అరవింద్ గారూ... ఇక మీరెళ్లచ్చు
on Jul 29, 2017
సినిమా ఫంక్షన్లలో ఆర్.నారాయణమూర్తి ఉంటే.. ఆ కిక్కే వేరెబ్బా. ఆయన ప్రసంగించే తీరు చూస్తే... ఎవరైనా ‘సాహో’... అనాల్సిందే. సినిమా సెలబ్రిటీల్లో నారాయణమూర్తి శైలే భిన్నం. ఆయనకు శత్రువులు ఉండరు. అందుకని మిత్రులూ ఉండరు. కడుపులో ఏమీ దాచుకోకుండా నిర్మొహమాటంగా మాట్లాడతారు కాబట్టే... చిత్రసీమలో అందరూ నారాయణమూర్తిని అభిమానిస్తుంటారు. సినిమా నచ్చితే... అది పిలవని పేరంటమైనా సరే... సదరు సినిమా వేడుకకకు వచ్చి అభినందించి వెళ్లడం ఆయన స్టైల్. ‘ఫిదా’ సినిమా విషయంలో అలాగే చేశారాయన. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ‘ఫిదా’సంబరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమ్ అంతా అక్కడ టపాసులు కాల్చి హంగామా చేశారు. నిజానికి ఈ వేడుకకు నారాయణమూర్తిని పిలవలేదు.
ప్రసాద్ ల్యాబ్ పరిసరాల్లోనే ఎక్కువ మసలే నారాయణమూర్తి... ఆ టపాసుల శబ్దాలు విని... ప్రసాద్ ల్యాబ్ లోని ప్రివ్యూ థియేటర్ లోకి వచ్చారు. ఆయన ఆగమనంతో... చిత్రం యూనిట్ కూడా సంతోషంగా ఆయన్ను వేదిక మీదకు ఆహ్వానించారు. ప్రసంగించాల్సిందిగా మైక్ ని అందించారు. అప్పటిదాకా ఆ కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిగత బాధ్యత కారణంలో మధ్యలో వెళ్లిపోబోతున్న అల్లు అరవింద్ ని ‘అరవింద్ గారూ మీరు ఆగాలి’ అని తనదైన శైలిలో గద్దించారు నారాయణమూర్తి. దాంతో అరవింద్ ఆగిపోయారు.
‘బన్నీలాంటి కొడుకు పుట్టడం మీ అదృష్టం. ఏం డాన్సరండీ ఆ అబ్బాయ్. ఇక్కడ అసందర్భమైనా చెప్పాలనుకుంటున్నా. అరవింద్ గారూ!... దిల్ రాజు గారూ..! మీరు వినాలి. డాన్సుల విషయంలో ప్రపంచంలోనే ఎంతో మందికి ఆదర్శం మైకేల్ జాక్సన్. మీలో ఎవరో ఒకరు ఆయన బయోపిక్ తీయాలి. దాంట్లో మైకేల్ పాత్రను అల్లు అర్జున్ తో నటింపజేయాలి. మీరు చేయగలరు. ఆలోచించండి.’అని వారికి సూచించారు. అంతటితో ఆగకుండా... ‘అరవింద్ గారూ ఇక మీరు వెళ్లొచ్చు. మీ అబ్బాయి గురించి చెబుతున్నానను కాబట్టి మీరు వినాలని ఆగమన్నాను. ఇక మీరు వెళ్లండి’ అని నిర్మొహమాటంగా అన్నారు నారాయణమూర్తి. ఆయన మాట కరకుగా ఉంటుందని, మనసు మాత్రం వెన్నే అని అందరికీ తెలిసిందే. ‘ఫిదా’డైరెక్టర్ శేఖర్ కమ్ములను తెలుగు హృషికేశ్ ముఖర్జీగా అభివర్ణించారు నారాయణమూర్తి.
మూలాలు ఆంధ్రావి అయినా... తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన శేఖర్ కమ్ములను అభినందించకుండా ఉండలేకపోతున్నాననీ... ఆ సినిమా చూసి నిజంగానే ‘ఫీదా’ అయిపోయానానీ నారాయణమూర్తి ఉద్వేగంగా అన్నారు. ‘దిల్’రాజు ఇలా వరుసగా విజయాలు సాధిస్తున్నాడంటే దానికి కారణం ఆయన భార్యే నని. పై లోకంలో ఉన్న ఆమె ఆశీస్సులే విజయాల రూపంలో ఆయనకు దక్కుతున్నాయని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. క్లాస్ గా చేసుకోవాలనుకున్న ఈ వేడుకను... నారాయణమూర్తి గారు వచ్చి మాస్ గా మార్చేశారని దిల్ రాజు అనడంతో థియేటర్లో కరతాళ ధ్వనులు మిన్నంటాయ్. మరి నారాయణమూర్తా మజాకా!