Home » Movie Reviews » మిస్ ఇండియా



Facebook Twitter Google


సినిమా పేరు: మిస్ ఇండియా
తారాగ‌ణం: కీర్తి సురేశ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌దియా, న‌రేశ్‌, క‌మ‌ల్ కామ‌రాజు, న‌వీన్ చంద్ర‌, సుమంత్ శైలేంద్ర‌, పూజిత పొన్నాడ‌, దివ్య శ్రీ‌పాద‌, ప్ర‌వీణ్‌, బేబి
క‌థ‌: న‌రేంద్ర‌నాథ్‌, త‌రుణ్ కుమార్‌
మ్యూజిక్‌: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  డానీ సాంచెజ్ లోపెజ్‌, సుజిత్ వాసుదేవ్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ప్రొడ్యూస‌ర్‌: మ‌హేశ్ కోనేరు
డైరెక్ట‌ర్‌: న‌రేంద్ర‌నాథ్‌
బ్యాన‌ర్‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌
విడుద‌ల తేది: 4 న‌వంబ‌ర్ 2020
ప్లాట్‌ఫామ్‌:  నెట్‌ఫ్లిక్స్ (ఓటీటీ)

కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర పోషించిన మ‌రో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా 'మిస్ ఇండియా' కొంత కాలంగా వార్త‌ల్లో న‌లుగుతూ వ‌స్తోంది. ఇందులోని పాత్ర కోసం బ‌రువు త‌గ్గి, స‌న్న‌గా మారి మేకోవ‌ర్ అయిన కీర్తి రూపం ఆస‌క్తిని క‌లిగించింది. "మిస్ ఇండియా అంటే నేను కాదు.. అదొక బ్రాండ్" అంటూ ట్రైల‌ర్‌లో కీర్తి ఎంతో సాధికారికంగా, ఆత్మ‌విశ్వాసంతో చెప్ప‌డం చూసి, సినిమాపై అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్నారు. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే 'మిస్ ఇండియా' ఉందా.. ప‌దండి చూద్దాం...

క‌థ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన మాన‌స సంయుక్త (కీర్తి సురేశ్‌) అనే అమ్మాయి ఎంబీఏ చ‌దివి, బిజినెస్ చేసి గొప్ప‌దాన్ని కావాల‌ని క‌ల‌లు కంటుంది. ఆయుర్వేద వైద్యుడైన ఆమె తాత‌య్య (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే రోగుల‌కు చాయ్‌తో జ‌బ్బుల‌ను త‌గ్గించ‌డం చిన్న‌ప్పుడే చూసి, ఆ చాయ్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు తీసుకువ‌స్తాన‌ని అప్పుడే తాత‌య్య‌కు మాటిస్తుంది. కుటుంబంతో అమెరికాకు వెళ్లాల్సి వ‌చ్చిన సంయుక్త బిజినెస్ చేస్తానంటే త‌ల్లి (న‌దియా), అన్న (క‌మ‌ల్ కామ‌రాజు) ఒప్పుకోరు. వారి బ‌ల‌వంతంపై అప్ప‌టికే ప‌రిచ‌య‌మైన విజ‌య్ (న‌వీన్ చంద్ర‌) కంపెనీలో చేరుతుంది. కానీ ఆ ఉద్యోగంలో ఇమ‌డ‌లేక‌పోతుంది. కుటుంబాన్నీ, ఆ ఉద్యోగాన్నీ వ‌దిలి తాత‌య్య‌కు ఇష్ట‌మైన చాయ్‌ను మిస్ ఇండియా బ్రాండ్‌తో అమ్మ‌డం మొద‌లుపెడుతుంది. అమెరికాలో కేఎస్‌కే బ్రాండ్‌తో కాఫీ సామ్రాజ్యాన్ని న‌డుపుతున్న కైలాష్ శివ‌కుమార్ ఆమెకు అడ్డుగా నిలుస్తాడు. బిజినెస్ వార్‌లో సంయుక్త ఎలాంటి ప‌రిస్థితుల‌ను, ప‌రిణామాల‌ను ఎదుర్కొంది అనేది మిగ‌తా క‌థ‌.



