LATEST NEWS
భారతీయ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ  ఊరట లభించింది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ పరిణామం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గతంలో చేసిన  చోర్‌ కీ సర్దార్‌ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే.. తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో  రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌ను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, దీనిపై   విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరువునష్టం కేసుకు సంబంధించి దిగువ కోర్టులో జరుగుతున్న తదుపరి విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు రాహుల్‌ గాంధీకి  ఊరటనిచ్చాయి. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ అంశాలు, న్యాయపోరాటాలతో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీకి ఈ పరిణామం పెద్ద ఉపశమనం కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. [Big Relief Rahul Gandhi, Supreme Court, Defamation Case, Bombay High Court, Narendra Modi, Congress Party, Telugu One]
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చంద్రబాబుతో భేటీలో  తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీటి విడుదలపై చర్చించారు.   చెన్నైలో తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నిల్వలు, తెలుగు గంగ ద్వారా అందుతున్న నీటి పరిమాణం వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.   రాష్ట్రంలోని సాగునీటి, తాగునీటి అవసరాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసిన తర్వాతే అదనపు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీరు అందిందని చెప్పిన విజయ్.. నీటి విడుదల పెంచాలని చంద్రబాబును కోరారు. నీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు. అలాగే ఈ భేటీలో నదుల అనుసంధానంపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగింది. కాగా చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు.  [Chandrababu Naidu Vijay Meeting, Telugu Ganga Water Release, Tamil Nadu CM Vijay, Chennai Drinking Water, Godavari Cauvery River Linking, Andhra Pradesh Tamil Nadu Water Sharing, Telugu One]
వైసీపీ హయాంలో మంచీచెడూ అన్న విచక్షణ లేకండా అనుచిత భాషా ప్రయోగంతో అప్పటి విపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోకేష్ లపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కలికానిక్కూడా కనిపించకుండా, వినిపించకుండా సైలెంట్ అయిపోయారు. అప్పటి సీఎం జగన్ మెప్పు పొందడమన్న ఏకైన లక్ష్యంతో కన్నూ మిన్నూ గానకుండా అహంకారంతో విర్రవీగారు. ఆ తరువాత తత్వం బోధపడి బహిరంగ క్షమాపణలు చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనకు తిరుగే లేదనుకున్న గన్నవరంలో ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా, ఆ తరువాత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఓటమి తరువాత ఈ 30 నెలల కాలంలో ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అడపాదడపా తప్ప బహిరంగంగా జనాల మధ్యకు వచ్చిందే లేదు. సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు. తాను గన్నవరం వదిలి వెళ్లేది లేదని చెబుతూ.. వైసీపీ అధినేత జగన్ తన వెంట ఉన్నారనీ, గన్నవరంలో మళ్లీ మరింత బలం పుంజుకుంటాననీ ధీమా వ్యక్తం చేశారు.   ఆయన ధీమా సంగతి అటుంచితే..  గన్నవరంలో వల్లభనేని వంశీ మళ్లీ మునుపటి పట్టు సాధించడం అంత సులభం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సుదీర్ఘకాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండటం, అలాగే   తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడం వల్లభనేని వంశీకి పెను సవాలేనని అంటున్నారు.    తాజాగా వంశీ మాటలను బట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయం అని అవగతమౌతుంది. అయితే  క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతు సంపాదించుకోవడం వంశీకి ఎంత వరకూ సాధ్యమౌతుందన్న అనుమానాలు వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయి.     [Vallabhaneni Vamsi Active Politics Again, Gannavaram Politics, YCP Vamsi ReEntry,  Vallabhaneni Vamsi, AP Politics,  Gannavaram Constituency,   Telugu One]
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ 'లాంగ్ కొవిడ్' తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యలకు అసలు కారణమేమిటో స్పష్టం చేస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. బాధితుల శరీరంలో చోటుచేసుకునే బ్యాక్టీరియా సమతుల్యతలో మార్పులే దీనికి మూలమని పరిశోధకులు స్పష్టం చేశారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన ఐదు నుంచి ఆరు నెలల వ్యవధిలో రోగుల నోటి ప్రాంతంతో పాటు ఊపిరితిత్తులలో ఉండే సూక్ష్మజీవుల (మైక్రోబయోమ్) మిశ్రమంలో స్పష్టమైన వ్యత్యాసాలు ప్రత్యక్షమయ్యాయి.  శ్వాసకోశ వ్యవస్థలోని సూక్ష్మజీవుల్లో వచ్చే ఈ హెచ్చుతగ్గులే ప్రధానంగా బాధితులలో దీర్ఘకాలిక శ్వాస రుగ్మతలు, జీర్ణక్రియ లోపాలు మరియు విషయగ్రహణ లోపాలకు కారణమవుతున్నాయని తేలింది.ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 2020 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో బ్రిటన్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 771 మంది బాధితులను నిశితంగా పరిశీలించారు. బాధితులు ఆసుపత్రి నుంచి కోలుకుని వెళ్లిన ఆరు నెలల తర్వాత, వారి నోటి లాలాజలం మరియు ఊపిరితిత్తుల కఫం శాంపిళ్లను ప్రత్యేకంగా సేకరించారు. సేకరించిన శాంపిళ్లలోని సూక్ష్మజీవులను విశ్లేషించడానికి పరిశోధకులు అత్యాధునిక డీఎన్ఏ సీక్వెన్సింగ్ సాంకేతికతను వినియోగించారు. ఈ విశ్లేషణలో తీవ్రమైన లాంగ్ కొవిడ్ సంకేతాలతో బాధపడుతున్న వారి నోరు, ఊపిరితిత్తులలో సాధారణ వ్యక్తుల కంటే గణనీయమైన బ్యాక్టీరియా తేడాలు ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా వీరిలో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా క్షీణించినట్లు నమోదైంది. కేవలం శ్వాసకోశ సమస్యలే కాకుండా, బాధితుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మెదడును మబ్బు కమ్మేసినట్లు ఉండే 'బ్రెయిన్ ఫాగ్', జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత కొరవడటం వంటి లక్షణాలున్న వారిలో ఈ బ్యాక్టీరియా హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు ఒళ్లు నొప్పులు, వికారం, విరేచనాలు, ఆకలి మందగించడం వంటి జీర్ణసంబంధిత రుగ్మతలకు కూడా ఇవే వ్యత్యాసాలు కారణమని తేలింది. అంతేకాకుండా, లాంగ్ కొవిడ్ బాధితులలో ల్యాక్టిక్ ఆమ్లాన్ని విపరీతంగా ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పరిమాణం అసాధారణంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా అధికమవడం వల్ల శరీరంలో అంతర్గత వాపులు (ఇన్‌ఫ్లమేషన్) ఏర్పడి, కణజాలం మరియు అవయవ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని అధ్యయనం వివరించింది. ఈ కొత్త  అధ్యయనంతో లాంగ్ కొవిడ్ బాధితులకు లక్ష్య ఆధారిత చికిత్సలు అందించేందుకు బాటలు పడినట్లయింది. భవిష్యత్తులో నోరు, ఊపిరితిత్తులలోని బ్యాక్టీరియా సమతుల్యతను పునరుద్ధరించే ప్రొబయోటిక్ లేదా ప్రత్యేక మందుల ద్వారా లాంగ్ కొవిడ్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.       [ Long Covid problems, UK research Covid, lung bacteria, brain fog symptoms, oral microbes DNA,  Covid After Effects, Long Covid Mystery, Medical Research, Health News, Latest Science News, COVID Research ]  
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిల్లలు పుట్టకపోవడాన్ని భార్య చేసిన తప్పుగా పరిగణించలేమని, దానిని భర్తపై మానసిక క్రూరత్వంగా ఆపాదించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం సంతానోత్పత్తి కోసమే కాదని, సంతానం లేదన్న ఒక్క కారణంతో వైవాహిక బంధంలో భాగస్వామి విఫలమైనట్లు నిర్ధారించలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చెన్నైకి చెందిన ఓ దంపతుల విడాకుల కేసులో ఈ తీర్పు వెలువడింది. తమకు వివాహమై చాలా ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదని, భార్య తనను బహిరంగంగా దూషించడంతో పాటు చెప్పుతో కొట్టిందని ఆరోపిస్తూ భర్త విడాకులు కోరారు. అయితే, తాను వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించానని భార్య కోర్టుకు వివరించింది. తన గర్భాశయంలో 8 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ సమస్య ఉన్నప్పటికీ శస్త్రచికిత్స చేయించుకున్నానని, ఫెర్టిలిటీ చికిత్సలు, హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నానని తెలిపింది. సంతానం కోసం ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను న్యాయస్థానం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ఫెర్టిలిటీ చికిత్స అనేది సాధారణ వైద్య ప్రక్రియ కాదని ధర్మాసనం పేర్కొంది. తరచూ స్కానింగ్‌లు, రక్త పరీక్షలు, ఇంజెక్షన్ల కారణంగా మహిళలు శారీరక ఇబ్బందులతో పాటు తీవ్ర భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటారని వివరించింది. ఇన్ని కష్టాలు భరిస్తూ భార్య చికిత్సలు చేయించుకోవడం, వైవాహిక బంధాన్ని కొనసాగించాలన్న ఆమె ప్రయత్నానికి నిదర్శనమని స్పష్టం చేసింది. దీనిని మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం మానసిక క్రూరత్వాన్ని విడాకులకు ప్రాతిపదికగా చూపాలంటే తగిన ఆధారాలు అవసరం. భర్త చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని భావించిన మద్రాసు హైకోర్టు ఆయన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది అమిత్‌రాజ్ కౌశల్ అభిప్రాయం ప్రకారం, కేవలం సంతానం కలగలేదన్న కారణంతోనే విడాకులు పొందలేరు. విడాకులు కోరే వ్యక్తి తన వాదనకు చట్టపరమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మొత్తంగా, సంతానలేమి లేదా ఫెర్టిలిటీ చికిత్సలు విఫలమవడాన్ని మాత్రమే మానసిక క్రూరత్వంగా పరిగణించలేమన్న ఈ తీర్పు వైవాహిక బంధాల్లో మహిళలపై సంతానం విషయంలో నిందలు మోపే ధోరణిపై కీలక సందేశాన్ని ఇస్తోంది.     [ Madras High Court, Divorce Case, Childless Marriage, Mental Cruelty, Hindu Marriage Act 1955, Section 13(1)(ia), Fertility Treatment, Infertility, Husband Wife Dispute, Divorce Petition, Chennai Couple, High Court Verdict, Marital Rights, Supreme Court Advocate Amit Raj Kaushal, Telugu News, Telugu One News ] 
ALSO ON TELUGUONE N E W S
బాలీవుడ్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా ‘ది డర్టీ పిక్చర్’. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా బాలన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించేందుకు నిర్మాత ఏక్తా కపూర్‌ సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చ మొదలైంది. తాజాగా ఈ రేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది. ‘ది డర్టీ పిక్చర్ 2’లో తమన్నా ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తృప్తి డిమ్రి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తమన్నా ఇటీవల ప్రత్యేక గీతాలు, గ్లామరస్ పాత్రలతో హిందీ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమె ఈ సినిమాలో నటిస్తే పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2011లో విడుదలైన ‘ది డర్టీ పిక్చర్’ సిల్క్ స్మిత జీవితం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కింది. ఈ సినిమాలో విద్యా బాలన్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది.  ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‌లో మాత్రం సిల్క్ స్మిత కథను మరోసారి చూపించబోవడం లేదని సమాచారం.1980లలో దక్షిణాది సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నిషా నూర్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: మైత్రి ఇన్ లవ్‌.. శ్రీకాంత్‌ కుమార్తె సినిమాతో రామజోగయ్య శాస్త్రి తనయుడి ఎంట్రీ.!       [Tamannaah Bhatia in The Dirty Picture 2, Silk Smitha, Dirty Picture Sequel, The Dirty Picture 2, Tamannaah Bhatia, Triptii Dimri, Ekta Kapoor, Vidya Balan, Telugu News  
