ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!
ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధమైన ఆమోదం లభించాలంటే ఈ మెజార్టీ అత్యంత కీలకం. ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు వీలుగా విపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు తిరుగు బావుటా ఎగురవేసి స్పీకర్‌కు లేఖలు సమర్పించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలోనూ అతిపెద్ద చీలిక రాబోతోందనీ, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారంటూ ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. పాత కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో కొందరు ఎస్పీ ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపిందని పేర్కొంది. అయితే.. చీలికల నుంచి తన పార్టీని కాపాడుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వై కేంద్రంతో నేరుగా ఘర్షణ పడే వైఖరిని పక్కనపెట్టి, తమ పార్టీ జోలికి రాకుండా ఉండేలా ఆయన ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాపై అఖిలేష్ యాదవ్ సభలో చాలా సానుకూలంగా స్పందించడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాను అధికారికంగా డీలిమిటేషన్ బిల్లులో చేరిస్తే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని అఖిలేష్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల పెంపు ఫార్ములాకు అఖిలేష్ కూడా ఆమోదం తెలపడంతో బీజేపీ హైకమాండ్‌కు ఆయన వైపు నుండి లైన్ క్లియర్ అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సీట్ల పెంపు ఫార్ములా ఒప్పందం గనుక కుదిరితే, సమాజ్‌వాదీ పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఉండకపోవచ్చంటున్నారు. దీనివల్ల అఖిలేష్ యాదవ్ తన పార్టీని కాపాడుకుంటూనే, వ్యూహాత్మకంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని చెబుతున్నారు.

Publish Date: Jun 18, 2026 3:47AM
అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!
అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు విజన్ కు దర్పణం పట్టేవిధంగా రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరం అమరావతి కేవలం భవనాల నగరం మాత్రమే కాదు.. ఈ మహానగరం అందరికీ కొత్త అనుభూతిని పంచే ఎక్స్‌పీరియన్స్ సిటీ గా రూపుదాల్చాలన్నదే చంద్రబావు విజన్. ఇటీవలి సింగపూర్ పర్యటన, అలాగే అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీని నిర్మించి.. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటం వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీల సమ్మేళనంగా అమరావతి రూపుదిద్దుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా స్మార్ట్, బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్‌తో అమరావతి రూపుదిద్దుకుంటోంది. దేశవిదేశీ సంస్థలను, ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఇక్కడికి ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీబీఎన్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యూఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చ్యేతో జరిపిన భేటీలో.. అమరావతిలో ఎన్‌యూఎస్, బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలకు అమరావతిని వేదికగా మార్చాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే..గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న సింగపూర్ బృందం, మళ్లీ ఇప్పుడు రాజధాని నిర్మాణ పురోగతిని తెలుసుకుని ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహంలో అత్యంత కీలకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్.. భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమరావతి దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించబోయే అద్భుతమైన ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ కోసం 1,208.41 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే సెక్రటేరియట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్ల ఫాసాడ్, స్ట్రక్చరల్ పనుల కోసం రెండు వేల 540 కోట్ల రూపాయలు, అసెంబ్లీ భవన పనుల కోసం 798 కోట్ల రూపాయలు కేటాయించారు. కృష్ణా నదిపై పాతిక వందల కోట్లతో నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే.. బిట్స్ పిలానీ వంటి ప్రముఖ సంస్థలు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరావతి క్యాంపస్‌ను సిద్ధం చేస్తున్నాయి. 2027 నాటికి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించి, దాదాపు పదివేల మంది విద్యార్థులకు క్వాంటమ్, ఏఐ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం విద్యారంగమే కాకుండా గ్యాస్, పవర్, వాటర్ సప్లై కోసం అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన మౌలిక వసతులతో అమరావతి నిజమైన గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ సిటీగా అవతరించబోతున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ వేదికగా చంద్రబాబు.. ఎవరైతే సుదీర్ఘకాలం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనుకుంటున్నారో.. వారు అమరావతికి రావాలి అంటూ పిలుపునిచ్చారు. కాలుష్య రహిత వాతావరణం, గ్రీన్-బ్లూ సిటీ కాన్సెప్ట్, అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డక్ట్ సిస్టమ్స్ ద్వారా అమరావతిని గ్లోబల్ లెవన్ జీవన ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, మరెన్నో పొలిటికల్ చాలెంజెస్ ఎదురయ్యాయి. చంద్రబాబు పట్టుదల, అకుంఠిత దీక్ష, విజన్ తో వాటన్నిటినీ అధిగమించి.. దేశంలోనే తొట్ట తొలి సస్టైనబుల్ గ్లోబల్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నారు.

