Home

»

Latest News

ఈ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నారా.. మీరు బాహుబలి చూసినట్లే

Apr 25, 2017 3:34PM

బాహుబలి-2కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా టిక్కెట్లను పూర్తి స్థాయిలో ఇంకా ఆన్‌లైన్‌లో పెట్టలేదు..ఇలా పెడితే అలా అమ్ముడయ్యేలా ఉంది పరిస్థితి. బాహుబలికి జనంలో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి అనేక సంస్థలు రంగంలోకి దిగాయి. చాక్లెట్స్, పతంగులు, డ్రస్సులు, ఆఖరికి భోజనానికి కూడా బాహుబలి పేర్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదంతా పక్కనబెడితే..లేని టిక్కెట్లను ఉన్నట్లుగా ఆశ చూపించి కోట్లు కొల్లగొట్టింది ఒక దొంగ సంస్థ. www.newtickets.in పేరిట ఒక వెబ్‌సైట్ ప్రారంభించి టిక్కెట్లు అమ్మకానికి పెట్టింది.

హైదరాబాద్‌తో పాటు అమెరికా, ఇంగ్లాండ్‌లోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. ఇంకేముంది బాహుబలి అభిమానులు సైట్‌లోకి వెళితే థియేటర్ల పేర్లన్నీ ప్రత్యక్షమవుతూ, సీట్లు కూడా కనిపిస్తుండటం..టిక్కెట్ బుక్ చేసుకుని..ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించగానే మొబైల్‌కు మెసేజ్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు..అయితే మొత్తం హైదరాబాద్ నగరంలోని సినిమా హాళ్ల పేర్లన్నీ సైట్లో ఉండటం..ప్రతీ ఆటకు టిక్కెట్లు ఖాళీగా ఉండటంతో అనుమానమొచ్చిన కొందరు సైబర్‌ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం డొంక కదిలింది.

ఈ సైట్ ఐపీ దుబాయ్‌లో ఉన్నట్లు చూపించిందనీ..కోయంబత్తూర్ చిరునామాతో ఈ నెల 7న వెబ్‌సైట్ రిజిస్టర్ చేయించారని..ఏడాది కోసం సర్వర్‌ను లీజుకు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నగదు లావాదేవీలకు పేయూమనీతో ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ సైట్‌‌తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పలు థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఇప్పటికే అనేకమంది అమాయకులు ఈ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు కొన్నారు..టిక్కెట్లు పొందినట్లు వారి మొబైల్స్‌కు మెసేజ్ రావడంతో..సినిమా విడుదల రోజున పెద్ద గందరగోళం జరిగే అవకాశాలున్నాయి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com