LATEST NEWS
  తెలంగాణ లో గత 47 రోజులుగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కి నేటితో తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని జేఏసీ నేతలు ప్రకటించారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా పలువురు జేఏసీ నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కానీ దేనికోసమైతే కార్మికులు సమ్మె బాట పట్టారో.. అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరకుండానే సమ్మెని ముగిస్తుండటం కొసమెరుపు. ఈ సమ్మె మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్నిరోజులు సమ్మె చేసి కార్మిక సంఘాలు ఏం సాధించాయో వారికే తెలియాలి.  
  మంత్రి కొడాలి నానిపై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో వేమూరి ఆనంద సూర్య ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా తిరుమల ఆలయం పై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు తమ హోదాలను మరచిపోయి..హుందాతనాన్ని కోల్పోయి.. వాళ్లకి ఏ భాష నోటికి వస్తే ఆ భాషతో ఎదుటి వ్యక్తులనే కాకుండా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయాన్ని కూడా కించపరిచే రకంగా మాట్లాడుతున్నానరని అన్నారు. దురదృష్టవశాత్తూ వాళ్ళ రాజకీయాలను చూసుకోకుండా సాంప్రదాయాలను ఉల్లంఘించారన్నారు. స్వతహాగా క్రిస్టియన్ గా ఉన్నటువంటి సీఎం జగన్ రెడ్డి గారు ఆయన మతాన్న గౌరవించుకుంటూ ఇతర మతాలను.. సాంప్రదాయాలను.. అగౌరవ పరిచేలా మాట్లాడుతున్న వారికి అండగా ఉంటున్నారని అన్నారు.  అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఓ రూల్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు సంతకం పెట్టాలి. ఆ రూల్ ప్రకారం దేవాలయంలో సంతకం పెట్టకుండా కించపరిచిన అనేక సందర్భాలున్నాయి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు వారి మంత్రి వర్గ సభ్యుడు శ్రీ కొడాలి నాని గారు ఆ దేవాలయాన్ని ఎవడమ్మ మొగుడు కట్టించాడురా ఈ గుడిని అంటూ  కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన భాష తీరుని మార్చుకోవాలి.. ఆయన మాట్లాడిన మాటలకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి చెంపలు వేసుకుని యావత్ హిందూ జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వేమూరి ఆనంద సూర్య. కొడాలి నానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లయింట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న హిందువులు.. బ్రాహ్మణ సంఘాలు.. ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. హిందువులు అన్ని మతాలను గౌరవిస్తున్నారు.. మీరెందుకు హిందూ మతాన్ని గౌరవించరని ప్రశ్నించారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని జగన్ ని హెచ్చరించారు.
  ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు 'ఏపీకి శాపం, తెలంగాణకు వరం' అవుతున్నాయా అంటే అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏపీ రాజధానిలో సింగపూర్ ప్రాజెక్టు రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం తీసుకొని పదిరోజులు కూడా తిరగ్గకుండానే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ కంపెనీలతో గత ప్రభుత్వం చేసుకున్న మరో వ్యాపారపరమైన ఒప్పందాల్ని రద్దు చేశారు. గల్ఫ్ దేశాలకు చెందిన లులు గ్రూప్‌కు గత సీఎం చంద్రబాబు విశాఖలో భూములు కేటాయించారు. అయితే తాజాగా ఆ భూముల్ని రద్దు చేసినట్లు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా లాలూ గ్రూప్ వెనక్కి తగ్గింది.  ఈ మేరకు లులు గ్రూప్ డైరెక్టర్ అనంత్ రామ్ ప్రకటన కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం తమ సంస్థకు ఇచ్చిన భూమిని రద్దు చేసిందన్నారు. విశాఖను కన్వెన్షన్ అండ్ షాపింగ్ హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేసేందుకు.. రూ. 2200 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 7000 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని భావించామన్నారు. ప్రాజెక్ట్ రూపకల్పనకు ఇప్పటికే తమ సంస్థ భారీ ఖర్చులు కూడా చేసినప్పటికీ.. కొత్త ప్రభుత్వ నిర్ణయానికి మేము అంగీకరిస్తున్నామన్నారు. ఇకపై ఏపీలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టమన్నారు. మరోవైపు తెలంగాణ, తమిళనాడు,కేరళ, ఉత్తర్ ప్రదేశ్‌లో తమ సంస్థ పెట్టుబడులు పెడుతుందన్నారు డైరెక్టర్ అనంతరామ్. జగన్ తీసుకుంటున్న ఈ ప్రాజెక్టు ఒప్పంద రద్దు నిర్ణయాలు తెలంగాణకు వరంలా మారాయి అంటున్నారు. అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై జగన్ సర్కార్ సానుకూలంగా లేకపోవడంతో.. సింగపూర్ కంపెనీలు హైదరాబాద్‌ పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో.. సింగపూర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. పెట్టుబడులతో ముందుకు వచ్చిన కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు.  భారత్‌లో పెట్టుబడుల కోసం.. సింగపూర్ సంస్థలు.. భారీ ప్రణాళికలే వేసుకున్నాయి. వారి పెట్టుబడులను ఆకర్షించడంలో.. నాటి సీఎం చంద్రబాబు కృషి చేశారు. అయితే అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట‌ కోసం రంగంలోకి దిగే సమయంలో.. ప్రభుత్వం మారిపోయింది. అప్పటికీ సింగపూర్ సంస్థ ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం.. అమరావతి ఓ సామాజికవర్గం వారిదేనన్న అభిప్రాయంతో.. సింగపూర్ సంస్థతో ఒప్పందాలు కట్ చేసుకుంది. దీంతో ఇప్పుడు.. వారు అమరావతిలో పెట్టుబడుల కోసం సిద్ధం చేసుకున్న సొమ్మును.. తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కార్యాచరణ ప్రారంభించారు. కేటీఆర్ కూడా వారికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అంటే.. ఏపీ ప్రభుత్వం వద్దనుకున్న సింగపూర్ పెట్టుబడులను.. తెలంగాణ మాత్రం రెడ్ కార్పెట్‌ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. లులు గ్రూప్ కూడా ఏపీ సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే అవకాశముందని అంటున్నారు.  