Publish Date: Jun 16, 2026 2:14PM
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?

దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి 824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. దాంతో ఏపీలో 25 ఎంపీ సీట్లు నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లను 3గా, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది. ఆ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన రిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నష్టం, అధికార కూటమికి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే పట్టణ ప్రాంతాలు.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో బీజేపీ లబ్ది పొందే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009 ఎన్నికల ముందు జరిగిన డిలిమిటేషన్ సమయంలో కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. అనేక పాత నియోజకవర్గాలు రద్దయి, కొత్తవి ఏర్పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ఆధారంగా చాలా జనరల్ స్థానాలు రిజర్వ్‌డ్ స్థానాలుగా మారాయి. అది కలిసి వచ్చి ఏపీలో కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆ లెక్కలతోనే ఈ సారి నియోజకవర్గాల పెంపుతో ఎన్డీఏ కూటమికి ప్లస్ అవుతుందన్న విశ్లేషణలున్నాయి. అయితే ఏపీలో నియోజకవర్గాలపై ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదికతో వైసీపీకి లబ్ది చేకూరే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల పెంపునకు పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభాతో పాటు భాషా సమీకరణాలు, గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. వీటిలో రాజంపేట, కడప మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం కూటమి ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఈ 7 లోక్‌సభ స్థానాలను విడగొట్టి 20 చేయాలి. ఆ పెరిగే స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ నియోకవర్గాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశముంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 4 ఎంపీ స్థానాల్లో అరకు ఎస్టీ, తిరుపతి ఎస్సీ రిజర్వ్‌డ్ కావడం గమనార్హం. నియోజకవర్గాల పెంపుతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆర్థిక సలహా మండలి సూచిస్తోంది. గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పరిమితమైన వైసీపీ దాదాపు 40 శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, సహజంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే వైసీపీ ఓటు షేరు ఎంతోకొంత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో వైసీపీ బలం పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. ఇటు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఓటర్ల బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే. అంతో ఇంతో విద్యావంతులే మోడీ చరిష్మాకు ఆకర్షితులవుతున్నారు. ఆ బలంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ తెలంగాణలో ఏకంగా 8 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. ఇక ఇఫ్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ , చేవెళ్ల లోక్‌సభ స్థానాలను విడగొట్టి 14 స్థానాలు చేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. వాటిలో హైదరాబాద్ మినహా మిగిలిన నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలే గెలిచారు. ఇక ముందు నుంచి కాషాయపార్టీకి కొరకరాని కొయ్యగా మారిన హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సారి హైదరాబాద్‌ను మూడు లోక్‌సభ స్థానాలుగా మారిస్తే ఎంఐఎంను పరిమిత ప్రాంతానికి కట్టడి చేసి, బీజేపీ బలం పెంచుకునే అవకాశముందంటున్నారు. మరి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఎంత వరకు అమల్లోకి వస్తాయో? నియోజకవర్గాల పెంపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఏ రేంజ్లో ప్రభావితం చేస్తాయో? ఖచ్చితంగా తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Publish Date: Jun 14, 2026 5:17PM
 జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!
జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో ఇది ఒక సినిమాలో పాట.. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మెగా డీఎస్సీని తన హయాంలో ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో తానే కాక్రోచ్ ని అవుతానన్న మాటలూ చూస్తుంటే... ఆయన రూటే సెపరేటు అని నెటిజనులు ఎద్దెవా చేస్తున్నారు. నలుగురికి అవసరమైనది కాకుండా, ఆయనకు ఏది తోస్తే అది చేస్తారనీ, ఎది అనిపిస్తే అది మాట్లాడతారని అంటున్నారు. 2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన మీడియా సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పట్టించుకోకుండా.. ఆవు కథలాంటి ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ పై ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాత పల్లవినే వినిపించారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తై.. అభ్యర్థులు విధుల్లో చేరినప్పటికీ.. పాతచింతకాయ పచ్చడి లాంటి ధోరణిలోనే జగన్ ఆరోపణలు గుప్పించడంపై సొంత పార్టీ నేతలలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎందుకంటే డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో జగన్, వైసీపీ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో సాక్ష్యాధారాలతో సహా స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పాత ధోరణిలోనే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేయడం గమనార్హం. ఇక జగన్ యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజకీయవర్గాలలోనే విస్మయం వ్యక్తం అవుతున్నది. నిరుద్యోగ యువత తిరగబడుతుందంటూ.. ఆయన "ఇది జెన్-జీ , జెన్-ఆల్ఫా, రాష్ట్రంలో కాక్రోచ్‌లు లేస్తాయి.. తాను కూడా కాక్రోచ్ నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను నవ్వుల పాటు చేశాయి. నెటిజనులైతే జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు అంటూ బొద్దింకలను హిట్ నిర్మూలించినట్లే.. జనం జగన్ ను ఛీ కొడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నిటికీ మించి రాజకీయవర్గాలలో జగన్ పరిపక్వతపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఆయన కాక్రోచ్ వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా.. కేవలం ప్రభుత్వాన్ని దూషించడమే పరమావధిగా పెట్టుకుంటే.. జగన్ ను జనం మరింత దూరం పెట్టడం ఖాయమని పరిశీలుకులు అంటున్నారు. తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలురపాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధినేత విధానాలను గుడ్డిగా సమర్థించిన కీలక నేతలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వరుసగా వలసలు పోతుంటే, ఉన్నవారైనా వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే నైజం ఆ పార్టీ లీడర్‌షిప్‌లో లోపించిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రెస్‌మీట్‌తో వైసీపీ శ్రేణులకు మరియు మిగిలిన నాయకులకు తమ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇదే పంథాను నమ్ముకుని వెళ్తే రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమవుతున్న వైఖరిని గమనించిన తర్వాత, సొంత పార్టీ నేతల్లోనే అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికైనా ఒక నిశ్చయానికి రావడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా, కేవలం ఊహాజనిత ఆరోపణలతో కాలం గడిపితే ప్రజల్లో ఉన్న కనీస ఆదరణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలోనైనా వైసీపీ అధినాయకత్వం ప్రజా క్షేత్రంలోని వాస్తవాలను గ్రహించి ప్రవర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశీలకులు.

Publish Date: Jun 13, 2026 9:56AM
 మద్యం కుంభకోణం ప్రభావం.. జగన్ పాదయాత్ర 2.o అంత వీజీ కాదా?
మద్యం కుంభకోణం ప్రభావం.. జగన్ పాదయాత్ర 2.o అంత వీజీ కాదా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలలో తన ఘన విజయానికి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వడమే కారణమని భావిస్తున్న ఆయన మరో సారి అదే వ్యూహంతో ముందుకు వెళ్లలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయన పాదయాత్ర 2.o అంత వీజీ కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకోవడంతో జగన్ కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం వరకూ వైసీపీ అసలు రాష్ట్రంలో మద్యం కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చారు. అయితే మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ మద్యం కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించి, వైఎస్ జగన్‌ పీఏగా పనిచేసిన కేఎన్ఆర్ నుంచి వైసీపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అటెండర్ మనోహర్ వరకు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా విచారించింది. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఇక ఇహనో, ఇప్పుడో ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఎదురౌతుందని అంటున్నారు. జగన్ మాజీ పీఏ కేఎన్ఆర్ ఆస్తులు, ఆయన విదేశాలకు తరలించినట్లుగా భావిస్తున్న భారీ నిధులు, ఆ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల చెయిన్.. జగన్ చుట్టూ తిరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో జగన్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే.. ఇప్పటికే ప్రకటించినట్లుగా పాదయాత్ర చేపట్టే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. ఒకవేళ కేసుల తీవ్రత పెరిగి, చట్టపరమైన చర్యలు గనుక ముమ్మరమైతే అది ఆయన రాజకీయ పర్యటనలకు, ప్రజాక్షేత్రంలో తిరగడానికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. కోర్టులు, విచారణలు, ఈడీ, సిట్ అధికారుల ఎదుట హాజరుకావడం వంటి వాటితో ఆయన పాదయాత్ర చేపట్టడం అంత వీజీకాని పరిశీలకులు అంటున్నారు.

