లు డబ్బులు కట్టకపోవడంతో ప్రతి సంవత్సరం నష్టాల్లో ఉండేవాళ్లం. నేను మూడో క్లాసులో ఉన్నప్పుడు ఆ సంవత్సరం నా బర్త్‌డే జరుపుతారా, లేదా అని అనుకుంటున్నా. డీ మావయ్య ఆర్టీసీ డ్రైవర్. ఖాకీ డ్రస్సు కోసం ఆయనకు ప్రైతి ఏటా రెండు తాన్లు ఇచ్చేవాళ్లు. మా పరిస్థితి అర్థం చేసుకొని ఆ తానులోంచి నాకొక చొక్కా కుట్టించి, బాబీ అనే నా ముద్దుపేరులోని 'బి'అనే తొలి అక్షరంతో ఎంబ్రాయిడరీ చేయించి ఇచ్చాడు. విధి ఎలా ఉంటుందో చూడండి. నేను తొమ్మిదో క్లాసులో ఉన్నప్పుడు ఆ మావయ్య చనిపోయాడు. కానీ ఆయనిచ్చిన ఆ షర్టు మాత్రం నా బెడ్రూంలోని వార్డ్‌రోబ్‌లో ఇప్పటికీ అలాగే ఉంది. నేను జీవితంలో మేనమామ మీద సినిమా తీస్తానని ఆ క్షణంలో నాకు తెలీదు. ఇలా సినిమా రూపంలో మేనమామ గురించి చెప్తానని కాబోలు ఆ గుర్తు అలా నిలిచిపోయింది. 'వెంకీమామ' స్టార్ట్ చేసినప్పుడు మా పెద్దమావయ్య.. ఆయన పేరు సాయి.. "ఏరా మన సినిమానే తీస్తున్నావా? మన కథే తీస్తున్నావా?" అని ఆటపట్టిస్తూ ఉండేవాడు. సినిమా సగం షూటింగ్ అయ్యాక హార్ట్ ఎటాక్‌తో ఆయనా చనిపోయాడు. అలా ఈ సినిమాతో ఆ మావయ్యల జ్ఞాపకాలు ముడిపడిపోయాయి." అని చెప్పుకొచ్చాడు బాబీ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com