  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తిష్టవేసింది. ఇక్కడ వైద్య వ్యాపారం కోట్లలో సాగుతోంది. ఒక్క కరీంనగర్ లోనే ప్రతి రోజు తొమ్మిది కోట్ల వరకూ జరుగుతోంది. అందుకే దీనికి డాక్టర్ ప్యారడైజ్ అని పేరుంది. చిన్న తలనొప్పి అని వచ్చినా జేబులు గుల్లయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ దందా వెనుక పెద్ద మెడికల్ మాఫియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదైనా వ్యాధితో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ అక్కడే ఉన్న హాస్పటల్ కు అనుబంధమైన మెడికల్ షాప్ లకే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకే బ్రాండ్ కు చెందిన మందులను ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఈ మందులు వేరే చోట కొందామన్నా దొరకవు. ఫార్మా కంపెనీల కమీషన్ లకు కక్కుర్తిపడ్డా కొందరు డాక్టర్ లు ఇష్టం వచ్చినట్లు మందులు రాస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బీపీ, షుగర్ ఉందని ఆస్పత్రికి వెళ్తే ఇరవై మూడు రకాల మందులు అంటగడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రిస్క్రిప్షన్ నూ నింపేస్తున్నారు. దీనిపై డాక్టర్ లను, మెడికల్ షాపు నిర్వాహకులను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు.  మెడికల్ మాఫియా ఆగడాలు ఎంత దారుణంగా ఉంటాయంటే 150 రూపాయలున్న మందులను 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఒరిజినల్ రేటుకు ఆసుపత్రులకు అనుబంధమైన మెడికల్ షాపుల్లోని ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీళ్ల ఆగడాలను తట్టుకోలేక కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్స్ డెంగ్యూతో జనం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన మెడికల్ మాఫియా వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే యాభై వేలకు పైనే మందులకూ ఖర్చు చేయిస్తున్నారు. అందులో అధికంగా యాంటి బయటిక్స్ మందులే ఉంటున్నాయి. ఫీవర్ వచ్చిందని ఎవరైనా వస్తే చాలు రూ.1000 మందులు రాస్తున్నారు. అసలు జనరిక్ మెడిసిన్స్ మాటే ఎత్తడం లేదు. డాక్టర్ ల తీరుపై పలు సంస్థల ప్రతి నిధులు ఫిర్యాదులు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మందులు ఉపయోగిస్తున్నారు అని సమాచారం. ఒక సర్వేలో దేశం లోనే కాదు ఆసియా ఖండంలోనే టాప్ ప్లేస్ లో ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని. కొందరు డాక్టర్ ల తీరు పై సీనియర్ వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా రాస్తున్న మందులను నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 చీటీలు 66 గోలీలు అన్నట్లు సాగుతోంది మెడికల్ దందా. ఎవరైనా పేషెంట్ ఆసుపత్రికి వస్తే ఫార్మా కంపెనీల గిఫ్టులకు కక్కుర్తిపడి ప్రిస్క్రిప్షన్ నింపేసి తమకు అనుకూలమైన మెడికల్ షాపులకు పంపించేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఈ దందాను అరికట్టే చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
  మహారాష్ట్ర రాజకీయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సై అంటున్నా ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించుకుని దానిపై అన్ని పార్టీలు సంతకాలు చేయాలని నిర్ణయించాయి. అయితే దీనిపైనే సోనియా, పవార్ ల మధ్య చర్చలు సాగుతున్నాయి. రెండ్రోజుల నుంచి ఢిల్లీ లోనే ఉన్న శరద్ పవార్ శివసేనతో పొత్తు పై చర్చిస్తున్నారు. శివసేనతో కలిసేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పైగా రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో సీన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళుతోంది. శివసేన నేతలు మాత్రం డిసెంబర్ మొదటి వారం లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఐదేళ్లు తామే సీఎం అని ఎన్సీపీకి, కాంగ్రెస్ కి కీలక పదవులు ఇస్తామని చెబుతోంది. అయితే ఎన్సీపీ కూడా సీఎం పదవి కోసం పట్టుబడుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో చర్చలు జరుగుతున్నాయ అన్న ప్రశ్నకు శరద్ పవార్ నిజమా అంటూ సమాధానం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. శరద్ పవార్ కామెంట్స్ తో ఏదో జరుగుతుందనే అనుమానాలు ఉన్నప్పటికీ శివసేన మాత్రం పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి అని చురకలు అంటిస్తున్నారు.  అయితే శివసేన బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతుండగా బిజెపి మాత్రం తెర వెనుక ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అతవోళి లాంటి మంత్రుల నుంచి శివసేనకూ రాయబారం పంపుతూనే ఎన్సీపీకి గాలం వేస్తోందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మరాఠా రాజకీయాల్లో పవార్ శివసేనతో కలవకుండా ఉండేందుకు తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్సీపీకి ప్రభుత్వంలో కీలక పదవులతో పాటు శరద్ పవార్ కి రాష్ట్రపతి పదవి ఇస్తామన్న ప్రతిపాదన బిజెపి నుంచి వచ్చిందంటున్న ప్రచారం జరుగుతుంది. కానీ శరద్ పవార్ మాత్రం బిజెపితో కలిసేది లేదంటున్నారు. కాంగ్రెస్ తోనే తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. మరోవైపు శివసేనతో కలవడం వెనుక కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. చాలా వరకు భిన్నదారులు ఉన్న పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నేతలు. సేనతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓటర్లు దూరమవుతారని చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే పాత మిత్రుడు పిలిస్తే వెళ్లేందుకు సేనా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి 50-50 ఆఫర్ కి ఓకే అంటే పార్టీతో పొత్తుకు సై అంటున్నారు శివసేన వర్గాలు. ఇలా మొత్తంగా సీన్ మొత్తం సీఎం కుర్చి చుట్టూ తిరుగుతోంది.ఈ సస్పెన్స్ కు తెర ఎప్పుడు పడనున్నదో వేచి చూడాలి.  
ALSO ON TELUGUONE N E W S
