సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది హీరోయిన్లు వరుస హిట్లు అందుకుని స్టార్ హోదా పొందితే, మరికొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతుంటారు. కానీ, వెండితెరపై ఆశించిన స్థాయిలో మెరవకపోయినా, నిజ జీవితంలో మాత్రం మహారాణిలా సెటిల్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అచ్చం అలాంటి అదృష్టమే వరించింది టాలీవుడ్ హీరోయిన్ అదితి ఆర్యను. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ వారసుడిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.
అదితి ఆర్య గురించి చెప్పాలంటే.. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, మేధావి కూడా. 2015లో 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న ఈ సుందరి, ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాధ్ రూపొందించిన ‘ఇజం’ మూవీలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో తన గ్లామర్, నటనతో పర్వాలేదనిపించినా, దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘సెవెన్’, ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ వంటి సినిమాల్లో నటించినా అవేవీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో అదితి ఆర్య తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్ళించింది. అక్కడ రణవీర్ సింగ్ నటించిన ‘83’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అయితే సినిమాల్లో తన కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతున్న క్రమంలో, అదితి తన చదువుపై దృష్టి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత ‘యేల్ యూనివర్సిటీ’ (Yale University) నుంచి ఎంబీఏ పూర్తి చేసి తన ప్రతిభను చాటుకుంది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ ఆమె సాధించిన ఈ విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే అదితి ఆర్య జీవితంలో అతిపెద్ద మలుపు ఆమె వివాహం. ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్‌తో ఆమె కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంతో సహా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
జై కోటక్ ప్రస్తుతం కోటక్ 811 విభాగానికి కో-హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఉదయ్ కోటక్ నికర ఆస్తి విలువ సుమారు 1.2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. అటు అదితి సొంత సంపాదన, ఇటు కోటక్ కుటుంబ కోడలిగా ఆమె హోదాను బట్టి చూస్తే, సుమారు 12,000 కోట్ల రూపాయల ఆస్తికి ఆమె యజమానిగా మారిందని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం అదితి ఆర్య ఒక బిలియనీర్ కోడలిగా రాజభోగాలను అనుభవిస్తోంది.
ప్రస్తుతం అదితి ఆర్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, తన కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే, గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి బిజినెస్ మరియు ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు వెండితెరపై చూసిన ఈ హీరోయిన్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