హమ్మయ్య..ఎట్టకేలకు అభిమానుల ఎగ్జైట్ మెంట్ కి ఎండ్ కార్డు పడింది. నితిన్, నాచురల్ స్టార్ నాని కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'అలియాస్ రుక్మిణి'కి  సంబంధించిన హీరోయిన్ పేరుని  చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించేసింది.  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా మేనకోడలు అయిన యువ నటి ఆఫియా సయ్యద్‌ను ఈ చిత్రంలో 'రుక్మిణి' పాత్రకు పరిచయం చేస్తూ అఫీషియల్ వీడియోని విడుదల చేశారు. ఈవిడ చాలా స్ట్రిక్ట్ అండోయ్ అంటూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది.  ఆఫియా సయ్యద్‌ స్కూల్ టీచర్ అనే విషయం వీడియో ద్వారా అర్ధమవుతుంది. మొత్తం 55 సెకన్లు ఉన్న వీడియోలో స్కూల్ పిల్లలకి ఆఫియా  వార్నింగ్ ఇవ్వడం, తన లుక్స్ కేక. ఇది కూడా చదవండి: విజయవాడ కనకదుర్గమ్మ కొండపై జోసఫ్ విజయ్!   'దండోరా' వంటి విభిన్న చిత్రంతో తన సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తుండగా  ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు మరియు చిన్నపాటి క్లూస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జోమోన్ టీ. జాన్ పర్యవేక్షిస్తున్నారు.  డిసెంబర్ 4 రిలీజ్ డేట్.   [Aafiya Sayed As Rukmini, Aafiya Sayed, Alias Rukmini, Nithiin Nani movie, Tollywood debut, Aafiya Sayed Rukmini, December 4 release, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]    
సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీలు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు నటీనటుల పిల్లలు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కుమార్తె మేధ మేకా హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమాతో మరో వారసుడు కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. శ్రీకాంత్‌ కుమార్తె మేధ మేకా ‘మైత్రి ఇన్ లవ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేధ సినీ ప్రయాణంపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా చేరింది. ఈ చిత్రంతో రామజోగయ్య శాస్త్రి కుమారుడు సాయి హర్ష సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీంతో ఒకే సినిమాతో ఇద్దరు సినీ వారసులు తమ కెరీర్‌ను ప్రారంభించబోతుండటం విశేషం. తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రంతో సాయి హర్ష తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని తెలిపారు. సంగీతంపై అతనికి ఎంతో మక్కువ ఉందని, వినయం, అణకువతో మెలిగే తన కుమారుడికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. ఇన్నాళ్లూ ఎన్నో విజయవంతమైన పాటలతో ప్రేక్షకులను అలరించిన రామజోగయ్య శాస్త్రి.. ఇప్పుడు తన కుమారుడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తుండటంతో ఈ ఎంట్రీపై ఆసక్తి పెరిగింది. ఇది కూడా చదవండి: లోకేష్ కనగరాజ్‌ DC.. మరో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.! https://x.com/ramjowrites/status/2109888940593578031       [Ramajogaiah Sastry Son As Music Director, Ramajogaiah Sastry Son Sai Harsha, Srikanth Daughter Medha Meka, Mythri In Love, Mythri Movie Makers, Medha Meka, Sai Harsha, Telugu Film News]  
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ నటుడిగా మారి నటించిన సినిమా ‘DC’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ డ్రామా ఇప్పటికే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సన్‌ నెక్స్ట్‌ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మరో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. అక్టోబర్‌ 16 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. లోకేష్‌ కనగరాజ్‌, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ‘DC’ను సోనీ లివ్‌ ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకురానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్‌ 16 నుంచి ఈ సినిమాను చూడొచ్చు. ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. దేవదాస్‌ అలియాస్‌ దాస్‌ పాత్రలో లోకేష్‌ కనగరాజ్‌ కనిపించగా.. చంద్ర పాత్రలో వామికా గబ్బి నటించింది. సంజనా కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆయుధాల దోపిడీ కేసులో జైలుకు వెళ్లిన దేవదాస్‌.. అక్కడ సర్కార్‌ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత అతని బృందంతో కలిసి పనిచేయడం మొదలుపెడతాడు. ఓ దోపిడీ కేసులో పోలీసుల వెంటాడటం, ఓ పోలీస్‌ అధికారి హత్య తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడం కథలో కీలక మలుపులు. ఈ క్రమంలో దేవదాస్‌ జీవితంలోకి వచ్చే చంద్ర అతడిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అతని లక్ష్యం ఏమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఇది కూడా చదవండి: రాజాసాబ్ రిజల్ట్‌తో సంబంధం లేదు.. ప్రభాస్‌తో మరో సినిమా ఫిక్స్.! https://x.com/SonyLIV/status/2109612896280072501       [DC Movie OTT Release, DC OTT Release, DC OTT Telugu, DC SonyLIV, Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Arun Matheswaran, Telugu Movies OTT, Telugu Film News]