Publish Date: Jun 11, 2026 11:41AM
కుప్పం ఇక చంద్రబాబు పర్యవేక్షణలోనే.. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కాంచర్ల శ్రీనివాస్ కు ఉద్వాసన
కుప్పం ఇక చంద్రబాబు పర్యవేక్షణలోనే.. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కాంచర్ల శ్రీనివాస్ కు ఉద్వాసన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గడ్డ , ఆయన రాజకీయ కోట కుప్పం. 2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డబ్బు, అంగబలంతో కుప్పం స్థానిక సంస్థలను సైతం కైవసం చేసుకుని, టీడీపీకి గట్టి సవాల్ విసిరారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి కుప్పంలోనే ముగింపు పలుకుతామంటూ.. వై నాట్ 175 నినాదంతో ఆ సమయంలో కుప్పం కైవసానికి పడరాని పాట్లు పడింది. అయినా ఫలితం లేకపోయింది. కుప్పం నుంచి చంద్రబాబు 2024 ఎన్నికలలో కూడా విజయం సాధించారు. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకూ వరుసగా 8 సార్లు ఘన విజయం సాధించి పట్టు నిరూపించుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుప్పం రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని.. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న కాంచర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన యువ నేతగా శ్రీకాంత్ కుప్పంలో పార్టీని నడిపిస్తారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. ఈ ముగ్గురు నేతల మధ్య ఏర్పడిన అదృశ్య గోడలు పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేశాయి. ఎంతో ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో కానీ, బహిరంగ సభల్లో కానీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలోని టీమ్ తో ఇటీవల కుప్పం నియోజకవర్గంలో ఒక రహస్య సర్వేను నిర్వహించారు. దాదాపు 15 రోజుల పాటు సాగిన ఈ సర్వేలో.. రాబిన్ శర్మ బృందం గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. స్థానిక నాయకుల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలు, కార్యకర్తల మనోభావాలను నిశితంగా పరిశీలించి చంద్రబాబుకు సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదిక అందిన తరువాత.. చంద్రబాబు గత ఆదివారం కుప్పం నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా కీలక ప్రకటన చేశారు. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తాననీ, ప్రతి రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా కుప్పంలో పర్యటిస్తానని చెప్పారు. అదే సమయంలో, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే మరో యువకుడిని కుప్పంలో తన పీఏ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నియోజకవర్గ వ్యవహారాల్లో కార్యకర్తలు, నాయకులు ఈ కొత్త పీఏ సూచనలు, సలహాలు పాటించాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పార్టీ కేడర్‌ హర్షం వ్యక్తం చేస్తున్నది.

Publish Date: Jun 10, 2026 3:17PM
 20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు షాక్  టీఎమ్ సీపై మమత పట్టు జారిపోయిందా?
