నటీనటులు: అనుష్క, ఆర్. మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
నేపథ్య సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
స్వరాలు: గోపిసుందర్
స్క్రీన్ప్లే, మాటలు: కోన వెంకట్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల తేదీ: 02 అక్టోబర్ 2020 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)
అనుష్క, మాధవన్ జంట అనగానే 'నిశ్శబ్దం' మూవీపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. అందులోనూ చెవిటి, మూగ అమ్మాయి పాత్రలో అనుష్క అని చెప్పడంతో ఎలా చేసి ఉంటుందోనని సినిమాపై ఉత్సుకత ఇంకాస్త ఎక్కువైంది. అసలే థ్రిల్లర్ జానర్. పైగా, అంతా అమెరికాలో తీశామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? లేదా?
కథ
ప్రముఖ సంగీతకారుడు ఆంటోనీ (ఆర్. మాధవన్), చిత్రకారిణి సాక్షి (అనుష్క)కి నిశ్చితార్థం అవుతుంది. విహారయాత్రకు వెళ్లొస్తూ ఒక పెయింటింగ్ కోసం వుడ్సైడ్ విల్లాకు వెళ్తారు. అక్కడ మాధవన్ మృతి చెందుతాడు. ఆ ఇంటిలో ఆత్మ చంపి ఉంటుందని అనుమానిస్తారంతా! కానీ, పోలీస్ ఆఫీసర్ మహా (అంజలి)కి ఏదో సందేహం. దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. అందులో ఏం తేలింది? అనుష్క స్నేహితురాలు సోనాలి (షాలిని పాండే) ఎవరు? మాధవన్ గతం ఏంటి? మహా పైఅధికారి రిచర్డ్ (మైఖేల్ మ్యాడ్సన్) పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా.
ప్రేక్షకుడి ఊహకు అందకుండా తరవాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠకి గురి చేసినప్పుడే థ్రిల్లర్ సినిమాలు విజయం సాధించినట్టు. పట్టు విడవకుండా కథనాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. తరవాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ముందుగా తెలుస్తున్నప్పుడు, ఉత్కంఠగా సినిమాని ప్రారంభించి మధ్యలో పట్టు సడలించినప్పుడు ఫలితం దక్కదు.
ఐడియాగా 'నిశ్శబ్దం' గురించి చెబితే బావుంటుంది. హత్య జరిగిన స్థానంలో చెవిటి, మూగ అమ్మాయి మాత్రమే ఉండటంతో పోలీసులు ఆమె నుండి వివరాలు తెలుసుకుని, దర్యాప్తు చేయడం అనే పాయింట్ బావుంది. మిస్టరీని చేధించడానికి అవసరమైన స్క్రీన్ ప్లే సినిమాలో మిస్ అయింది. సినిమా ప్రారంభంలో హత్యకు గురైన వ్యక్తిని గోడ మీద చూపిస్తారు. 'భాగమతి'లో అనుష్క పోస్టర్ టైపులో అనిపిస్తుంది. అదే కాదు... సినిమా స్క్రీన్ ప్లే కోసమూ 'భాగమతి'ని ఫాలో అయినట్టున్నారు. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాను స్టార్ట్ చేసి, ప్రధాన పాత్ర పోషించిన అనుష్కతో ఆమె గతం చెప్పించి, తరవాత మరో క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అసలు ట్విస్ట్ రివీల్ చేసి... ఏదో ముగించాం అనిపించారు. అయితే, స్క్రీన్ ప్లేలో ఎక్కడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే అంశాలు లేవు. ట్విస్టులు ముందుగా ఊహించడం కష్టమేమీ కాదు.
ఎవరైనా వ్యక్తి విపరీత చర్యకు పాల్పడుతూ తన చర్యలు సమర్ధించుకుంటుంటే అందుకు బలమైన కారణం చూపించాలి. దాన్ని సిల్లీగా చూపించకూడదు. వ్యక్తి తాలూకూ ఎమోషన్ బలంగా చూపించాలి. 'నిశ్శబ్దం'లో ఆ ఎమోషన్ బలంగా లేకపోవడం వలన ప్రేక్షకుడు సినిమాతో కనెక్ట్ అవడం కష్టం.
కంటెంట్ పరంగా వీక్ గా ఉన్న ఈ సినిమాకి స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ దొరికింది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. గోపిసుందర్ స్వరాలు వినసొంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
అనుష్క, మాధవన్
సినిమాటోగ్రఫీ
పాటలు, నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
ఎమోషన్స్
దర్శకత్వం
ముగింపు
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
నటీనటుల పనితీరు
నటిగా తన ప్రతిభ ఏంటో అనుష్క ఎప్పుడో నిరూపించుకున్నారు. మరోసారి పాత్రకు అవసరమైన అద్భుత అభినయాన్ని ప్రదర్శించారు. కానీ, తెరపై బొద్దుగా కనిపించారు. నటుడిగా రెండు విభిన్న పార్శ్వాలు చూపించే పాత్ర మాధవన్ కి దక్కింది. ఆయన బాగా చేశారు. షాలిని పాండేలో ఒక్క ఎక్స్ప్రెషన్ కంటే ఎక్కువ కనిపించలేదు. అంజలి పర్వాలేదు. మైఖేల్ మ్యాడ్సన్ యాక్టింగ్ ఆకట్టుకోలేదు. మిగతావాళ్ళు పాత్రల పరిధి మేరకు చేశారు.
హాలీవుడ్ శైలి సినిమాను చూస్తున్న ఫీలింగ్ తీసుకురావడంలో ఛాయాగ్రాహకుడు సక్సెస్ అయ్యారు. కానీ, ఆ స్థాయి సినిమాను ప్రేక్షకులు అందించడంలో దర్శక, రచయితలు ఫెయిల్ అయ్యారు. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ తక్కువే. అనుష్క, మాధవన్ నటన బావున్నప్పటికీ... సీరియల్ తరహాలో కథను సాగదీసినట్టు ఉండే స్క్రీన్ ప్లే వలన సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నీరసం వస్తుంది. రెండు గంటల సినిమా సైతం నిడివి ఎక్కువైన ఫీలింగ్ తెస్తుంది.