ఎందుకమ్మా... నీకీ నోటిదూల?
on Aug 21, 2017

తమిళ నటి కస్తూరి నిజంగా చాలా స్ట్రయిట్ ఫర్వాడ్. ఏదన్నా చెప్పాలన్నా... చెయ్యాలన్నా... అస్సలు వెనకాడదు. ఆమె ట్రాక్ రికార్డు చూస్తే మీకే అర్థమైపోతుంది. తల్లిపాల విషయంపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు... తన బిడ్డకు పాలిస్తూ ఫొటో దిగి.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కథానాయికల పట్ల హీరోల ప్రవర్తనపై ఘాటుగా స్పందించి వార్తల్లోకెక్కింది. రాజకీయ నేపథ్యం ఉన్న ఓ తెలుగు సీనియర్ హీరో తనను పడకగదికి రమ్మన్నాడనీ... అతని గురించి కొన్ని క్లూలు ఇస్తూ... అప్పట్లో పెద్ద చర్చకే తెరలేపింది కస్తూరి.
ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమావాళ్లని టార్గెట్ చేస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయ్. దర్శకుడు పూరీ జగన్నాథ్.. ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో... బాలకృష్ణ తన అభిమానుల్ని కొట్టడం ఓ లవ్ స్టోరీగా అభివర్ణించిన తీరును ఖండిస్తూ... ‘అభిమానుల్ని కొట్టడంలో తప్పులేదనడం... పైగా అదో లవ్ స్టోరీ అని... పూరీ జగన్నాథ్ మాట్లాడటం విచారకరం. ఇప్పుడనిపిస్తోంది.. అతని పై డ్రగ్స్ ఆరోపణలు ఊరకే రాలేదని’అని ఘాటుగా స్టేట్మెంట్ ఇచ్చేసింది కస్తూరి.
తెలుగు సినిమాతో ఇప్పుడో కనెక్షన్ తెగిపోయిన కస్తూరి... తెలుగు సినిమా వాళ్లను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు తమిళనాట కూడా... రజనీకాంత్ రాజకీయరంగప్రవేశంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. ‘ప్రపంచంలో రజనీ రాజకీయరంగ ప్రవేశం కంటే ప్రధానమైంది ఏమీ లేవా? తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, మహిళలపై జరుగుతున్న అమానుషాల గురించీ ఎవరూ పట్టించుకోరు కానీ.. రజనీ రాజకీయం మాత్రం ప్రతి ఒక్కడికీ ప్రధానమైపోయింది’అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రజనీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది కస్తూరి. అది అక్కడ చల్లారకముందే... ఇక్కడ ఈ అగ్గి రాజేసింది.
సినిమాలు లేకపోతే... శుభ్రంగా పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు కదా. నీకెందుకమ్మా.. ఈ నోటి దూల అంటూ పలువురు కస్తూరికి హితవు చెబుతున్నారు. మరి కస్తూరి వింటుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



