కడప జగన్ చేజారిపోయిందా?
కడప జగన్ చేజారిపోయిందా?

వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన కడప ఇప్పుడు ఆయన చేజారిపోయిందా? అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో.. కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. అందుకు.. జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు. అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు. నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు. గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు. మరోవైపు కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్రమంగా విస్తరిస్తుండగా, కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది. ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.

Publish Date: Jul 3, 2026 12:18PM
 రాజకీయ దుమారం రేపుతున్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ విజువల్స్.!
రాజకీయ దుమారం రేపుతున్న కల్వకుంట్ల కవిత అరెస్ట్ విజువల్స్.!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు. కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక మహిళా నేత పట్ల ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు

Publish Date: Jul 3, 2026 11:50AM
స్ట్రాటజిస్టుల మాయలో..ఏపీ పాలిటిక్స్..!
స్ట్రాటజిస్టుల మాయలో..ఏపీ పాలిటిక్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది. ఇటీవల ప్రసిద్ధ మీడియా ఛానల్ 'టాన్ న్యూస్' లో ప్రసారమైన 'వాస్తవ వేదిక'లో, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మధ్య జరిగిన చర్చ ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తల ప్రభావం మరియు సోషల్ మీడియా ఎత్తుగడలపై ఒక లోతైన విశ్లేషణను అందించింది. ఈ విశ్లేషణాత్మక కథనంలో ఏపీ రాజకీయాల ప్రస్తుత స్థితి, వ్యూహాలు, రాబోయే రోజుల్లో వాటి ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి: సానుభూతి వర్సెస్ ప్రజాకర్షక ప్రచారాలు..! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల పబ్లిక్ రిలేషన్స్ వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రులు లేదా ప్రతిపక్ష నేతలు సామాన్య ప్రజలను కలవడం, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో మత్స్యకారులతో కలిసి భోజనం చేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు కేవలం ఎన్నికల స్ట్రాటజీలలో భాగమేనని, క్షేత్రస్థాయిలో నాయకులు నిజంగా ప్రజలతో మమేకం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న ప్రజా సానుభూతి ఆయనకు ప్రధాన అర్హతగా బలంగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాతి కాలంలో ఆ సానుభూతిని సమర్థవంతంగా వాడుకున్నప్పటికీ, కేవలం సానుభూతి కార్డు మాత్రమే ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేయలేదని 2014 ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. కేవలం సెంటిమెంట్లపై కాకుండా క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహాలు మరియు వాటి అంతరార్థం..! ఆధునిక ఏపీ రాజకీయాలను శాసిస్తున్న మరో కీలక అంశం 'పొలిటికల్ స్ట్రాటజిస్టులు' (రాజకీయ వ్యూహకర్తలు) మరియు డేటా మేనేజ్‌మెంట్. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు సమాజంలో కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించే సంక్షేమ పథకాలను ప్రోత్సహిస్తూ, రాజకీయాలను మరింత వ్యాపారమయం చేశారనే తీవ్ర విమర్శలను ఈ ఇంటర్వ్యూలో లేవనెత్తారు. పెన్షన్ల పెంపుదల, అమ్మఒడి పథకం వంటి తాత్కాలిక లబ్ధి చేకూర్చే పథకాలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, ఇవి రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యూహకర్తలు ప్రతి గ్రామంలోని కుల సమీకరణాలు, స్థానిక ఓటర్ల మనోభావాల డేటాను సేకరించి, దానికి అనుగుణంగా ఓటర్లను ప్రభావితం చేసే 'నెరేటివ్స్' (కృత్రిమ కథనాలు) సృష్టిస్తున్నారు. ఉదాహరణకు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వచ్చిన డైమండ్' వంటి ఆరోపణలు కేవలం ఒక రాజకీయ ప్రచారంలో భాగమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఈ చర్చలో విశ్లేషించారు. 'మై టిడిపి' యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్ సిస్టమ్స్ పెట్టడం, కృత్రిమ డేటాతో సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం వంటి సరికొత్త పద్ధతుల ద్వారా సాంప్రదాయ ఎన్నికల విధానాన్ని మార్చేస్తున్నారు. ఓటర్ల విశ్వాసాన్ని నేరుగా గెలుచుకోలేమనే భావనతోనే ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం..! ఈ విధమైన డేటా ఆధారిత సోషల్ మీడియా వ్యూహాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చనున్నాయి. అయితే, ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న రాజకీయ అవగాహన కారణంగా ఈ తాత్కాలిక వ్యూహాల మాయాజాలం ఎక్కువ కాలం సాగకపోవచ్చు. గతంలో ఎన్నికలకు సంబంధించి లోకేష్ చంద్రబాబులకు ముందే అంచనాలు అందించినట్లు, టిడిపికి అత్యధిక స్థానాలు వస్తాయని విశ్లేషకులు ముందే ఊహించిన తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజల నిజమైన తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. భవిష్యత్తులో కేవలం కృత్రిమ నెరేటివ్‌లు, సానుభూతి కార్డులు లేదా ఉచిత పథకాల హామీలతో ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం కానుంది. వ్యూహకర్తల కృత్రిమ రేటింగులు అంచనాలను పక్కనబెట్టి, ప్రజలు నిజమైన నాయకత్వాన్ని, స్థిరమైన అభివృద్ధిని ఆశించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిజమైన ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన మాత్రమే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తులో శాశ్వత మనుగడను అందిస్తాయి. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