  2020లో తెలుగు సినీసీమ మాత్రమే కాదు, యావద్భారత చిత్రసీమలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా చెప్పుకోదగ్గ 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయికగా నటిస్తున్నదెవరనే విషయం నిన్నటిదాకా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా ఉండిపోయింది. ఈరోజు, అంటే నవంబర్ 20న ఆ చిక్కు విడిపోయింది. తారక్ జోడీగా ఇంగ్లిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్‌పైకి వచ్చేసింది. ఆమె జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి కేరెక్టర్‌ను పోషిస్తోంది. వాస్తవానికి మొదట ఈ కేరెక్టర్‌కు మరో బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే ఆమె 'ఆర్ ఆర్ ఆర్' నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె ప్రకటించింది.  ఇది జరిగి దాదాపు 7 నెలలు గడిచాయి. అప్పట్నుంచీ తారక్ జోడీగా వచ్చే అమ్మాయి ఎవరు? అనే ప్రశ్న సినీ వర్గాల్లో, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అభిమానుల్లో నలుగుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం తారక్ జోడీగా ఎమ్మా రాబర్ట్స్ ఎంపికైందనే వార్త హల్‌చల్ చేసింది. 'నర్వ్', 'లిటిల్ ఇటలీ', 'ప్యారడైజ్ హిల్స్'లో నటించిన ఎమ్మా.. 'ఆర్ ఆర్ ఆర్'లో ఎంపికైన విషయాన్ని సినిమా యూనిట్‌లోని ఎవరూ ధృవీకరించలేదు. దాంతో అది ఒక రూమర్‌గానే ఉండిపోయింది. ఇప్పుడు అది రూమర్ అనే విషయం స్పష్టమైంది. తారక్ సరసన నటించడానికి ఒలీవియా మోరిస్ వచ్చేసింది. ఆమె ఇప్పటి వరకూ 'కండెమ్డ్' అనే హారర్ మూవీ, '7 ట్రయల్స్ అండ్ 7 డేస్' అనే టీవీ సిరీస్‌లో నటించింది. ఆమె యూకేలోని 'ద రాయల్ వెల్ష్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా'లో నటనలో శిక్షణ పొందింది. 'ఆర్ ఆర్ ఆర్' కథ ప్రకారం జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి ప్రేమలో పడతాడు కొమరం భీం. అయితే వాళ్ల ప్రేమకు ఎన్నో అవరోధాలు కలుగుతాయి. బ్రిటిష్ దుష్ట దంపతులు స్కాట్, లేడీ స్కాట్ ఆ యువజంట పాలిట విలన్లుగా మారతారు. ఆ పాత్రల్ని రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ పోషిస్తున్నారు.  హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'థోర్' చూసినవాళ్లకు 'వోల్‌స్టాగ్' కేరెక్టర్ గుర్తుండే ఉంటుంది. థోర్ ప్రధాన అనుచరుడైన ఆ కేరెక్టర్‌ను చేసింది రే స్టీవెన్సన్. జన్మతహా ఐరిష్ అయిన స్టీవెన్సన్ మొదట రంగస్థల నటుడిగా రాణించి, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోనూ, అమెరికన్ టెలివిజన్ సీరియళ్లలోనూ నటించి, ప్రతిభావంతుడైన యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటుడైన అతను ఒక భారతీయ చిత్రంలో.. అందునా ఒక ప్రాంతీయ భాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం విశేషంగా భావించాలి. 'బాహుబలి' డైరెక్టర్‌గా యస్.యస్. రాజమౌళికి విశ్వవాప్తంగా వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్లే, ఆయన 'ఆర్ ఆర్ ఆర్'లో నటించేందుకు ఒప్పుకున్నాడనుకోవాలి. స్టీవెన్సన్ రాకతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి గొప్ప ప్రయోజనం కలుగుతుందనేది కాదనలేని సత్యం. ఇక స్కాట్ భార్య లేడీ స్కాట్‌గా నటిస్తోన్న అలీసన్ డూడీ సైతం ఐరిష్ యాక్టరే. ప్రస్తుతం 53 ఏళ్ల వయసున్న ఆమె హాలీవుడ్ గ్రేట్ ఫిలింస్‌లో ఒకటైన 'ఇండియానా జోన్స్ అండ్ లాస్ట్ క్రూసేడ్'లో హారిసన్ ఫోర్డ్, సీన్ కేనరీ చేసిన పాత్రలతో సమానంగా ఎల్సా ష్నైడర్ అనే ప్రధాన పాత్ర చేసి ప్రేక్షకుల ఆరాధ్య తారగా అవతరించింది. ఆ తర్వాత కూడా 'మేజర్ లీగ్ 2', 'టెంప్టేషన్', 'కింగ్ సాల్మన్స్ మైన్స్' వంటి సినిమాలు చేసింది. లేడీ స్కాట్‌గా ఆమె 'ఆర్ ఆర్ ఆర్'కు ప్రత్యేక ఆకర్షణ తీసుకు రానున్నది. అటు రే స్టీవెన్సన్, ఇటు అలీసన్ డూడీ వంటి హాలీవుడ్ యాక్టర్లను తీసుకోవడం ద్వారా 'ఆర్ ఆర్ ఆర్'కు ఇంటర్నేషనల్ మూవీ కలర్ తీసుకొచ్చేశాడు రాజమౌళి. యు.ఎస్.లో 'ఆర్ ఆర్ ఆర్'కు మంచి పబ్లిసిటీ తీసుకురావడంలో ఆ ఇద్దరు నటులూ కచ్చితంగా ఉపయోగపడనున్నారు. 'బాహుబలి' సినిమాలు దేశవ్యాప్తంగా రాజమౌళికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకు రాగా, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అంతర్జాతీయంగా ఆయనకు పేరు తెచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో బిజినెస్ పరంగానూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్.. ఈ పేర్లు చదువుతుంటేనే.. 'ఆర్ ఆర్ ఆర్' ఏ రేంజిలో తయారవుతోందో ఊహించుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి విప్లవ వీరుల పాత్రలతో, కల్పిక గాథతో తయారవుతున్న ఈ మూవీ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సినిమా అని ఇప్పట్నుంచే నమ్మాలనిపిస్తోంది. చూద్దాం.. రాజమౌళి ఏం మాయ చేస్తాడో!
‘శుక్రవారం ఉదయం మా సినిమాను ఫ్రీగా చూడండి. అన్ని థియేటర్లలో ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో టికెట్లు ఫ్రీగా ఇవ్వబడును’ అంటూ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’. స్ర్కీన్‌ప్లేను నమ్ముకుని తెరకెక్కించిన రియలిస్టిక్‌ రా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘రోజులు మారాయి’, ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’లో హీరోగా నటించిన చేతన్‌ మద్దినేని ఈ సినిమాకు హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌. మూడు సినిమాల్లో హీరోగా నటించిన అనుభవంతో ఆన్‌లైన్‌ డైరెక్షన్‌ ట్యుటోరియల్స్‌ చదివి ఈ సినిమాకు డైరెక్షన్‌ చేశానని అతడు తెలిపాడు. లో బడ్జెట్‌ సినిమా అయినా... ఎంతలో సినిమా తీశాననేది చెప్పలేదు కానీ, తొమ్మిది నెలల తన పాకెట్‌ మనీతో ఈ సినిమా తీశానని చేతన్‌ చెప్పుకొచ్చాడు. సినిమా చూశాక తన పాకెట్‌ మనీ ఎంత ఉంటుందో ఊహించుకోమన్నాడు. ప్రేక్షకులకు మార్నింగ్‌ షో ఫ్రీగా చూపించాలనే ఐడియా తనదేనని చేతన్‌ మద్దినేని తెలిపాడు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల్లో సరైన బజ్‌ రావడం లేదనీ, ఆడియన్స్‌లో అటెన్షన్‌ కోసమే మార్నింగ్‌ షో ఫ్రీగా చూపిస్తున్నానని ఈ హీరో చెప్పాడు. ఇంకా చేతన్‌ మద్దినేని మాట్లాడుతూ ‘‘నేను ఒక రోజు యూట్యూబ్‌లో ‘ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారెంటీ’ అనే సినిమా చూశా. చాలా నవ్వుకున్నాను. ఆ డైరెక్టర్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేసి మాట్లాడాను. ఎందుకు ఆడలేదని ఆడిగా. ప్రేక్షకుల్లో టాక్‌ రాలేదన్నాడు. ఒకవేళ అందరూ సినిమా చూసి మౌత్‌టాక్‌ స్ర్పెడ్‌ అయితే ఆ సినిమా హిట్‌ అయ్యేది. అందుకని, నా సినిమాకు మార్నింగ్‌ షోలు ఫ్రీగా వేస్తున్నా. వంద మంది సినిమా చూస్తే... అందులో 80 మందికి నచ్చుతుందనే నమ్మకం నాకుంది’’ అన్నాడు. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్స్‌లో కౌంటర్‌లో టికెట్స్‌ ఫ్రీగా ఇస్తారట. మల్టీప్లెక్స్‌లో మాత్రం ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’ ఏజెంట్స్‌ను పెడుతున్నామనీ, వాళ్లు టైటిల్‌ లోగో ఉన్న టీషర్టులు వేసుకుంటారనీ, టికెట్స్‌ ఫ్రీగా ఇస్తారని చేతన్‌ అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్‌లో మల్టీప్లెక్స్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే డబ్బులు వాపస్‌ ఇస్తామన్నాడు.
కొమరం భీమ్‌ పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇండియాలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అందులోనూ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న భామను బుధవారం సాయంత్రం ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. సినిమాలో జెన్నిఫర్‌ పాత్రలో ఒలీవియా మోరిస్‌ నటిస్తుందని ప్రకటించారు. ట్విట్టర్‌లో, సోషల్‌ మీడియాలో ఆమెకు పెద్దగా ఫాలోయింగ్‌ లేదు. హాలీవుడ్‌లోనూ పెద్దగా పేరున్న నటి కాదు. అయితే, ఈ సినిమాతో ఇండియన్‌ ఆడియన్స్‌ ఆమెను ఫాలో అయ్యే అవకాశముంది. మొదట ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్‌ నటి డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ను తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుండి ఆమె తప్పుకోవడంతో చాలా రోజులు ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలని మల్లగుల్లాలు పడ్డారు. చివరకు, ఒలీవియా మోరిస్‌ను ఎంపిక చేశారు.  
'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత బరువు తగ్గడానికి నానా తిప్పలూ పడుతూ వచ్చింది. ఆమె వల్లే 'బాహుబలి 2' షూటింగ్ ఆలస్యమయ్యిందన్న ప్రచారమూ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయిన 'సైజ్ జీరో' సినిమా తనకు నటిగా మంచి పేరు తెస్తుందనే ఉద్దేశంతో, ఆ మూవీ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి సూచన మేరకు బాగా లావయ్యింది. ఒక స్థూలకాయురాలైన అమ్మాయి జీవిత ప్రయాణం నేపథ్యంలో తీసిన ఆ సినిమా అనుష్క ఆశించిన దానికి భిన్నంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనుష్క కెరీర్‌కీ ఆ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు.  ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, 'బాహుబలి 2' షూటింగ్‌కు వచ్చిన ఆమెను చూసి రాజమౌళి తీవ్రంగా అసంతృప్తి చెందాడు. యువరాణి దేవసేన పాత్రకు కావాల్సిన రూప లావణ్యాలు అనుష్కలో కనిపించలేదు. కారణం.. ఆమె ఇంకా భారీ పర్సనాలిటీతోనే ఉండటం. రాజమౌళి గట్టిగా చెప్పడంతో బరువు తగ్గే ప్రయత్నం చేసింది అనుష్క. అయినా 'బాహుబలి'లో కనిపించిన దానితో పోలిస్తే, 'బాహుబలి 2'లోని చాలా సన్నివేశాల్లో అనుష్క లావుగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. 'సైజ్ జీరో' తర్వాత ఆమె 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి', 'ఓం నమో వెంకటేశాయ' సినిమాల్లోనూ స్థూలకాయంతో కనిపించింది. సహజంగా యోగా ప్రాక్టీస్ చేసే అనుష్క బరువు తగ్గే విషయంలో చాలా ఆలస్యం చేసిందని చెప్పాలి. 'భాగమతి'లోనూ, 'సైరా.. నరసింహారెడ్డి'లోనూ మునుపటంత స్లింగా కాకపోయినా బరువు తగ్గి కనిపించింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీషు భాషల్లో తయారవుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. అందులో మాధవన్ జోడీగా ఒక మూగ చిత్రకారిణి అయిన సాక్షి అనే క్యారెక్టర్ చేసింది అనుష్క. 'బాహుబలి'కి ముందు చీరకట్టులో ఎంత బాగా కనిపిస్తూ వచ్చిందో, వెస్టరన్ డ్రస్సుల్లోనూ అంతలా మెప్పించింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వెస్టరన్ ఔట్‌ఫిట్‌లో ఆమె ఎంత బాగా ఉన్నదో తెలియజేసే ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. అనుష్క.. లో-వెయిస్ట్ జీన్స్‌లో ఉన్న ఆ ఫొటోలు ఫ్యాన్స్ మతులు పోగొడుతున్నాయి.  పింక్ కలర్ జీన్స్‌లో ఉన్న ఆ ఫొటోల్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రిట్వీట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆ ఫొటోల్లో ఒకటి బ్యాక్ వ్యూ అయితే, ఇంకొకటి ఫ్రంట్ వ్యూ. ఆ ఫొటోల్లో అనుష్కను చూసిన వాళ్ల కళ్లు పెద్దవి కావడం ఖాయం. తెలుగువాళ్లకు, తమిళులకు ఆరాధ్య తార అయిన అనుష్క 'బాహుబలి' సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. దేవసేన పాత్రలో అమోఘంగా రాణించి, ప్రభాస్‌కు సరైన జోడీగా నీరాజనాలు అందుకుంది. అంతకు ముందు కూడా ప్రభాస్ సరసన ఆమె 'మిర్చి', 'బిల్లా' సినిమాల్లో నటించింది. 'బాహుబలి: ద బిగినింగ్'లో నటించేప్పుడే ఆ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధం ఉందంటూ బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తమ మధ్య స్నేహబంధం ఉంది కానీ, ప్రేమబంధం లేదని ఇద్దరూ చెబుతూ వచ్చారు. అయినా వాళ్లపై వదంతులకు ఫుల్‌స్టాప్ పడలేదు. త్వరలో ఆ ఇద్దరూ పెళ్లాడబోతున్నారని కూడా విరివిగా ప్రచారంలోకి రావడంతో, తమ ఇద్దరిలో ఏవరో ఒకరికి పెళ్లయితే కానీ ఈ వదంతులు ఆగవేమోనని ప్రభాస్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అయినా కూడా ప్రయోజనం కలగలేదు. నలభై యేళ్లయినా ప్రభాస్ కానీ, 38 ఏళ్ల వయసులో ఉన్న అనుష్క కానీ ఇంతదాకా పెళ్లాడలేదు. అందువల్లే వాళ్ల ఇద్దరి అనుబంధం గురించిన ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది. అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. 'నిశ్శబ్దం' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్టుగా 'అసురన్' రీమేక్‌లో వెంకటేశ్ భార్యగా నటించే చాన్స్ వచ్చిందనే న్యూస్ బయటకు వచ్చింది. ధనుష్ హీరోగా నటించగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన తమిళ మూవీ 'అసురన్' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దాని తెలుగు రీమేక్ రైట్స్ చేజిక్కించుకున్న డి. సురేశ్‌బాబు, ఆ మూవీని తన తమ్ముడు వెంకటేశ్ హీరోగా రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. తమిళంలో మంజు వారియర్ చేసిన కేరెక్టర్‌ను తెలుగులో శ్రియ చేస్తుందనే ప్రచారం జరుగగా, ఇప్పుడు ఆమె స్థానంలో అనుష్క పేరు వినిపిస్తోంది. అదే నిజమైతే.. 'చింతకాయల రవి', 'నాగవల్లి' సినిమాల తర్వాత మూడోసారి ఆ ఇద్దరూ కలిసి నటించినట్లవుతుంది.
తెలుగులో పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ ఏంటనేది ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. పవర్‌ స్టార్‌కు యంగ్‌ స్టార్‌ హీరోల్లో చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అటువంటి హీరో కొంత విరామం తర్వాత, రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వస్తున్న వార్తను ఎక్కడో ముంబైలో ఉన్న ఓ క్రిటిక్‌ ట్వీట్‌ చేయడం ఏంటనేది చాలామందికి అర్థం కాలేదు. ‘దిల్‌’ రాజు, బోనీ కపూర్‌ నిర్మాణంలో పవన్‌కల్యాణ్‌ తెలుగులో ‘పింక్‌’ రీమేక్‌ చేస్తారని హిందీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశాడు. దాన్ని బోనీ కపూర్‌ రీట్వీట్‌ చేశారు. కానీ, ‘దిల్‌’ రాజు నిర్మాణ సంస్థ గానీ... ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తులు గానీ రీట్వీట్‌ చేయలేదు. కారణాలు ఏంటని ఆరా తీస్తే... పవన్‌కల్యాణ్‌కు చెప్పకుండా, ఆయన నుండి పూర్తిగా హామీ తీసుకోకుండా బోనీ కపూర్‌ హిందీ ఇండస్ట్రీలో ‘పింక్‌’ రీమేక్‌ గురించి ప్రకటించుకున్నారట! కనీసం ‘దిల్‌’ రాజుకు కూడా ‘పింక్‌’ రీమేక్‌ ప్రకటన గురించి తెలియదట! తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌, బోనీ కపూర్‌ రీట్వీట్‌తో పవర్‌స్టార్‌ దగ్గర వ్యక్తులు, ‘దిల్‌’ రాజు కాంపౌండ్‌ షాకయ్యారట! పవన్‌ కల్యాణ్‌ మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆయన సెట్‌కి వచ్చేవరకూ నమ్మలేని పరిస్థితి. మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ రీమేక్‌ స్ర్కిప్ట్‌ మొత్తం పూర్తయిన తర్వాత చేయనని చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నా ఏది ముందు చేయాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం.
తెలుగులో రష్మిక మందన్నాకు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా 'గీత గోవిందం'. నిజానికి, ఆ సినిమాలో కథానాయిక పాత్రలో నటించమని దర్శకుడు పరశురామ్ పలువురు అగ్ర నాయికలను సంప్రదించారు. అప్పటికి, 'అర్జున్ రెడ్డి' విడుదల కాలేదు.‌ విజయ్ దేవరకొండ స్టార్ కాదు. అందుకని, అతడి పక్కన నటించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. 'గీత గోవిందం' విడుదల సమయంలో రష్మిక కంటే ముందు ఎవరెవరిని సంప్రదించారని దర్శకుడు పరశురామ్ ను అడిగితే... 'ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు?' అని సమాధానం దాటవేశారు. అతడు సంప్రదించిన కథానాయకులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ సంగతిని తాజాగా ఆమె బయట పెట్టింది. హిందీలో 'దే దే ప్యార్ దే'కు  సంతకం చేయడం వల్ల 'గీత గోవిందం' చేయలేక పోయానని తాజాగా రకుల్ వెల్లడించారు. రెండు సినిమాల షెడ్యూల్స్ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'గీత గోవిందం' వదులుకున్నానని ఆమె తెలిపారు. రకుల్ రిజక్ట్ చేయడంతో ఆ అవకాశం రష్మికకు వచ్చింది. ఆమె స్టార్ అయ్యారు. ఈ విధంగా రకుల్ వదులుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.
  తెలుగు సినిమా ప్రముఖులే లక్ష్యంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఇన్ కమ్ (ఐటీ) టాక్స్ అధికారులు రైడ్స్ చేయడం ప్రారంభించారు. దాంతో షెడ్యూల్ ప్రకారం జరగవలసిన కొన్ని షూటింగ్ లు రద్దయ్యాయి. ఓ ప్రెస్ మీట్ లొకేషన్ మారింది. టాలీవుడ్ ప్రముఖులు కాస్త ఇబ్బందికి గురయ్యారనే మాట అక్షర సత్యం. అసలు వివరాల్లోకి వెళితే... ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఇండస్ట్రీ కింగ్ పిన్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు ఆఫీసుల్లో బుధవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోలో సురేష్ బాబు ఆఫీస్ ఉంది. అలాగే, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆఫీస్ కూడా! అందువల్ల, బుధవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులు రాకుండా, ఐటీ అధికారులు గేటు తాళాలు వేశారు. దాంతో స్టూడియోలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న కొందరు ఇబ్బంది పడ్డారు. 'మిస్ మ్యాచ్' ప్రెస్ మీట్ లొకేషన్ రామానాయుడు స్టూడియో నుండి ఫిల్మ్ చాంబర్ కు మారింది.  సురేష్ బాబు ఆఫీసుతో పాటు ప్రముఖ యువ హీరో నాని ఇంటిపై కూడా ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఏడాదికి మినిమమ్ రెండు చిత్రాల్లో నాని నటిస్తారు. ఇటీవల ఆయన పారితోషకం పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో నానిపై ఐటి అధికారుల కన్ను పడి ఉండవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిపై కూడా ఐటీ రైడ్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి‌. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
  సూపర్‌స్టార్ మహేశ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తయారవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంగళవారం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి చేసింది. దీని కోసం టాలీవుడ్‌లోనే తొలిసారిగా 'అన్‌లాక్' టూల్‌ను ప్రవేశపెట్టింది. అంటే ట్విట్టర్ అకౌంట్‌లో అదిపెట్టిన 'అన్‌లాక్' టూల్‌ను క్లిక్ చేస్తే మనకు టీజర్ రిలీజ్ డేట్ రివీల్ అవుతుందన్న మాట. అలా ఫ్యాన్స్‌లో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ ఎప్పుడా అనే క్యూరియాసిటీని అమితంగా క్రియేట్ చేశారు. నవంబర్ 22న మూవీ ఫస్ట్ టీజర్ వస్తుందనే సమాచారంతో మహేశ్ ఫ్యాన్స్‌లో సంబరాలు ఒక్కసారిగా అంబరాన్ని అంటాయి. "గెట్ రెడీ పీపుల్. మాస్ మహేశ్ బాబు మేనియా బిగిన్స్ విత్ 'సరిలేరు నీకెవ్వరు' టీజర్! లెట్స్ సెట్ ద స్క్రీన్స్ ఆన్ ఫైర్" అంటూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. క్షణాల వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనే హ్యాష్‌టాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. దానికంటే ముందు 'అన్‌లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్' అనే హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఈ రెండు హ్యాష్‌టాగ్‌లూ ఇప్పుడు ట్విట్టర్ వేదికపై హల్‌చల్ చేస్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడ్ అవుతున్నదనే విషయాన్ని మూడు రోజుల క్రితమే, అంటే నవంబర్ 16నే అనిల్ రావిపూడి బయటపెట్టాడు. 'టీజర్ లోడింగ్' అంటూ 'సరిలేరు నీకెవ్వరు' ట్యాగ్‌ను జోడించడంతో దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే మూవీ టీజర్ బయటకు రానున్నదనే విషయం తెలియడంతో, ఆ డేట్ ఎప్పుడా అనే ఆత్రుతతో మహేశ్ ఫ్యాన్స్ అల్లాడిపోతూ వచ్చారు.  మంగళవారం మధ్యాహ్నం టీజర్ రిలీజ్ డేట్ టైం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి అవుతుందంటూ ఫ్యాన్స్‌ను ప్రొడక్షన్ హౌస్ ఊరించింది. 'అన్‌లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్'తో ప్రి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయంటూ అది ట్వీట్ చేసింది. మరో మూడు గంటల తర్వాత టీజర్ డేట్‌ను అన్‌లాక్ చేయడానికి 'సరిలేరు నీకెవ్వరు' టీం ఒక యూనిక్ ప్లాన్‌తో వస్తోందని తెలిపారు. "సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టడానికి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేశారు. టీజర్ త్వరలోనే బయటకు వస్తుందంటూ ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా టీజర్ డేట్‌ను అన్‌లాక్ చెయ్యడానికి ఒక యూనిక్ ప్లాన్‌తో ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికపై అన్‌లాక్ ఫీచర్‌ను ఉపయోగించడం ఒక తెలుగు సినిమాకి సంబంధించి ఇదే ప్రథమం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ అకౌంట్‌పై 6:03 గంటలకు టీజర్ డేట్, టైంను వెల్లడి చేస్తారు. దీని కోసం ఒక కొత్త టూల్‌ను నిర్మాతలు ఉపయోగిస్తున్నారు" అంటూ తెలిపింది. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. దాన్ని ఇంకా పెంచుతూ, మరో రెండు గంటల తర్వాత "ఈరోజును 'సూపర్‌ఫ్యాన్స్'కు అంకితం చేస్తున్నాం. గెట్ రెడీ ఫర్ ద మాస్ మహేశ్ బాబు ధమాకా ఎట్ 6:03 పీఎం" అంటూ ట్వీట్ చేసింది ప్రొడక్షన్ హౌస్. ఆ వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగం మీదకు వచ్చాడు. "సూపర్‌స్టార్‌కు సంబంధించిన మాసివ్ న్యూస్‌ను వెల్లడి చేయబోతోంది ఎవరో ఊహించండి. 'నువ్వు'.. ఎందుకంటే .. సరిలేరు నీకెవ్వరు" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అదెలాగా? అంటూ ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్నట్లే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ 'అన్‌లాక్' టూల్‌తో టీజర్ డేట్‌ను బయటపెట్టింది. ఫ్యాన్స్ అంతా ఆ టూల్‌ను అన్‌లాక్ చేసి 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ నవంబర్ 22 అనే విషయం తెలుసుకున్నారు. వెంటనే సంబరాల్లో మునిగిపోయారు.  ఆ తర్వాత టీజర్ రిలీజ్ టైంను కూడా ప్రొడక్షన్ హౌస్ బయటపెట్టింది. ఆ టైం.. 22 నవంబర్ సాయంత్రం 5:04 గంటలు! "నవంబర్ 22 సాయంత్రం 5:04 గంటలకు మేజర్ అజయ్ కృష్ణను చూడండి" అంటూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు రెండూ ట్వీట్ చేశాయి. అంటే శుక్రవారం మహేశ్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగే. మహేశ్ జోడీగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు చేస్తున్నారు. జనవరి 12న 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతదాకా మూవీకి సంబంధించిన ప్రచారం ఎప్పుడు మొదలవుతుందా అని అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తూ వస్తున్న వాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 22న టీజర్ అనే ఒక చిన్న శాంపిల్‌తో మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్ ఎలా ఫ్యాన్స్‌ను వెర్రెత్తిస్తాడో.. వెయిట్ అండ్ సీ.. 
సెలబ్రిటీ ఫ్యామిలీగా ముంబైలో కానీ, దేశవ్యాప్తంగా కానీ అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న పేరే వేరు. అమితాబ్, జయా బచ్చన్.. ఇద్దరూ సినిమాల్లో జంటగా నటించి, ప్రేమలో పడి పెళ్లాడారు. అదే రీతిలో వాళ్లు కలిసి చేసిన సినిమాలు తక్కువైనా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఆ ఫ్యామిలీ సినీ రంగంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్, మోడల్ రాజీవ్ ముల్‌చందానితో ఐశ్వర్య ఎఫైర్లు నడిపిందనే ప్రచారాలు ఏ రీతిన మీడియాలో హల్‌చల్ చేశాయో మనకు తెలుసు.  ఆ విషయం అలా ఉంచితే, మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహించిందనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో బాగా చలామణిలోకి వచ్చింది. కారణం.. 'చెహ్రే' మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి అమితాబ్ నటిస్తుండటం! దానికీ, ఆమె కోపానికీ లింకేమిటి అనుకుంటున్నారా? లింకు ఉంది. ఇమ్రాన్ హష్మి అంటే ఐశ్వర్యకు ఏమాత్రం గిట్టదు. ఐదేళ్ల క్రితం, అంటే 2014లో పేరుపొందిన టీవీ షో 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్న ఇమ్రాన్, హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ఐశ్వర్యా రాయ్‌పై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఐశ్వర్యను 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' అంటూ అభివర్ణించాడు. అతడి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. అప్పట్నుంచీ ఇమ్రాన్ అంటే మండిపడుతూ వస్తోంది ఐశ్వర్య. అతడితో కలిసి నటించడానికి వచ్చిన అవకాశాల్ని మరో మాట లేకుండా తిరస్కరిస్తూ వచ్చింది. ఆ ఉదంతం జరిగి ఐదేళ్లయినా ఐశ్వర్య మర్చిపోలేదు. తాను ఆ మాటల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఇమ్రాన్ సంజాయిషీ ఇచ్చుకున్నా అతడిని ఐశ్వర్య క్షమించలేదు. "అది నవ్వులాటగా చెప్పిన మాట. దాన్ని ఆమె సీరియస్‌గా తీసుకొని బాధపడుతుందని ఊహించలేదు. ఐశ్వర్యా రాయ్‌కి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఎప్పుడైనా ఆమెను కలుసుకొనే అవకాశం వస్తే, నా మాటలకు క్షమాపణలు చెబుతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమెను బాధపెట్టే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు" అని తెలిపాడు ఇమ్రాన్. తన మాటలకు ఇమ్రాజ్ సంజాయిషీ చెప్పినా, అతడన్న 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' కామెంట్స్ ఐశ్వర్య మనసు నుండి తొలగిపోలేదు. ఆ మాటల్ని మరచిపోయే మూడ్‌లో ఆమె లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్‌తో కలిసి తన మామ అమితాబ్ బచ్చన్ నటిస్తుండటాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేక పోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటించలేదు. రుమి జాఫ్రీ డైరెక్ట్ చేస్తోన్న 'చెహ్రే' మూవీలో మొట్టమొదటిసారిగా వాళ్లు కలిసి నటిస్తున్నారు. ఆ మూవీలో 'తీన్ మార్' ఫేం కృతి ఖర్బందా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. తనను ఒక పబ్లిక్ ప్లాట్‌ఫాంపై కించపరిచే విధంగా మాట్లాడిన ఇమ్రాన్‌తో ఎలా కలిసి పనిచేస్తారని మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహంతో ఉన్నదంటూ కొంత కాలం క్రితమే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ ఆ విషయంలో ఐశ్వర్య ధోరణి మారలేదంటున్నాయి ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు. ఆ సినిమా చేస్తున్నప్పట్నుంచీ అమితాబ్‌తో ఆమె అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని లేటెస్టుగా ప్రచారం నడుస్తోంది. గతంలో 'బాద్‌షాహో' సినిమాలో అజయ్ దేవ్‌గణ్ జోడీగా నటించే అవకాశం వచ్చినప్పుడు, ఆమె తిరస్కరించింది. కారణం.. అందులో ఇమ్రాన్ హష్మి ఉండటం. అతడితో కలిసి పనిచేయడాన్ని ఆమె ఏమాత్రమూ ఇష్టపడటం లేదని అందరికీ తెలిసిందప్పుడే.  అంతేకాదు, ఇమ్రాన్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆమె దాచుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, "మీకు బాధ కలిగించిన ,మీపై వచ్చిన వరస్ట్ కామెంట్ ఏమిటి?" అనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఏమాత్రం తడుముకోకుండా "నేను ఫేక్ అండ్ ప్లాస్టిక్ అనే కామెంట్‌ను" అని బదులిచ్చింది ఐశ్వర్య. అయితే మీడియాలో తన కామెంట్ ప్రచారంలో ఉన్నందువల్లే ఆమె దాన్ని మరచిపోలేదంటున్నాడు ఇమ్రాన్. వినోదం కోసం కరణ్ జోహార్ ఇలాంటి మాటల్ని అనిపిస్తుంటాడనీ, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ అతను తెలిపాడు. అయితే సున్నితమనస్కురాలిగా ముద్రపడిన ఐశ్వర్య మాత్రం ఇప్పట్లో అతడి మాటని మర్చిపోయేట్లు లేదు. కాగా అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటిస్తోన్న 'చెహ్రే' సినిమా 2020 ఏప్రిల్ 24న విడుదల కానున్నది.
  నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకొని, విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. నాని కేరెక్టర్‌ను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఇటీవలే 'అర్జున్‌రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'గా నటించి, సూపర్ హిట్ కొట్టిన షాహిద్, వెంటనే మరో తెలుగు రీమేక్‌కు సంతకం చెయ్యడం గమనార్హం. ఈ మూవీలో నాయికగా మృణాల్ ఠాకుర్ ఎంపికైంది. 'సూపర్ 30', 'బాట్లా హౌస్' సినిమాలతో తన నటనతో అలరించిన మృణాల్‌కు ఇది భిన్న కేరెక్టర్. షాహిద్‌తో కలిసి నటిస్తుండటంపై మాట్లాడుతూ "షాహిద్ జోడీగా 'జెర్సీ'లో నటించనుండటం నన్ను ఉద్వేగానికి గురి చేస్తోంది. ఒరిజినల్ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషనల్ జర్నీకి పడిపోయాను" అని చెప్పింది మృణాల్. సినిమాలో ఆమెది చాలా కీలక పాత్ర. 36 ఏళ్ల వయసులో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఒక క్రికెటర్ జీవితంలోని హృదయాన్ని మెలిపెట్టే దశను చూపించే ఆ కథలో, ఆ క్రికెటర్‌కూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్యకూ మధ్య నెలకొన్న ఘర్షణ కీలక పాత్ర పోషిస్తుంది. అంతకుముందు, తన ఇన్‌స్టాగ్రాం పేజీలో జెర్సీలోని తన లుక్‌ను వెల్లడి చేశాడు షాహిద్. చేతిలో క్రికెట్ బ్యాట్‌తో, వైట్ జెర్సీలో కనిపిస్తున్న అతను "జెర్సీ ప్రిపరేషన్స్ బిగిన్స్' అంటూ పోస్ట్ చేశాడు.
పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం.  గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.
  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  
కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.
  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం జంట నగరాల్లో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే. రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమానులు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనల తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.వాహన దారుల పరిస్థితి గమనించి అమ్ముతానంటున్నారు.  పెట్రోల్ ను బాటిళ్లో తీసుకెళ్లి  ఎమ్మార్వో హత్య చేశారు. పెట్రోల్ బంకు డీలర్లు అందరం కలసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఇలా అమ్మడం వల్ల జరగకూడనివి జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీగా ఎవరికైతే అవసరముందో వాళ్లకే బాటళ్లో ఇవ్వబడుతుందన్నారు. మామూలుగైతే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిచేశామని.. ఇంకా ఏమైనా ఆదేశాలు వస్తే మొత్తంగా ఆపేస్తామన్నారు. కేవలం కస్టమర్ ని  దృష్టిలో పెట్టుకొని వాళ్ల ఇబ్బంది తొలగించటానికి మాత్రమే ఒక సహాయక రూపంలోనే ఇవ్వడం జరుగుతుందని ఏ యజమాని వెల్లడించారు.మరోవైపు బంక్ యజమానుల ఆదేశాలనుసారం తాము బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం లేదని.. అది ఎప్పటి నుంచో అమల్లో ఉందని బంక్ లో పని చేసే ఉద్యోగులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోయడం వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
  ఆయన ఒక పశువుల వైద్యుడు. ఆ వైద్యుడికి ఒక రోజు తమ ఇంటికి రమ్మంటూ ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందట. సరే! వైద్యుడు దానిని ఎలాగైనా నయం చేసే అవకాశం ఉందేమో చూసేందుకు సదరు ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి పెరట్లోకి అడుగుపెట్టిన వైద్యుడికి ఓ మూలగా కూర్చుని ఉన్న కుక్కని చూడగానే అర్థమైపోయింది. దానికి వయసు మీదపడిపోయిందనీ, తన అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదనీ!   కుక్క చుట్టూ ఆ ఇంటి యాజమానీ, అతని భార్యా, వారి పన్నెండేళ్ల కొడుకూ దీనంగా నిల్చొని కనిపించారు. ‘‘మీకు ఈ మాట వినడం కష్టంగా ఉంటుందని తెలుసు! కానీ వాస్తవం చెప్పక తప్పదు. ఈ కుక్క ఊపిరితిత్తులు క్షీణించిపోయాయి. అది మరెంతో కాలం బతకదు. కానీ దాన్ని కనుక ఇలాగే వదిలేస్తే అది అనుక్షణం నరకయాతన పడాల్సి ఉంటుంది. మీకు సమ్మతం అయితే కనుక అది ఇంక ఎలాంటి బాధా పడకుండా వెంటనే చనిపోయేందుకు ఒక ఇంజక్షను ఇస్తాను,’’ అని చెప్పాడు వైద్యుడు.   వైద్యుడి మాటలు వినగానే వారి మొహాలు పాలిపోయాయి. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఆ కుక్క వారి కుటుంబంలో భాగంగా మారిపోయింది. అది లేకుండా వారికి పూటైనా గడిచేది కాదు. పొద్దు పోయేదీ కాదు! అలాంటి కుక్కని తమ చేతులతో తాము చంపాల్సి రావడం వారి గుండెని పిండేసింది. కానీ అది బాధతో చనిపోయేకంటే అనాయాసంగా చనిపోవడమే మేలనిపించింది. దాంతో మనసుని రాయి చేసుకుని ‘మీ ఇష్టం! మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి!’ అన్నాడు కుటుంబ యజమాని.   వైద్యుడు నిదానంగా తన బ్యాగ్‌లోంచి ఒక ఇంజక్షను తీసుకుని ఆ కుక్కకు ఇచ్చాడు. మరుక్షణమే అది మూలుగుతూ తన ప్రాణాలను విడిచింది. ఆ దృశ్యంతో కుటుంబసభ్యులలో ఉన్నా కాస్త నెత్తురూ పాలిపోయింది. వారి తలలు వాలిపోయాయి. కుక్క పట్ల వాటి యజమానులు చూపించే అభిమానం వైద్యుడికి కొత్తేమీ కాదు. అందుకనే వారిని కాస్త ఓదార్చేందుకు- ‘‘కుక్కలు కూడా మనలాగే నిండు నూరేళ్లు బతికితే బాగుండు కదా! కానీ పాపం అవి ఎందుకో పది పదిహేను ఏళ్లకు మించి బతకవు,’’ అన్నాడు. వైద్యుని మాటలకు యజమాని కొడుకు చివ్వున తలెత్తి చూశాడు. ‘‘కుక్కలు అంత తొందరగా ఎందుకు చనిపోతాయో నాకు తెలిసిపోయింది!’’ అన్నాడు.   కుర్రవాడు ఏం చెబుతాడా అని అంతా ఆసక్తిగా చూశారు. అతను తన కుర్రతనానికి తగిన సమాధానం ఇస్తాడులే అన్నట్లుగా అతని వంక చులకనగా చూశాడు వైద్యుడు. కానీ అతను చెప్పిన సమాధానానికి వారి దిమ్మ తిరిగిపోయింది. ‘‘మనిషి తన తోటివారిని ప్రేమించేందుకు, ప్రతి రోజునీ కొత్తగా స్వీకరించేందుకు, ప్రతిక్షణం సంతోషంగా జీవించే నేర్పు సాధించేందుకు... చాలా కాలం పడుతుంది. కానీ కుక్కకి ఆ నేర్పు పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఆ నేర్పుతోనే అది బతికే కొద్దికాలం హాయిగా బతికేస్తుంది. ఇక దానికి నూరేళ్లు జీవించాల్సిన అవసరం ఏముంది!’’ అన్నాడు కొడుకు తలవంచుకునే. అందరూ కుక్క బతుకంటే హీనమైనదంటారు. కానీ అసూయాద్వేషాలతో నిండు నూరేళ్లు రగిలిపోయేవారికన్నా కుక్క బతుకు ఎంత నయమో కదా! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  తెల్లారిలేస్తే ఎదో ఒకటి కొనాలనిపిస్తుందా? కనిపించిందల్లా కొనకుండా ఉండలేకపోతున్నారా? అయితే.."కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందేమో చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఆ మధ్య ప్రజల షాపింగ్ అలవాట్లు ఎలా ఉన్నాయో చూద్దామని... స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ "స్కూల్ ఆఫ్ మెడిసిన్" పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అందులో తేలిన విషయం... ప్రతి 20మందిలో ఒకరికైనా ఈ "కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందని... ఏమంత అవసరం లేని వస్తువులని కూడా కొనెయ్యటం, తరుచూ షాపింగ్ మాల్స్ కి వెళ్ళటం, తెల్లారి లేచి ఎదో ఒకటి కొనాలనే తాపత్రయం... ఇదో రుగ్మత స్థాయికి చేరి, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే స్థాయికి చేరటం గమనించారు. ఆ అధ్యయనంలో ముఖ్యంగా ఆడవారిలో, అలాగే టీనేజ్ వారిలో ఈ డిజార్డర్ ఎక్కువగా ఉందట. మరి మీరు కూడా అవసరానికి షాపింగ్ చేస్తున్నారా లేక అనవసరంగా కేవలం సరదా కోసం షాపింగ్ చేస్తున్నారో తెలుసుకొని జాగ్రత్తపడితే మంచిది. - రమ
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే  అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా  తీపి  పదార్థాలు తినాలని అనిపిస్తే మరో నెలలో పులుపు లేదా కారం ఉన్నవి ఎక్కువగా తినాలనిపిస్తుందిట. మానసిక స్థితిలోని మార్పులలాగానే ఆహారపదార్థాల మీదుండే కోరిక కూడా మారుతూ ఉంటుందిట. అంతేకాదు మానసిక ఆందోళనా,టెన్షన్స్,నిరుత్సాహం ఎక్కువగా ఉన్నవారి మెదడులో కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో వారు అతిగా తినటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎంత తింటున్నదీ,ఏం తింటున్నది అస్సలు పట్టించుకోరట. కేవలం డిప్రెషన్,టెన్షన్ మాత్రమే క్రేవింగ్ కి కారణం కాదు. రక్తంలో గ్లూకోస్ నిలవలు తగ్గిపోవటం, భోజనం చేసే వేళల మధ్య మరీ ఎక్కువ గ్యాప్ రావటం, హార్మోన్ల ఇంబాలన్స్ కూడా క్రేవింగ్ కి కారణాలు అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఇలాంటి ఇలా క్రేవింగ్ బారిన పడినవాళ్లు దానిని నియంత్రిన్చుకోవటం అంత  పెద్ద పనేం కాదు. ఇది తగ్గుముఖం పట్టాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో లంచ్,డిన్నర్లాంటివి తీసుకోకుండా ప్రతి మూడు గంటలకి ఒకసారి మితాహారాన్ని తీసుకోవటం వల్ల దీనిని నివారించవచ్చు. ఇలా మితాహారం కొంచెంకొంచెంగా తినటం వల్ల గ్లూకోజ్  పర్సెంటేజ్ నిలకడగా ఉంటుంది. క్రేవింగ్ బారిన పడినవారు పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలిట. ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్,ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలిట. ఏదైనా తినాలని అనిపించినప్పుడు దాని మీద నుంచి ధ్యాస మారటానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే క్రేవింగ్ నుండి బయటపడటమే కాదు నాజుకుగా కూడా తయ్యారవుతారు. కళ్యాణి 
  కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.   అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.       *  చూడగానే తన ఎర్రటి రంగుతో కూరాలకి మంచి రంగునిచ్చే మిరపకాయలు కొవ్వుని కరిగిస్తాయట. ఎండుకారం ఒంట్లో వేడి పుట్టేలా చేసి కొవ్వుని నియంత్రిస్తుంది. అంతేకాదు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుందిట. అయితే వేసవిలో మాత్రం వీటి వాడుకలో కొంత మార్పులు చేసుకోవాలి.     *  మిరియాలలో ఉండే పిపరైన్ అనే పదార్థం ఒంట్లో కొవ్వుని పెంచే కణాల పెరుగుదలని నియంత్రిస్తుందిట.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూరలలో కారానికి బదులు మిరియాలపొడి వేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.       *  మసాల దినుసులలో మంచి ఘుమఘుమలాడే దాల్చిన చెక్కకి కూడా కొవ్వుని కరిగించే గుణం ఉంది. ఇది షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటం వల్ల బరువు త్వరగా పెరగరు. దాల్చిన చెక్క పొడిలో  కొద్దిగా తేనే కలిపి వేడినీటితో సేవించినా కొవ్వు కరుగుతుంది. ఇలా ఆహారవిషయంలో పాటించే కొద్దిపాటి జాగ్రత్తల వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.    ...కళ్యాణి
  ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి.  ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది.  ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.   -రమ