20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు షాక్ టీఎమ్ సీపై మమత పట్టు జారిపోయిందా?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ) ప్రస్తుతం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ఆ పార్టీ పునాదులను కదిలించేసింది. బెంగాల్ అసెంబ్లీలో గెలిచిన మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మందికి పైగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి మమత తేరుకోకముందే.. టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా' కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే టీఎమ్సీపై మమతా బెనర్జీ పూర్తిగా పట్టు కోల్పోయారని అనిపిస్తోంది. గడిచిన 13 సంవత్సరాలుగా రాజ్యసభలో టీఎంసీ చీఫ్ విప్‌గా సేవలందించిన సీనియర్ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో ఐదుగురు లోక్‌సభ ఎంపీలతో అత్యవసరంగా సమావేశం కావడం కలకలం రేపింది. ఆ తర్వాత బెంగాల్ మాజీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో సుమారు 20 మంది టీఎంసీ లోక్‌సభ సభ్యులు కేంద్ర మంత్రి, బెంగాల్ ఎన్నికల వ్యూహకర్త భూపేందర్ యాదవ్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ తిరుగుబాటు ఎంపీల బృందానికి సీనియర్ నాయకురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలిగా పేరున్న దస్తీదార్.. ఇటీవల తనను లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుంచి తనను తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమతో పాటు ఉన్న 20 మంది ఎంపీల సంతకాలతో ఎన్డీయే కూటమిలో చేరతామంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ఇలా బహిరంగంగా తిరుగుబాటు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల నేతలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవినీతికి పాల్పడ్డారంటూ ఒక టీఎంసీ కౌన్సిలర్‌కు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించిన ఘోర ఉదంతం బెంగాల్‌లోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది. మరోవైపు మమతా బెనర్జీ కుటుంబ రాజకీయాల చుట్టూ కూడా వివాదాలు ముసురుకున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని మమతా బెనర్జీకి ప్రతిపాదించగా, ఆమె తిరస్కరించినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయినప్పటికీ అభిషేక్ బెనర్జీ ప్రాభవాన్ని తగ్గించడానికి మమత అదనంగా ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఇటీవలే సోనార్‌పూర్‌లో పర్యటించిన అభిషేక్ బెనర్జీపై స్థానికులు రాళ్లు, గుడ్లు, చెప్పులతో దాడి చేశారు. రక్షణ కోసం ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ సంతకాల వివాదంలో అభిషేక్ బెనర్జీకి సీఐడీ సమన్లు కూడా జారీ చేసింది. 15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్, తన రాజకీయ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మనుగడ పోరాటాన్ని ఎదుర్కొంటోంది.

Publish Date: Jun 9, 2026 11:27AM
తమిళనాడు బీజేపీ ఖాళీ.. అణ్ణామలై దారిలో కీలక నేతలు?
తమిళనాడు బీజేపీ ఖాళీ.. అణ్ణామలై దారిలో కీలక నేతలు?

తమిళనాడులో బీజేపీ ఖాళీ అయిపోతోందా? రాష్ట్రంలో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న ఆ పార్టీకి అణ్నామలై రాజీనామా ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తీసిందా. పట్టు సాధించాలన్న ప్రయత్నాలు అటుంచి.. తమిళనాట బీజేపీ ఉనికే ప్రశ్నార్థకమౌతోందా అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నడుస్తున్న తమిళనాట జాతీయ పార్టీ బీజేపీ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక దశలో అయితే రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతోందా అని కూడా అనిపించింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలం కావడంతో కమలం పార్టీ నైరాశ్యంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీకి అత్యంత కీలకంగా ఎదిగిన అణ్ణామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మరింత మంది కీలక నేతలు కూడా నడుస్తున్నారు. ఇదే ఇప్పుడు తమిళనాట బీజేపీ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా.. సొంతంగా ఒక నూతన రాజకీయ ప్రస్థానాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించారు. 2031 అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అణ్ణామలై ఈ కొత్త కూటమిని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అణ్ణామలై నిష్క్రమణతో తమిళనాడు బీజేపీలో సంక్షోభం ఆగలేదు. ఆయన వెనుకే పార్టీకి చెందిన మరికొందరు కీలక నేతలు అడుగులు వేస్తున్నారు. తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నాగరాజన్ సైతం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగరాజన్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న దాదాపు 15 మంది నేతలు కూడా బీజేపీని వీడారు. ఈ 15 మంది రాష్ట్ర స్థాయి కార్యవర్గ నేతలు కూడా అణ్ణామలై ప్రారంభించిన సరికొత్త రాజకీయ ఉద్యమంలో చేరారు. ఒకేసారి ఇంతమంది సీనియర్లు చేజారిపోవడంతో రాష్ట్రంలో బీజేపీ దాదాపు ఖాళీ అయిపోయిన పరిస్థితి. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని భావించిన బీజేపీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆశించిన బీజేపీకి దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్యంగా దెబ్బకొట్టింది. విజయ్ ఎంట్రీతో తమిళ ప్రజల నాడి మారిపోవడమే కాకుండా, బీజేపీకి ఉన్న అరకొర అవకాశాల తలుపులు కూడా పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలోని కీలక నేతలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేయడంతో.. ఇక తమిళనాట కమల వికాసం అశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిష్తున్నారు.

Publish Date: Jun 6, 2026 11:12AM
కేవీపీ సవాల్.. పవన్ స్పందనేంటి?  జగన్ సైలెన్స్ కి కారణమేంటి?
కేవీపీ సవాల్.. పవన్ స్పందనేంటి? జగన్ సైలెన్స్ కి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై కానీ, జగన్ పై కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డిపై కానీ విమర్శలు చేస్తే.. వైసీపీ అధినేత, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రియాక్ట్ కావాలి. కానీ అదేంటో.. వైఎస్ బతికి ఉన్న సమయంలో ఆయన ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనను తీవ్రంగా వేధించారని, తనపై అక్రమ కేసులు పెట్టాలంటూ అప్పట్లో ఒక ఐపీఎస్ అధికారికి స్వయంగా పురమాయించారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలు పాత జ్ఞాపకాలను, నాటి రాజకీయ గొడవలను మరోసారి తెరపైకి తెచ్చాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు సీరియస్ గా రియాక్టయ్యారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు. కేవీపీ విసిరిన ఈ 10 కోట్ల రూపాయల ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని భుజాన వేసుకుని ఒక సారి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత, వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కేవీపీ ప్రశ్నించారు. వైఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే.. కొడుకుగా జగన్ కి కోపం, రోషం రావాలి, కానీ, ఆయనకు అలాంటివేవీ ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రతి చిన్న అంశం కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లోనే జరిగేది. వైఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరికి ఏ ఆదేశాలు ఇచ్చినా అందులో కేవీపీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేది. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ఐపీఎస్ అధికారిని పిలిచి వేధించమనే ఆదేశాలు వైఎస్సార్ ఇచ్చి ఉంటే.. ఆ విషయం కేవీపీ రామచంద్రరావుకు తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. ఆ పూర్తి నమ్మకంతోనే, తన మిత్రుడి క్యారెక్టర్ ఏంటో తనకు పూర్తిగా తెలుసు కాబట్టే, కేవీపీ అంత గట్టిగా, అంతటి భారీ మొత్తాన్ని పణంగా పెట్టి పవన్‌కు సవాల్ విసిరారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవాల్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Publish Date: Jun 5, 2026 12:15PM
జగన్ యాంటీ అమరావతి మైండ్ సెట్.. ఒరిగేదేంటంటే?
జగన్ యాంటీ అమరావతి మైండ్ సెట్.. ఒరిగేదేంటంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం హాట్ టాపిక్‌గానే ఉంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత కూడా ఈ వివాదం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కూటమి ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని ఆరోపిస్తున్న కొందరు రైతులతో జగన్ భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులంతా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ లైవ్ ప్రసారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట. అయితే జగన్ ఈ వ్యూహాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఈ సమావేశానికి వచ్చిన రైతులు అమరావతి ప్రాంతంలో వైసీపీని సమర్థించే ఒక వర్గానికి చెందిన వారని, అక్కడ తీవ్ర అసంతృప్తి ఉందనే రంగు పులిమేందుకే ఈ భేటీని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ వ్యూహం సక్సెస్ అయ్యే అవకాశాలు మృగ్యమని విశ్లేషిస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల సమయంలో అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు జగన్ కి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దానికి కారణం ఎన్నికల ముందు ఆయన అమరావతి రాజధానిగానే ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మాట మార్చి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ 2024 ఎన్నికలలో వైసీపీని తిరస్కరించారు. దీంతో ఆయన పార్టీ ఆ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక జగన్ ఇప్పుడు కూడా అదే యాంటీ అమరావతి మైండ్‌సెట్‌తో ముందుకు సాగడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు వైసీపీ మరింత దూరం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అమరావతి రైతులు రాజధాని అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఉంది. అలాంటి ప్రాంతంలో మళ్లీ రాజధాని మార్పు అనడం ద్వారా జగన్ సాధించేది ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం సెల్ఫ్ గోల్ అవుతుందని అంటున్నారు.

Publish Date: Jun 4, 2026 11:42AM
TeluguOne Picks For You
rss-imgRss Feeds