Publish Date: Jul 2, 2026 9:35PM
బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్
బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారు లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. "మేము కొత్త డిమాండ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరాం. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులు హామీలు అమలు చేయాలని అడిగినందుకే లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి రోజూ ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.

Publish Date: Jul 2, 2026 3:21PM
హరీష్ రావు అరెస్టు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
హరీష్ రావు అరెస్టు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నడిచిన సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్ కు బయల్దేరిన హరీశ్‌రావును తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు. ఆ సవాల్ స్వీకరించిన హరీష్ రావు గన్ పార్క్ కు వెడుతుండగా అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు గాను ప్రస్తుత ప్రభుత్వం రూ. 1.40 లక్షల కోట్ల వడ్డీ కడుతోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్ తీవ్ర దుమారం రేపింది. ఈ ఆర్థికాంశాలపై, గురుకులాల వ్యవహారంపై కాంగ్రెస్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు సై అన్నారు. హరీష్ రావు గన్ పార్క్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ భవన్ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.తనను అడ్డుకున్న పోలీసులపై హరీష్ ఫైర్ అయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. ఈతోపులాటలో హరీష్ రావు కిందపడ్డారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.

Publish Date: Jul 2, 2026 2:26PM
జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?
జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. రోజు రోజుకూ ఓ ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే.. ట్రోలింగ్ కు, మీమ్స్ కు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని నెటిజనులు సంబరపడిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రెస్ మీట్ లలో చేసే ప్రసంగాలు ఉంటున్నాయి. జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ వివాదాస్పదమైన, వినూత్నమైన ప్రకటనలు ట్రోలర్లకు, నెటిజనులకు కావలసినంత స్టఫ్ అందిస్తున్నాయి. తాజాగా బుధవారం (జూన్ 1) జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో అమరావతి వర్సెస్ 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే జగన్ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హేళనలకూ గురై ఒక హాస్యాస్పద అంశంగా మారిపోయింది. అదలా ఉండగానే.. తన తాజా ప్రెస్ మీట్ లో జగన్ ఏకంగా మావిగన్ ను వచ్చే ఎన్నికల అజెండాగా ప్రకటించడం నెటిజనులకు పండుగలా మారింది. ఇక దీనిపై మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం దాటవేసిన తీరు కూడా ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు కారణమైంది. సాధారణంగా ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే జగన్, ఈసారి మాత్రం ఎన్నికల అజెండాగా మావిగన్ అంటూ చేసిన ఆయన ప్రకటనపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా జగన్ పారిపోయారు అంటూ నెటిజనులు ట్రోల్ చేయడానికి కారణమైంది. మావిగన్ ఎన్నికల అజెండా అయితే విశాఖ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు జగన్ నిరుత్తరుడై, కనీసం ఆ ప్రశ్న సంధించిన విలేకరి వైపైనా చూడకుండా.. హడావుడిగా ప్రెస్ మీట్ ను ముగించేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ జారుకున్నారనీ, ప్రశ్నలు వినిపించలేదన్నట్లు యాక్ట్ చేయడంలో జగన్ కమల్ హసన్ ను మించిపోయారనీ నెటిజన్లు వీర లెవెల్లో ఎగతాళి చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. ఆ ఐదేళ్లూ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అత్యంత ఆదర్శవంతమైన ఫార్ములా మూడు రాజధానులేననీ, అదే తాను చేస్తున్నాననీ చెప్పుకున్నారు. అయితే మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ 2024 ఎన్నికలలో మూకుమ్మడిగా తిరస్కరించి, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ తాజాగా విశాఖను, మూడు రాజధానులనూ వదిలేసి మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తాజా ప్రెస్ మీట్ లో వైజాగ్ రాజధాని గురించి అడిగిన ప్రశ్న వినగానే.. ఏం చేస్తున్నాడో తెలియనట్లు రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Publish Date: Jul 2, 2026 12:54PM
ముడుపులు, కమీషన్లు లేని పారదర్శక టెండర్ విధానం.. తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం
ముడుపులు, కమీషన్లు లేని పారదర్శక టెండర్ విధానం.. తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా రాష్ట్రంలో పబ్లిక్ ఫండింగ్, ప్రజా పనుల కేటాయింపుల్లో దశాబ్దాలుగా నడుస్తున్న పాత పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ విజయ్ ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పరెంట్ టెండర్ సిస్టమ్ ఇప్పుడు పాత తరం కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల భారీగా ప్రజా ధనం ఆదా అవుతుండటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన వారాల వ్యవధిలోనే.. సివిల్ పనులపై ప్రభుత్వం అంచనా వేసిన వ్యయం కంటే అత్యంత తక్కువ ధరకు కాంట్రాక్టర్లు పనులను దక్కించుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న ఓపెన్ కాంపిటీషన్‌లో అనేక మంది కాంట్రాక్టర్లు పనులను దక్కించుకోవడమే లక్ష్యంగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ రేట్లను కోట్ చేస్తున్నారు. పలు ప్రభుత్వ ప్రాజెక్టులలో అధికారిక అంచనాల కంటే ఏకంగా 25 శాతం నుండి 30 శాతం వరకు తక్కువ ధరలకే టెండర్లు దాఖలవుతున్నాయి. ఈ స్థాయిలో నిధులు మిగలడం చూసి సాధారణ ప్రజలతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం చెందుతున్నారు. ఈ సరికొత్త పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. ప్రస్తుతం 25-30 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయడం సాధ్యమైనప్పుడు, గత ప్రభుత్వాల హయాంలో అదనంగా ఖర్చయిన ఆ కోట్లాది రూపాయల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత పాలకుల అవినీతి, కమీషన్ల సంస్కృతిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి విజయ్ కి ఇది రాజకీయ ఆయుధంగా మారింది. గతంలో కాంట్రాక్టర్లు టెండర్ల ధరలను ఖరారు చేసేటప్పుడు అనధికారిక ఖర్చులు, కమీషన్లను కూడా లెక్కలోకి తీసుకుని ప్రభుత్వానికి భారీగా బిల్లులు వేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సరికొత్త పారదర్శక విధానం వల్ల తాము ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయగలుగుతున్నామని కొందరు చిన్న తరహా కాంట్రాక్టర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఏదేమైనా.. ఇంత తక్కువ బడ్జెట్‌తో పనులు చేపడుతున్నప్పుడు వాటి నాణ్యత దెబ్బతినకుండా చూడటమే సీఎం విజయ్ ముందున్న అసలైన సవాలు. కాంట్రాక్టర్లు పోటీ పడి రేట్లు తగ్గించినప్పటికీ, పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సరికొత్త టెండర్ ఫార్ములా' విజయ్ ప్రభుత్వానికి ప్రజలలో మైలేజ్ తెచ్చి పెట్టింది. ప్రజాధనాన్ని కాపాడుతూ, పాత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతున్నారంటూ విజయ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Publish Date: Jul 2, 2026 12:28PM
వాహ్.. క్యా సీన్ హై!
వాహ్.. క్యా సీన్ హై!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉంటాయి. మరీ ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం నేతలు ఒకరిపై ఒకరు ఉప్పు నిప్పులా విమర్శలతో విరుచుకు పడుతుంటారు. అయితే గతంలో అంటే వైఎస్, చంద్రబాబులల హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు.. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా ఉండేవి. అయితే తరువాత రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వాలు పెరిగిపోయాయి. ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. మామూలుగా ఎవరైనా వారిద్దరూ ఎదురుపడితే.. ఎడముఖం, పెడముఖంగా ఉంటారని భావిస్తారు. కానీ రఘురామకష్ణం రాజు, అంబటి రాంబాబులు పరస్పరం పలకరించుకున్న తీరు వాహ్ క్యాసీన్ హై అన్నట్లుగా ఉంది. వివరాల్లోకి వెడితే.. వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెలుగుదేశం సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇరువురూ హైదరాబాద్‌లో నిన్న జరిగిన ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఒకరికొకరు ఎదురు పడ్డారు. రాజకీయంగా ఒకరైపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకునే ఈ ఇరువురూ.. ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంగా పరిస్థితి ఎలా మారుతుందా అని అక్కడున్న వారంతా ఒక్క క్షణం కంగారు పడ్డారు. అయితే అంబటి రాంబాబు, రఘురామ కృష్ణంరాజు ముఖాముఖి ఎదురైన వెంటనే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు అంబటితో ఏదో అన్నారు. ఆ మాటకు అంబటి పగలబడి నవ్వుతూ రఘురామకృష్ణం రాజును హత్తుకున్నారు. రాజకీయాల్లో ఎంతగా విభేదాలు ఉన్నా.. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఆ వైరుద్ధాలు ఉండకూడదని వీరిరువురూ తమ తీరుతో చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