ఇళయ దళపతి విజయ్ కి తెలుగు నాట కూడా సుదీర్ఘ కాలం నుంచే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఎప్పుడు ప్రత్యేకంగా పర్యటించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ లోని  ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. చెన్నైలోని తన క్యాంపు కార్యాలయం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరిన ఆయన, చెన్నై విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించిన తరువాత, రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గ ఆలయానికి చేరుకుని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు. ఇది కూడా చదవండి: సెన్సార్‌ బోర్డుతో క్రియేటివిటీకి సంకెళ్లు: 35 ఏళ్ళ నాటి పాత చట్టాలు మారేదెప్పుడు!      ఈ సందర్భంగా ఆలయ అధికారులు సకల మర్యాదలతో విజయ్ ని ఆహ్వానించడంతో పాటు .తీర్ధ ప్రసాదాలు అందించారు.  శాలువాతో సత్కరించడంతో పాటు అమ్మవారి చిత్ర పటాన్ని కూడా బహుకరించడం జరిగింది. [Cm Vijay vijayawada Durgamma Temple visit, Tamil Nadu CM Vijay, Vijayawada Visit, Kanaka Durga Temple, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘ది రాజాసాబ్’ ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్‌తో తమ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ సినిమాను 2028లో చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి కలిసి పనిచేయడం ఖాయమైంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంపై తాజాగా మాట్లాడిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. విడుదలకు సరైన సీజన్‌ను ఎంచుకోవడంలో జరిగిన పొరపాటే ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ‘ది రాజాసాబ్’ ఫలితం తమ తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపదని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. 2028లో ప్రభాస్‌తో కచ్చితంగా మరో సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? కథ ఏంటి? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ చిత్రాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2028లో ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.  ఇది కూడా చదవండి: జిమ్ జిమ్ తార.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట‌.. ఫుల్ సాంగ్ వచ్చేసింది.!       [Prabhas People Media Factory Movie, Prabhas TG Vishwa Prasad Movie, Prabhas New Movie, Prabhas Upcoming Movies, The Raja Saab Movie, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Telugu Film News]  
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. చదువును కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సాయం అందించడంతో పాటు, యువతకు విలువైన సూచనలు చేశారు. చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న అగరం ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం నటుడు శివకుమార్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 47వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్లస్ టూ పూర్తి చేసి కళాశాలల్లో చేరిన 25 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. అలాగే ప్రముఖ చిత్రకారుడు జీవానందన్‌కు రూ.లక్ష సాయం చేశారు. పేద, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్న కొన్ని విద్యాసంస్థలతో కలిసి మొత్తం రూ.13.78 లక్షల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం వల్ల మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరని అన్నారు. సినిమాల్లో నటన సరిగా లేకపోతే దర్శకుడు మరోసారి అవకాశం ఇస్తూ రీటేక్ తీసుకుంటారని, కానీ నిజ జీవితంలో అలాంటి రీటేక్‌లు ఉండవని చెప్పారు. అందుకే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువులో వెనుకబడినప్పుడు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని ప్రోత్సహించారు. ఇదిలా ఉంటే.. సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఎన్నో ఏళ్లుగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. 1979లో తన వందో సినిమా ‘రోసాప్పూ రవి కైక్కారి’కి వచ్చిన పారితోషికం రూ.25 వేలును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దాని ద్వారా వచ్చిన వడ్డీని విద్యార్థుల సహాయానికి వినియోగించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 2006 నుంచి అగరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఏటా ఉపకార వేతనాలు, అవార్డులు అందిస్తోంది. మొత్తంగా.. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, చదువు ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వినోదానికి ఉపయోగపడినా, జీవితంలో ఎదగాలంటే విద్య, క్రమశిక్షణ, కృషి ముఖ్యమనే సందేశాన్ని ఆయన అందించారు.     [Suriya, Suriya Charity, Suriya Financial Aid, Suriya Helps Students, Agaram Foundation, Sivakumar Educational Foundation, Suriya Latest News, Tamil Actor Suriya, Student Financial Assistance, Suriya Education Support, Suriya Speech, Kollywood]
ఒక రచయిత, దర్శకుడు తాము అనుకున్న కథ ఎలా అయితే  ప్రేక్షకులకి చే రువుతుందో అని ఎంతో మేధో మధనం చేసి కథనాన్ని సృష్టిస్తారు. ఆ సృషించే ప్రాసెస్ లో సమాజంలో నిత్యం జరిగే కొన్ని జుగుప్సాకర సంఘటనలని కూడా చొప్పించాల్సి వస్తుంది.  అవి మాదక ద్రవ్యాలు కావచ్చు, హత్యలు కావచ్చు ఎలాంటి దారుణమైన సంఘటనలైనా కావచ్చు. అవన్నీ బయట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాతో పాటు పలురకాల మాధ్యమాలలో కూడా చూస్తూనే ఉన్నాం. అందుకే సినిమాలు సమాజానికి అద్దం పట్టాలి. కానీ ఆ అద్దంలో ఏం కనిపించాలో సెన్సార్ బోర్డు నిర్ణయిస్తే ఎలా అని సినీ ప్రియులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం. దాదాపు 35 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, చలనచిత్ర ధృవీకరణ మార్గదర్శకాలను పూర్తిగా సవరించింది. 1991 డిసెంబర్ 6 నాటి పాత నిబంధనలను పక్కన పెట్టి సెప్టెంబర్ 16, 2026 నుంచి సరికొత్త నిబంధనలను అధికారికంగా అమల్లోకి తెచ్చింది. సినిమా రంగంలో సృజనాత్మకతకు, సెన్సార్‌షిప్ నిబంధనలకు మధ్య ఎప్పటికీ ముగియని వివాదానికి ఈ కొత్త నిబంధనలు మరింత జోరునిచ్చాయి. ముఖ్యంగా సినిమాలలో హింస, మాదకద్రవ్యాల వాడకం, సామాజిక విలువులు మరియు మతపరమైన అంశాలపై మరింత కఠినమైన ఆంక్షలు విధించారు. నూతన నిబంధనల ప్రకారం, డ్రగ్స్ వాడకం లేదా అక్రమ రవాణాని నేరుగా ఆకర్షణీయంగా చూపించడాన్ని తీవ్రంగా పరిమితం చేశారు. ఒకవేళ కథలో అది అనివార్యమైతే ఖచ్చితంగా   ముందస్తు హెచ్చరికలు లేదా స్టాట్యూటరీ వార్నింగ్‌లు జతచేయాలని స్పష్టం చేశారు. అలాగే, మహిళలను కించపరిచే దృశ్యాలు, అసభ్యకరమైన అంశాలు మరియు అనుచితమైన హింసను ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సంస్కరణల వెనుక డిజిటల్ యుగానికి తగినట్లుగా సినిమాలను వర్గీకరించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, మరోవైపు ఇది సృజనాత్మక స్వేచ్ఛను అణచివేసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నూతన నిబంధనలలో భాగంగా దేశ సమైక్యతకు భంగం కలిగించేలా, విదేశీ సంబంధాలను దెబ్బతీసేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉండే కంటెంట్‌పై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, కోర్టుల గౌరవాన్ని తగ్గించే అంశాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు లేదా సమాజంలో మూఢనమ్మకాలను రెచ్చగొట్టే విషయాలపై సెన్సార్ బోర్డు ఉక్కుపాదం మోపనుంది. అయితే, ఈ ఆంక్షల పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల భవిష్యత్తులో దర్శకులు, నిర్మాతలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా తెరకెక్కించడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూఏ (UA) కేటగిరీని U/A 7+, U/A 13+, U/A 16+ గా విభజించడం ద్వారా పిల్లలు మరియు యువత చూసే కంటెంట్‌పై వయసుల వారీగా నియంత్రణ తెచ్చినప్పటికీ, కంటెంట్ కటింగ్ విషయంలో మరింత కఠినత కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: విమానం లోపల హాలీవుడ్ నటి వీరంగం: వాళ్లనే ఎందుకు కొరికింది!      మరోవైపు, ఇప్పటికే ఆగస్టు నుండి అమల్లోకి వచ్చిన రూల్ 33 మార్పుల ప్రకారం చిత్రాలకి  సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత రన్‌టైమ్‌లో మార్పులు చేయడం, కటింగ్స్ లేదా అదనపు దృశ్యాలను జోడించడం వంటి సౌలభ్యాలను పూర్తిగా తొలగించారు. ఒకసారి సర్టిఫై అయిన తర్వాత సినిమా నిడివిని తగ్గించాలన్నా లేదా కొత్త సబ్‌టైటిల్స్ జోడించాలన్నా కుదరదని స్పష్టం చేయడంతో చిత్ర యూనిట్‌లకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడు దశాబ్దాలుగా మారుతున్న కాలానికి తగినట్లుగా చిత్ర పరిశ్రమ ఎదుగుతున్న తరుణంలో, ఈ నిబంధనలు ఎంతవరకు దోహదపడతాయి. లేక సృజనాత్మకతకు అడ్డుకట్ట వేస్తాయి అనేది కాలమే నిర్ణయించాలి. సామాజిక బాధ్యత పేరుతో కళాకారుల భావప్రకటన స్వేచ్ఛను హరించకుండా, ప్రజాస్వామ్య విలువలకు మరియు సృజనాత్మక స్వేచ్ఛకు మధ్య సరైన సమతుల్యత సాధించడమే ప్రస్తుత తరుణంలో అసలైన సవాల్‌గా మారింది.   [Cbfc New Certification Rules India, CBFC new rules, film certification India, censorship vs creativity, Cinematograph Act, 35 year old rules, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
‘జిమ్ జిమ్ తార’ సాంగ్ ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జి.ల‌క్ష్మిదేవి పాడిన ఈ పాట కొద్దిరోజులుగా అన్ని చోట్లా మారుమోగిపోతోంది.  నిజానికి ‘జిమ్ జిమ్ తార’ను ‘పర్ణశాల’ మూవీ కోసం జి.ల‌క్ష్మిదేవి రాసి పాడటం విశేషం. అయితే అఫీషియల్ గా రిలీజ్ కాకముందే.. ఆమె పాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అది ఓ రేంజ్ లో వైరల్ అయిపోవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో అది తమ సినిమాలోని పాటే అని ప్రకటించి ‘పర్ణశాల’ మూవీ టీం సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చింది. ఒకే ఒక్క పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అధికారికంగా పూర్తి పాట విడుద‌ల త‌ర్వాత సినిమాపై మ‌రింతా హైప్ పెరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ, “మా ప‌ర్ణ‌శాల సినిమా కోసం జి.ల‌క్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌స్తోంది.” అని తెలిపారు. పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే.. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్‌, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఉపయోగించడం విశేషం. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ తర్వాత ఇంకా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూడాలి ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది కూడా చదవండి: ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి.!       [Jim Jim Tara Full Song, Jim Jim Tara Lyrical Video, Jim Jim Tara Song, Parnashala Movie Song, Telugu Songs 2026, Telugu Film News]
సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించాలంటే స్టార్‌ హీరోలు, కోట్ల రూపాయల బడ్జెట్‌, భారీ ప్రమోషన్లు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి నిరూపిస్తోంది కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరలి’. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. సుమారు రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.70 కోట్ల వసూళ్లకు చేరువ కావడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో రోజురోజుకూ తన వసూళ్లను పెంచుకుంటోంది. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమద ఊరలి’లో శ్రీరామ్‌, రంగాయణ రఘు, తపస్విని పూనాచ్చా, రమిక శివు ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా దీన్ని రూపొందించారు. ప్రేమ, కుటుంబ సంబంధాలు, తరాల మధ్య ఆలోచనల తేడాలు వంటి అంశాలను కథలో చూపించారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య బంధం, సంప్రదాయ కుటుంబంలోకి వచ్చిన యువతి ఎదుర్కొనే పరిస్థితులు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. వాస్తవానికి ఈ సినిమా మొదటి రోజు పెద్దగా వసూళ్లు సాధించలేదు. ప్రారంభంలో పరిమిత సంఖ్యలోనే షోలు ప్రదర్శించారు. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో క్రమంగా థియేటర్ల సంఖ్య పెరిగింది. ప్రేక్షకుల నోటి మాటతోనే సినిమాపై ఆసక్తి పెరిగి, రెండో వారంలోనూ మంచి వసూళ్లు నమోదయ్యాయి. మూడో వారంలో కూడా సినిమా బలమైన వసూళ్లు సాధించడం విశేషం. భారీ ప్రచారం కంటే కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవని ఈ సినిమా విజయ ప్రయాణం చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర దర్శకుడు మనోజ్‌ కుమార్‌ గతంలో ‘అక్షి’ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నారు. అయినప్పటికీ తదుపరి సినిమా చేయడానికి ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. చివరకు నిర్మాత దేవేంద్ర సహకారంతో ‘ప్రేమద ఊరలి’ రూపొందింది. ప్రమోషన్లకు పెద్దగా డబ్బు లేకపోవడంతో సాధారణ పద్ధతులకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్లి సినిమాను పరిచయం చేశారు. ఆ ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ తోడవడంతో సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా.. పెద్ద హీరోలు లేకపోయినా, చిన్న బడ్జెట్‌ సినిమాలు కూడా బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోగలవని ‘ప్రేమద ఊరలి’ మరోసారి చాటిచెబుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసూళ్ల లెక్కలు ట్రేడ్‌ అంచనాల ఆధారంగా మారుతున్నప్పటికీ, ఈ చిత్రం సాధించిన విజయం మాత్రం కన్నడ చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.     [Premada Ooralli, Premada Ooralli Box Office, Premada Ooralli Collection, Kannada Movie Box Office, Premada Ooralli Budget, Shree Raam, Rangayana Raghu, Manoj Kumar Director, Kannada Cinema News, Small Budget Movie Hit, Premada Ooralli 70 Crore, Sandalwood Box Office]
ఇంట్లో కుటుంబ సభ్యులు మన ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చడం లేదా ప్రతిదానికీ అతిగా సలహాలు ఇవ్వడం వల్ల ఎంతోమంది మానసిక ప్రశాంతతని కోల్పోతుంటారు. ప్రేమతో చెప్పే విషయాలైనా కొన్నిసార్లు అది  వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డుగా మారుతుంది. అయితే ఈ సమస్యను గొడవలు పడకుండా, పెద్దల మనసు నొచ్చకుండా  పరిష్కరించుకోవాలి . అందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే... గోప్యత.. మన జీవితంలో కొన్ని విషయాలు పూర్తిగా మన వ్యక్తిగతమైనవి. ఉద్యోగం, ఆర్థిక విషయాలు, జీవన శైలి లేదా మన రోజువారీ నిర్ణయాలు అన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలని లేదు. అవసరం లేని విషయాలను ఇంట్లో వాళ్ళతో ప్రస్తావించకుండా ఉండటమే చాలాసార్లు గొడవలకు దూరంగా ఉండేలా చేస్తుంది. మీ వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించడం నేర్చుకుంటే చాలా వరకు అనవసర జోక్యం తగ్గుతుంది. అర్థమయ్యేలా చెప్పడం.. ఒకవేళ కుటుంబ సభ్యులు ఏదైనా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుంటే, వారికి మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా, ప్రేమగా తెలియజేయాలి. మీ నిర్ణయాలను మీరే స్వయంగా తీసుకునే వయసులో ఉన్నామని, ఒకవేళ తప్పు జరిగితే దాని నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వమని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.  కోపంతో అరుచుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది కానీ పరిష్కారం దొరకదు. మంచి చెబితే వినాలి.. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు మన మేలు కోరి మాత్రమే సలహాలు ఇస్తుంటారు. అలాంటప్పుడు వారి ఉద్దేశం మంచిదేనని గుర్తించి వాళ్ళని పూర్తిగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారి సలహాలను విన్నట్లుగా నటించి, ఆ తర్వాత మీ మనసుకు ఏది సరైనదనిపిస్తే అదే చేయడం మంచిది. దీనివల్ల వారిపై మీకు గౌరవం ఉన్నట్లుంటుంది,  అదే సమయంలో మీ నిర్ణయం మీదే నిలబడవచ్చు.  లిమిట్స్.. మన జీవితంలో కొన్ని హద్దులను మనమే స్పష్టంగా గీయాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మన విషయాలను పంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. మీ వ్యక్తిగత స్థలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ ప్రశాంతంగా మాట్లాడుతూ, మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేస్తే కాలక్రమేణా వారు కూడా మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు.                                                                                                                             *రూపశ్రీ.
ఆంధ్రా మరియు తెలంగాణ ఇళ్లలో కూరలు తినబుద్ధి కాకపోయినా, రొటీన్ వంటలతో విసుగొచ్చినా మనందరికీ ముందుగా గుర్తొచ్చే సాంప్రదాయ వంటకం అద్భుతమైన కంది పచ్చడి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా హడావిడిగా రుచికరమైన భోజనం చేయాలనుకున్నప్పుడు ఈ పచ్చడి అమృతంలా ఆదుకుంటుంది. కేవలం 10 నిమిషాల్లో ఎంతో సులభంగా సిద్ధమయ్యే ఈ కంది పచ్చడి తయారీ విధానం మరియు దీనికి కావలసిన కొలతలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ అచ్చమైన ఆంధ్రా స్టైల్ పచ్చడి తయారీ కోసం ప్రధానంగా పావు కప్పు కందిపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, కారానికి సరిపడా 15 నుండి 20 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వీటితో పాటు పావు కప్పు కరివేపాకు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజులో వేడి నీళ్లలో నానబెట్టుకున్న చింతపండు, 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి. తాలింపు కోసం 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ ఇంగువ, పావు టీస్పూన్ పసుపు సిద్ధం చేసుకోవాలి.    మొదటగా స్టవ్‌పై పాన్ పెట్టి పావు కప్పు కందిపప్పు వేసి సన్నటి సెగపై దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టీస్పూన్ మినపప్పు వేసి కాస్త వేయించిన తరువాత, 15 నుండి 20 ఎండుమిరపకాయలను జత చేయాలి. ఆపై పావు కప్పు కరివేపాకు వేసి అది క్రిస్పీగా మారేంత వరకు వేయించి, చివరగా 1 టీస్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండును దాని నీళ్లతో సహా, పొట్టు తీసిన 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, కాచి చల్లార్చిన నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ రోటి పచ్చడి లాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పరిపూర్ణమైన రుచినిచ్చే తాలింపు సిద్ధం చేసుకోవాలి. దీనికోసం చిన్న కడాయిలో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, 1 టీస్పూన్ ఆవాలు, కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న కంది పచ్చడిలో వేసి బాగా కలపాలి. కాచి చల్లార్చిన నీటిని వాడటం వల్ల ఈ పచ్చడి ఫ్రిజ్‌లో దాదాపు 10 రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది. పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ కంది పచ్చడిని వేసుకొని, చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఆ రుచి స్వర్గానికి బెత్తెడే దూరంలో ఉన్నంత ఆనందాన్ని ఇస్తుంది. పక్కన నంజుకోవడానికి ఉల్లిపాయ లేదా అప్పడం ఉంటే భోజనం మరింత అద్భుతంగా సాగిపోతుంది.     Andhra style Kandi Pachadi, Toor Dal Chutney recipe, 10 minute chutney recipe, authentic Andhra recipes, Kandi Pachadi for rice, traditional Telugu pachadi, quick dal chutney.  
ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలిలో చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు పనులు, ఇంటి బాధ్యతలతో బిజీగా గడుపుతుంటారు. ఈ హడావుడిలో చాలామంది రాత్రి భోజనం చేసే సమయాన్ని అసలు పట్టించుకోరు. కొందరు చాలా ఆలస్యంగా రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత భోజనం చేస్తుంటే, మరికొందరు తిన్న వెంటనే నేరుగా మంచంపై పడుకుంటున్నారు. అయితే ఇలాంటి చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయం మన జీర్ణక్రియపై, నిద్ర నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఏ సమయంలో తింటున్నాం, పడుకునే ముందు ఎంత విరామం ఇస్తున్నాం అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. సాధారణంగా రాత్రి భోజనానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం 2 నుంచి 3 గంటల విరామం కచ్చితంగా ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఉదాహరణకు, మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోవాలనుకుంటే, సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్యే మీ భోజనాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మనం భోజనం చేసిన వెంటనే పడుకున్నప్పుడు, జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించే ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, ఎసిడిటీ, పుల్లటి త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి తీవ్రమైన అసౌకర్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా, రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం వల్ల శరీర సహజ సిద్ధమైన జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) సమతుల్యత దెబ్బతింటుంది. రాత్రి వేళల్లో రక్తపోటు (బీపీ) సహజంగా తగ్గాలి, దీనిని నైట్  టైమ్ డిప్పింగ్ అంటారు. కానీ లేట్ నైట్ డిన్నర్ లేదా ఆలస్యంగా తినడం వల్ల రాత్రివేళల్లో కూడా బీపీ తగ్గకుండా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇన్సులిన్ పనితీరు మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, రాత్రి 10 గంటలకు భోజనం చేయడం వల్ల సాయంత్రం 6 గంటలకు తినడంతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 18 శాతం ఎక్కువగా పెరుగుతాయి మరియు రాత్రి సమయంలో కొవ్వు కరిగే ప్రక్రియ సుమారు 10 శాతం వరకు తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం మరియు బరువు పెరగడానికి దారితీస్తుంది. రాత్రి పూట మనం ఏం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. రాత్రివేళల్లో అధికంగా కారం, మసాలాలు ఉన్న వంటకాలు, బాగా నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్ణం ముప్పు పెరుగుతుంది. అలాగే కాఫీ, టీ, డార్క్ చాక్లెట్లలో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర పట్టడం ఆలస్యం కావచ్చు. భోజనం తర్వాత అధికంగా స్వీట్లు లేదా ఐస్‌క్రీమ్‌లు తీసుకోవడం ద్వారా శరీరంలోకి అదనపు కేలరీలు, చక్కెర చేరుతాయి. కాబట్టి రాత్రి భోజనం ఎప్పుడూ సమతుల్యంగా, తేలికపాటి ఆహారంతో ఉండాలి. అన్నం లేదా రొట్టెలతో పాటు కూరగాయలు, పప్పులు, కిచిడీ, గంజి, లేదా వెజిటబుల్ సూప్ వంటి తేలికగా అరిగే పదార్థాలను ఎంచుకోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామాలు లేదా వేగంగా నడవడం చేయకూడదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా నడవడం లేదా ఆకలికి తగినట్లుగా మితంగా తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.     best dinner time for diabetes, dinner timing for blood pressure, early dinner benefits, blood sugar control rules, ideal meal times for health, managing hypertension naturally, dinner habits for health.
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.
మన కాళ్లకు సరైన రక్తప్రసరణ అందకపోతే నడవడం దగ్గర నుంచి రోజువారీ పనులు చేసుకోవడం వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి కొద్దిదూరం నడవగానే పిక్కల్లో నొప్పి రావడం, పాదాల్లో తీవ్రమైన నొప్పి, కాళ్ల వాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒకే కారణంతో వస్తాయని భావించకూడదు. వీటి వెనుక రక్తనాళాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఉండవచ్చు. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గవచ్చు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వచ్చి, విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోవడం కాళ్ల ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడానికి సంకేతం కావచ్చు. అలాగే పాదాలు చల్లబడటం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరోవైపు, కాళ్లలోని సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేయడంలో సమస్య ఎదురైతే వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాళ్లలో వాపు, బరువుగా అనిపించడం, చర్మంపై ఉబ్బిన సిరలు కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడం, సిరల్లో రక్తం తిరిగి ప్రవహించడంలో సమస్యలు రెండూ వేర్వేరు పరిస్థితులు. ఈ వీడియోలో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారు కాళ్లకు రక్తప్రసరణ తగ్గడానికి గల కారణాలు, కాళ్ల రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు కనిపించే లక్షణాలు, వెరికోస్ వెయిన్స్ సమస్య గురించి వివరించారు. అలాగే రక్తప్రసరణను పరీక్షించడానికి ఉపయోగించే డాప్లర్ టెస్ట్ (Doppler Test) గురించి, సమస్య తీవ్రతను బట్టి అందుబాటులో ఉండే చికిత్సా విధానాల గురించి తెలియజేశారు. రక్తనాళాల్లో బ్లాకేజీలను తొలగించడానికి లేదా రక్తప్రవాహాన్ని మెరుగుపరచడానికి కొన్ని సందర్భాల్లో బెలూన్ యాంజియోప్లాస్టీ (Balloon Angioplasty), స్టెంట్ చికిత్స (Stent Treatment) అవసరమవుతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ చికిత్సలు అవసరం ఉండవు. సమస్య ఎక్కడ ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కాళ్ల నొప్పులను వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారా? నడిచేటప్పుడు పిక్కల్లో నొప్పి రావడానికి రక్తప్రసరణ తగ్గడం కూడా కారణమవుతుందా? డాప్లర్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? రక్తనాళాల్లో బ్లాకేజీ ఉంటే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారి పూర్తి వీడియోను చూడండి. ముఖ్య గమనిక: కాళ్లలో నిరంతర నొప్పి, పాదాల రంగు మారడం లేదా మానని గాయాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. అకస్మాత్తుగా తీవ్రమైన కాలి నొప్పి, పాదం చల్లబడటం, పాలిపోయినట్లు లేదా నీలంగా మారడం, తిమ్మిరి లేదా బలహీనత కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. వైద్య పరీక్షలు, చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
శరీరంలో నీరసం, అలసట, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు కనిపిస్తున్నాయా? వీటికి విటమిన్ B12 లోపం కూడా ఒక కారణం కావచ్చు. అయితే, ఇలాంటి లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. అసలు విటమిన్ B12 మన శరీరానికి ఎందుకు అవసరం? దాని లోపాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ డాక్టర్ స్వాతి విటమిన్ B12 ప్రాముఖ్యత, దాని లోపం వల్ల కనిపించే లక్షణాలు, నరాల ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి వివరిస్తున్నారు. అలాగే, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి, విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. మరోవైపు, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం వల్ల కొందరిలో కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ వంటి సమస్యలు రావచ్చు. మనం తీసుకునే ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మాంసాహారం ఎక్కువగా తినేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఈ అంశాలపై డాక్టర్ స్వాతి అందించే పోషకాహార సూచనలను తెలుసుకోండి. విటమిన్ B12 లోపం, యూరిక్ యాసిడ్ సమస్యలు రెండింటినీ ఒకే సమస్యగా భావించకుండా, వాటి కారణాలు, లక్షణాలు, ఆహార అవసరాలను విడివిడిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోండి: విటమిన్ B12 లోపం వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాలు నరాల ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి విటమిన్ B12 ఎందుకు అవసరం? విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు యూరిక్ యాసిడ్ పెరగడానికి దోహదపడే ఆహారపు అలవాట్లు గౌట్, కీళ్ల నొప్పులు, వాపుల విషయంలో ఆహారం పాత్ర యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఉపయోగపడే ఆహార మార్పులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పోషక లోపాలను నివారించుకోవడం ఎలా? గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. విటమిన్ సప్లిమెంట్లు లేదా యూరిక్ యాసిడ్ మందులను నిపుణులైన వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)