ఎనాలసిస్ :

ఇండియ‌న్ చాయ్‌కు అమెరికాలో పేరు తీసుకు రావాల‌నే గోల్ పెట్టుకున్న మాన‌స సంయుక్త క‌థ‌గా 'మిస్ ఇండియా' సినిమా మ‌న‌కు క‌నిపిస్తుంది. చిన్న‌ప్పుడు "నాకు న‌చ్చిన‌ట్లే ఉంటాను.. న‌చ్చిందే చేస్తాను" అని చెప్పిన సంయుక్త, ఎదిగాక అలా ఉండే క్ర‌మంలో భావోద్వేగాల‌ను, సున్నిత‌త్వాన్ని వ‌దిలేయ‌డం పెద్ద మైన‌స్‌. ఒక సంద‌ర్భంలో కైలాష్‌తో "మీ కంపెనీలో కాఫీని డ‌బ్బుతో చేస్తారు.. కానీ నేను నా చాయ్‌ని ప్రేమ‌తో చేస్తాను" అని చెప్తుంది. కానీ అది మాట‌ల వ‌ర‌కే. వాస్త‌వంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఆమె ప్ర‌వ‌ర్తిస్తున్న విష‌యాన్ని ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత కూడా అయిన‌ న‌రేంద్ర‌నాథ్ విస్మ‌రించాడు. జీవితంలో రెండు సంద‌ర్భాల్లో ఆమెను చూసి, ఆమె ఆకాంక్ష‌, ప‌ట్టుద‌ల న‌చ్చి జీవితంలో ఆమెకు ప్రేమ‌ను పంచుదామ‌ని వ‌చ్చిన వ్య‌క్తుల‌ను ఆమె కాల‌ద‌న్నుకొనే తీరు దీనికి నిద‌ర్శ‌నం. మిస్ ఇండియా బ్రాండ్ చాయ్‌ను స‌క్సెస్ చేయ‌డం అనే ల‌క్ష్య సాధ‌న‌లో ఆమె ఒక బండ‌రాయి త‌ర‌హాలో బిహేవ్ చేయ‌డంతో క‌థ‌నంలో ఫీల్ మిస్స‌యిపోయింది. చాలా వ‌ర‌కు పాత్ర‌ల‌న్నీ నేచుర‌ల్‌గా కాకుండా ఆర్టిఫిషియ‌ల్‌గా ప్ర‌వ‌ర్తించ‌డం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించే అంశం. ఎంతో కొంత స‌హ‌జంగా అనిపించే పాత్ర రాజేంద్ర‌ప్రసాద్ పోషించిన తాత‌య్య పాత్ర‌.

సంయుక్త‌కు ఒక రెస్టారెంట్‌లో యాక్సిడెంట‌ల్‌గా ప‌రిచ‌య‌మై, స్నేహితుడిగా మారిన విజ‌య్ (న‌వీన్‌చంద్ర‌) క్యారెక్ట‌రైజేష‌న్ మ‌రింత అన్‌నేచుర‌ల్‌గా క‌నిపిస్తుంది. ఎంతో ఉన్న‌త భావాలు క‌లిగిన‌వాడిగా, హృద‌య స్పంద‌న‌లు ఉన్న‌వాడిగా అత‌డి పాత్ర‌ను చిత్రించిన ద‌ర్శ‌కుడు, స‌డ‌న్‌గా సంయుక్త త‌న ప్ర‌పోజ‌ల్‌ను ఒప్పుకోక‌పోయేస‌రికి అప్ప‌టిదాకా ప్ర‌వ‌ర్తించిన దానికి భిన్నంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మాట్లాడ‌టం ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ‌తీసింది. అత‌డితో సంయుక్త మాట్లాడే తీరు కూడా అంతే. అంత‌దాకా ఫ్రెండ్‌గా ట్రీట్ చేసిన ఆమె ఒక్క‌సారిగా అత‌డితో అంత క‌ఠినంగా, మ‌న‌స‌నేది లేన‌ట్లుగా ఎలా బిహేవ్ చేస్తుంది? స‌ంయుక్త అన్నయ్య‌ పాత్ర తీరు కూడా అంతే. త‌న మ‌న‌స్త‌త్వానికి భిన్న‌మైన త‌ర‌హాలో చెల్లితో ఓ సంద‌ర్భంలో అత‌డు ప్ర‌వ‌ర్తిస్తాడు. పాత్ర చిత్ర‌ణ‌లో దాని తీరుతెన్నుల‌ను చివ‌రిదాకా సెటిల్డ్‌గా నిర్వ‌హించ‌డం చాలా ముఖ్య‌మైన అంశం. డైరెక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్ ఈ విష‌యంలో ఫెయిల‌య్యాడ‌నే చెప్పాలి.

జ‌గ‌ప‌తిబాబు పోషించిన కైలాష్ శివ‌కుమార్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఇంకా బ‌లంగా చిత్రించి ఉండాల్సింద‌నే అభిప్రాయం క‌లుగుతుంది. అత‌డిని విల‌న్‌గా ప్రొజెక్ట్ చేసిన‌ప్పుడు హీరోయిన్‌, విల‌న్ మ‌ధ్య కాన్‌ఫ్లిక్ట్ బ‌లంగా ఉండాలి. అప్పుడే హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఎలివేట్ అవుతుంది. ఆ కాన్‌ఫ్లిక్ట్‌కు సంబంధించిన సీన్స్ వీక్ అయితే మెయిన్ క్యారెక్ట‌ర్ పాసివ్‌గా మారిపోతుంది. నిజానికి సెకండాఫ్‌లో సంయుక్త ప‌డే స్ట్ర‌గుల్ మ‌న స్ట్ర‌గుల్ కావాలి. అప్పుడే ఆ పాత్ర‌తో మ‌నం స‌హానుభూతి చెందుతాం. ఆ స‌హానుభూతి మ‌న‌కు క‌ల‌గ‌లేదంటే ఆ పాత్ర‌ను, ఆ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ప‌క‌డ్బందీగా చిత్రించ‌డంలో ద‌ర్శ‌కుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అర్థం. అందుకే సంయుక్త ల‌క్ష్యం అర్థంలేనిదిగా త‌యారైపోయింది.

సంయుక్త తండ్రి అల్జీమ‌ర్స్ వ్యాధికి గురైన‌ట్లు చూపించేస‌రికి, క‌థ‌కు అది ఒక ఎమోష‌న‌ల్ పాయింట్ అవుతుంద‌నుకుంటే.. ఆ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు నిరుత్సాహ‌ప‌రిచాడు. క‌థ‌కు దాన్ని ఏమాత్రం స‌రిగా ఉప‌యోగ‌పెట్టుకోలేదు. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య భావోద్వేగప‌ర‌మైన స‌న్నివేశాల‌కు చోటున్నా.. ఆ స‌న్నివేశాల‌ను అతి సాధార‌ణంగా చిత్రీక‌రించి, చేజేతులా మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకున్నారు.

టెక్నిక‌ల్ అంశాల్లో చెప్పుకోత‌గ్గ‌వి త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్‌, డానీ సాంచెజ్ లోపెజ్‌, సుజిత్ వాసుదేవ్ సంయుక్తంగా అందించిన సినిమాటోగ్ర‌ఫీ. అయితే త‌మ‌న్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించ‌వ‌చ్చ‌ని అనిపించింది. అమెరికా స‌న్నివేశాల‌ను లోపెజ్ కెమెరా అందంగా చూపేందుకు ట్రై చేసింది. స‌న్నివేశాల్లో ఆత్మ లోపించిన‌ప్పుడు ఎడిట‌ర్‌గా త‌మ్మిరాజు మాత్రం ఏం చేయ‌గ‌ల‌డు!

ప్లస్ పాయింట్స్‌
కీర్తి సురేశ్ న‌ట‌న‌
త‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌
కీర్తి సురేశ్ పాత్ర తీరులో మ‌న‌సు లోపించ‌డం
మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల తీరుతెన్నుల్లో లోపాలు
వీక్ స్క్రీన్‌ప్లే
హీరోయిన్‌, విల‌న్ మ‌ధ్య కాన్‌ఫ్లిక్ట్ బ‌లంగా లేక‌పోవ‌డం
ఫీల్ క‌లిగించ‌ని స‌న్నివేశాలు

న‌టీన‌టుల అభిన‌యం: మాన‌స సంయుక్త‌గా కీర్తి సురేశ్ ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేసింది. ఆ క్యారెక్ట‌ర్ కోసం మేకోవ‌ర్ అయ్యింది. పాత్ర తీరుకు త‌గ్గ‌ట్లు హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించింది. ఆ విష‌యంలో ఆమెకు పూర్తి మార్కులు వేయొచ్చు. ఆ పాత్ర‌కు ద‌ర్శ‌కుడు ఒక మ‌న‌స‌నేది పెట్టిన‌ట్ల‌యితే కీర్తి న‌ట‌న మ‌రింత రాణించేద‌ని చెప్పాలి. ఆమెపై తీసిన కొన్ని షాట్స్ మాత్రం సూప‌ర్బ్ అనిపిస్తాయి. బిజినెస్ టైకూన్ త‌ర‌హా విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో జ‌గ‌ప‌తిబాబు ఇప్ప‌టికే త‌ల‌పండిపోయారు. ఇందులోని కైలాష్ శివ‌కుమార్ పాత్ర వాటికి కొన‌సాగింపు. పాత్ర ప‌రిధిమేర‌కు న‌టించార‌ని చెప్ప‌వ‌చ్చు కానీ, ఆక‌ట్టుకున్నార‌ని చెప్ప‌లేం. కార‌ణం.. ఆ పాత్ర చిత్ర‌ణ‌. చిన్నపాత్రే అయినా తాత‌య్య‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆక‌ట్టుకున్నారు. సంయుక్త తండ్రిగా అల్జీమ‌ర్స్ బాధితునిగా న‌రేశ్ త‌న‌దైన శైలి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. క‌మ‌ల్ కామ‌రాజు, న‌వీన్ చంద్ర‌, సంయుక్త ఫ్రెండ్స్‌గా పూజిత పొన్నాడ‌, దివ్య శ్రీ‌పాద‌, సంయుక్త‌కు బిజినెస్‌లో సాయ‌ప‌డే విక్ర‌మ్‌గా సుమంత్ శైలేంద్ర త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చేశారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

భార‌తీయ చాయ్ గొప్ప‌త‌నాన్ని, దాని రుచిని అమెరికా ప్ర‌జ‌ల‌కు అందించాల‌నీ, దానికి పేరు ప్ర‌ఖ్యాతులు తేవాల‌ని ఓ అమ్మాయి చేసిన త‌ప‌స్సుగా పైకి క‌నిపించే మిస్ ఇండియా సినిమా.. మ‌న‌సు లోపించిన‌, ఆత్మ లోపించిన ఒక ఆర్టిఫిషియ‌ల్ స్టోరీ టెల్లింగ్ మూవీగా మిగిలిపోయి, అసంతృప్తి క‌లిగిస్తుంది. ఇండియన్ చాయ్ అని ఎంత గొప్ప‌గా చాటింపు వేసినా, దానికి త‌గ్గ స్క్రీన్‌ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్స్ లేక‌పోతే దాని రుచి ఆర్డిన‌రీగానే ఉంటుంద‌నేందుకు 'మిస్ ఇండియా' మూవీ ఓ నిద‌ర్శ‌నం. కీర్తి సురేశ్ కోసమైతే ఓసారి చూడొచ్చు.

 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.