Publish Date: Jul 2, 2026 12:01PM
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్!.. పూటకోమాట.. రోజుకో తీరు.. సలహాలెవరివి జగన్?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్!.. పూటకోమాట.. రోజుకో తీరు.. సలహాలెవరివి జగన్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై వైసీపీ అధినేత తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైంది. తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు పార్టీ అజెండాను ప్రకటించేశారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్టీ విధానాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, తాను సీఎం అయితే.. మావిగన్ రాజధాని అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తన నినాదమనీ, అదే తమ పార్టీ అజెండా అనీ చెప్పారు. అయితే రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. గతంలో 2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. తీరా ఇప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కనబెట్టి అకస్మాత్తుగా సరికొత్తగా 'మవిగున్' అంశాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసింది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఈ మూడు రాజధానుల ఆలోచనను నిద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతటి వైఫల్యం తర్వాత కూడా జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపడం వెనుక ఉన్న వ్యూహం ఎవరిదనే చర్చ నడుస్తోంది. ఎలాంటి ప్రజాదరణ లేదా సెంటిమెంట్ లేని సరికొత్త ప్రతిపాదనను ఎన్నికల అజెండాగా మార్చడం రాజకీయంగా వైసీపీకి, జగన్ కు ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా నిండా ముంచేసే సలహాలు జగన్ కు ఇస్తున్నదెవరా అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాకుండా వైసీపీలో కూడా విస్తృతంగా జరుగుతున్నది. మావిగన్ రాజధాని అజెండాను ప్రకటించడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు మూడేళ్ల ముందే ఓటమికి రెడీ అయిపోయారని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. అధికార పక్షమైన తెలుగుదేశం కూటమి తొలి నుంచీ అమరావతి ఏకైక రాజధాని అనే స్పష్టమైన, స్థిరమైన స్టాండ్ తో వెడుతుండగా, జగన్ మాత్రం జగన్ మాత్రం ప్రతి ఎన్నికలకూ రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మాట మార్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇప్పుడు మూడు రాజధానులను మూటగట్టి పక్కన పడేసి మావిగన్ అంటూ కొత్త రాగం ఆలపించడం ద్వారా తనకు ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేదని చాటుకుని ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారని అంటున్నారు. ఈ తరహా వ్యూహాలు జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ఆయన నాయకత్వ పటిమపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటున్నారు.

Publish Date: Jul 2, 2026 11:42AM
కూటమి ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు  కొత్త తలనొప్పిగా మారారా?
కూటమి ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు కొత్త తలనొప్పిగా మారారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నేతగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) వైఖరి అధికార పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సొంత పార్టీపైనే ఏ విధంగా ప్రెస్ మీట్ల ద్వారా దాడి చేశారో, ఇప్పుడు కూడా దాదాపు అదే తరహా ధోరణిని అవలంబిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏలూరులో జరిగిన 'దళిత క్రైస్తవ శంఖారావం' సభలో జడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా రఘురామకృష్ణరాజు స్పందించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతర్గత అసంతృప్తి ఈ మొత్తం వ్యవహారం వెనుక రఘురామకృష్ణరాజు ఒక స్పష్టమైన పొలిటికల్ లైన్ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తన పాత్రను ప్రస్తుత ప్రభుత్వం తక్కువ చేసి చూసిందనే భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గానీ, పార్టీ అంతర్గత వేదికలపై గానీ మాట్లాడకుండా పబ్లిక్ గా ప్రెస్ మీట్లు పెడుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన వ్యూహం ఏంటంటే, రఘురామకృష్ణరాజు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గానీ, లోకేష్ ను గానీ ఎక్కడా చిన్న మాట కూడా అనడం లేదు. కేవలం జడా శ్రవణ్ కుమార్ ను టార్గెట్ చేస్తూనే, కూటమిలోని మరో కీలక భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి అయినప్పుడే తాను ఫిర్యాదు చేస్తానని అనడం, వారం రోజుల్లో రాజకీయాల్లో మార్పులు వస్తాయని వ్యాఖ్యానించడం ద్వారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. తద్వారా ఆయన బీజేపీ మరియు జనసేన వైపు రాజకీయంగా అడుగులు వేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిణామాలు మరియు ప్రభుత్వానికి ఇబ్బందులు రఘురామకృష్ణరాజు అవలంబిస్తున్న ఈ వెటకారపు ధోరణి, దూకుడు వైఖరి వల్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన చైర్ లో కూర్చుని సీనియర్ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీలోనే అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైంది. అత్యున్నతమైన స్థానంలో ఉంటూ, ప్రభుత్వం సజావుగా సాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూటమిలో అంతర్గత సంక్షోభం ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజీనామా చేయకుండా, పార్టీ తనను గెంటేసే వరకు అక్కడే ఉండి పొగబెట్టే వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తే, అది కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలపై గట్టి ప్రభావమే చూపేలా ఉన్నాయి. గతంలో 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు ఆయన తిరుగుబాటు చేసి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో కూడా చంద్రబాబుకు అలాంటి శాపమే ఎదురవుతుందా అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే కేసీఆర్ నాటి పరిస్థితులు వేరు, ఇవాల్టి రఘురామకృష్ణరాజు పరిస్థితులు వేరనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ, రఘురామకృష్ణరాజును అలాగే వదిలేస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఒకవేళ లోకేష్ లాంటి యువ నాయకత్వం అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుని ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పూనుకుంటే, ఆయన పూర్తిగా బీజేపీ లేదా జనసేన నీడలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ "డిప్యూటీ స్పీకర్" సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపైనే కూటమి ప్రభుత్వ అంతర్గత స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

Publish Date: Jul 1, 2026 4:58PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds