EDITORIAL SPECIAL
  మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని, నూటికి నూరు శాతం మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గెలుపు మనదేనన్న భరోసా ఇచ్చారట. ప్రతిపక్షాల మైండ్‌గేమ్‌లో పడాల్సిన అవసరం లేదని, వారు చేస్తోన్న హంగామాకు బెదిరిపోవద్దని, గెలుపు మనదేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 116 సీట్లు వస్తాయని, దాని కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు టీడీపీ వైపు నిలబడ్డారని అన్నారట. కేంద్రం, ఎన్నికల కమీషన్‌ సహాయంతో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డామని, గెలుపు మనదేనని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించబోతోందని బాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "గతంలో చిత్తూరులో టీడీపీకి 7 సీట్లు వస్తే.. ఈసారి మరో రెండు సీట్లు పెరుగుతున్నాయి. అదే విధంగా అనంతపురంలో వచ్చిన 12 సీట్లను నిలబెట్టుకుంటున్నామని, కర్నూలులో గతంలో 3 సీట్లు వస్తే.. ఈసారి తొమ్మిది సీట్లు సాధించబోతున్నామని, కడపలో మరో సీటు వస్తుందని.. గతానికంటే పది సీట్లు సీమలో అదనంగా గెలుచుకోబోతున్నాం" అని బాబు అన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారట.  ఇక ప్రకాశంలో ఏడు, నెల్లూరులో నాలుగు సీట్లు వస్తున్నాయని అన్నారట. రాజధాని ప్రాంతమైన  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదికి తగ్గకుండా వస్తాయని, గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, ఉత్తరాంధ్రలో మెజార్టీసీట్లు సాధిస్తామని తెలిపారట. మరి బాబుకి తమ గెలుపుపై ఉన్న నమ్మకం నిజమవుతుందో లేదో రేపు తెలుస్తోంది.
  ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల వద్దకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మొబైల్ లో చిత్రీకరించారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు. పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. కాగా.. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. బీహార్, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈవీఎంల తరలింపు వార్తలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపింది.
  కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. ఇక ఏపీలో వైసీపీదే గెలుపని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అంతేకాదు.. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని సీఎంగా మరోసారి చూడాలని తన ఆకాంక్ష అని బాబుతో విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేసున్నారు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ నేత.. చంద్రబాబుని కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పినా బీజేపీకి నమ్మకం లేదా? అందుకే మిగతా పార్టీ నేతలను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీ పెద్దలు బాబు వద్దకి విష్ణుని రాయబారానికి పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మని విష్ణు.. ఏపీలో టీడీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ బాబుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విష్ణు.. బాబుని ఏ ఉద్దేశంతో కలిసారో ఆ పై వాడు విష్ణువుకే తెలియాలి.
ALSO ON TELUGUONE N E W S
  ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేషు, శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో దర్శకుడు నిర్మాతలకి మధ్య స్టోరీ మార్పుల విషయం లో నిర్మాత చెప్పిన మార్పులు కథకు ఏమాత్రం న్యాయం చేయలేవని నిర్మాతకు చెప్పిన వినని పక్షం లో షూటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత "2స్టేట్స్" మూవీ ప్రాజెక్ట్ లో అసలేమి జరుగిగింది అనే విషయమై దర్శకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ...  నేను ముందుగా ముంబై లోని బాలాజీ టెలి ఫిలిమ్స్ లో దర్శకత్వ కోర్స్ పూర్తి చేసుకుని తరువాత స్టార్ దర్శకులు వి.వి. వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేసి, ఇప్పుడు నేను దర్శకుడికడిగా పరిచయం అవుతున్న చిత్రం "2స్టేట్స్" ఈ చిత్రం మొదలవుతున్నప్పుడు హీరో హీరోయిన్ నిర్మాతలను నేను నా స్టోరీ ని పూర్తిగా వినిపించి అందరి అనుమతి అయిన తరువాత షూటింగ్ మొదలు పెట్టి ఇప్పటికి మూవీ 70% పుర్తి చేసుకుంది, అయితే  మా ఆర్టిస్టులు నిర్మాత మిగతా టెక్నిషన్స్ అందరూ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఔట్ ఫుట్ విషయం లో చాలా ఆనందంగా ఉన్నారు, ఆ విషయాన్ని నిర్మాత కొన్నిరోజుల క్రితం న్యూస్ పేపర్స్ మరియు సోషల్ మీడియాలలో షేర్ చేయడం జరిగింది, సినిమా బాగా వస్తున్న టైంలో  నా కథను కొంతమంది పక్కదోవ పట్టించే దిశగా  2స్టేట్స్ కథలో మార్పులు చేయమని నన్ను నిర్మాత అడిగారు దానికి నేను తిరస్కరించాను, అయితే కొంతమంది తో కలిసి  నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని న్యూస్ పేపర్స్ లో మరియు  సోషల్ మీడియాలలో నాపై చేసిన అసత్య ప్రచారం మరియు నన్ను 2స్టేట్స్ మూవీ దర్శకుడిగా తొలగించే ప్రయత్నం జరుగుతుంది అని తెలిసి నేను నిర్మాత పై కోర్ట్ లో కేసు వెయ్యడం జరిగింది. కోర్టు కేసు వివరములు: O.P NO. 3 of 2019. Next day of hearing 30/5/2019.. Vacation Court C.C.C. Hyderabad. సివిల్ కోర్టులో ఉన్న వేకేషన్ కోర్ట్ విచారణ అనంతరం ఈ నెల 30న 2స్టేట్స్  ప్రొడ్యూసర్ ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) ని వివరణ కోరింది.2స్టేట్స్ సినిమాకు నేను దర్శకత్వం తో పాటు వన్ ఆఫ్ ది పాట్నర్ మరియు ప్రాఫిట్ హోల్డర్ని ఈ చిత్ర హక్కులు మరియు 2స్టేట్స్ రిమేక్ రైట్స్ ముంబాయ్ లో చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దర్శకత్వం వహించే హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి, నేను కాకుండా ఎవరైనా ఈ చిత్రాన్ని మిగతా 30% షూటింగ్ పూర్తి చేయాలని వచ్చిన దర్శకుడు కి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, అంతేకాదు 2స్టేట్స్ మూవీ కథ మార్పులు చేసి నన్ను ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలనుకున్న అందరి పేర్లు మరియు  మరికొన్ని విషయాలు కోర్టు వారితో సంప్రదించి త్వరలో బయట పెడతాను, అని "2స్టేట్స్" చిత్ర దర్శకుడు వెంకటరెడ్డి తెలిపారు.  
ల‌వ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్‌. ముఖ్యంగా మెగా హీరోల‌కు ఈ డైర‌క్ట‌ర్ మంచి విజ‌యాలు ఇచ్చాడ‌నే చెప్పాలి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ ని  కీల‌క మ‌లుపు తిప్పిన‌ `తొలిప్రేమ‌`. ఎ. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తొలి చిత్రం కావ‌డం విశేషం. ఆ త‌ర్వాత ప‌వ‌న్ తోనే బాలుని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో  `హ్యాపీ`ని రూపొందించి మ్యూజిక‌ల్ హ‌ట్స్ అందుకున్నాడు క‌రుణాక‌రన్. అలాగే పుష్క‌ర‌కాలం గ్యాప్ త‌ర్వాత అదే మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ తో `తేజ్ ఐ ల‌వ్ యూ` (2008) చిత్రాన్ని రూపొందించాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. అంతేకాదు ఇప్పుడు మ‌రో మెగా హీరో కోసం మ‌ళ్ళీ మెగాఫోన్ ప‌ట్టున్నాడ‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే అల్లు శిరీష్ క‌థానాయుకుడిగా క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రానుంద‌ని టాలీవుడ్ టాక్. ఇప్ప‌టికే క‌రుణాక‌ర‌న్ ఓ డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ ని శిరీష్ కి వినిపించ‌డం జ‌రిగింద‌ట‌. శిరీష్ కి కూడా క‌థ న‌చ్చ‌డంతో ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. శిరీష్ హోమ్ బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే అల్లు అర్జున్ తో క‌రుణాక‌ర‌న్ రూపొందించిన హ్యాపీని గీతా ఆర్ట్స్ నిర్మించ‌గా ఇప్పుడు బ‌న్నీ త‌మ్ముడు అల్లు శిరీష్ తో చేయ‌బోయే సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించ‌నుంద‌ట‌.  
  ఐదు పదుల వయసున్న హీరోల పక్కన పాతికేళ్ల కుర్ర హీరోయిన్లు నటించడం కొత్తేమీ కాదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ ఎప్పటి నుంచో ఈ సంస్కృతి ఉంది. హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ కామన్. అయితే... ఏజ్ గ్యాప్ కథాంశంతో ఈ మధ్య హిందీ సినిమా 'దే దే ప్యార్ దే' వచ్చింది. అందులో రకుల్ హీరోయిన్. తాజా ఇంటర్వ్యూలో ఈ ఏజ్ గ్యాప్ గురించి ఆమె మాట్లాడింది. "వయసు ముఖ్యం కాదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ముఖ్యం. రియల్ లైఫ్‌లో 50 ఏళ్ళ పురుషుడు, 26 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడితే ఏవేవో మాట్లాడతారు. అసలు, ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా ఉన్నంతకాలం వయసు గురించి మాట్లాడకూడదు" అని రకుల్ చెప్పింది. 'మన్మథుడు 2' కథేంటో చెప్పలేను కానీ... అందులోనూ యంగ్ గాళ్‌గా నటిస్తున్నట్టు ఆమె తెలిపింది. నాగార్జున సినిమాలోనూ ఏజ్ గ్యాప్, ఓల్డ్ ఏజ్ మ్యాన్ -యంగ్ ఏజ్ అమ్మాయి మధ్య రొమాన్స్ ఏదో ఉండి ఉంటుందన్నమాట! 'దే దే ప్యార్ దే' తరవాత హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తుండటం వల్ల తెలుగులో అవకాశాలు వచ్చినా నటించలేకపోయానని, కావాలని తెలుగు సినిమాలకు దూరం కాలేదని, ఏ భాషలోనైనా మంచి సినిమాలు చేయడమే తనకు ముఖ్యమని రకుల్ సెలవిచ్చింది.    
  సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారిప్పుడు!  'మహర్షి' స‌క్సెస్‌ని సెల‌బ్రేట్‌ చేసుకుంటున్నాని పోస్టులు పెడుతున్నారు. అదే సంతోషంలో నెక్స్ట్ సినిమా ఓపెనింగ్‌కి ముహూర్తం కూడా పెట్టేశారు. 'ఎఫ్ 2'తో ఒక్కసారిగా స్టార్ దర్శకుల జాబితాలో చేరిన అనిల్ రావిపూడితో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆదివారం అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. త్వరలో క్లాప్ కొడతామని అన్నారు. త్వరలో అంటే మరెంతో దూరంలో లేదు. ఈ నెల 31న సినిమా ఓపెనింగ్. ఎప్పుడూ మహేష్ సినిమా ఓపెనింగ్‌ల‌కు అటెండ్ అవ్వరు. ఆయనకు అదొక సెంటిమెంట్. ఈ సినిమా ఓపెనింగ్‌కి కూడా అటెండ్ కారు. ఫారిన్ ట్రిప్‌లో ఉంటారని టాక్. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి 31న క్లారిటీ ఇచ్చే ఆలోచనలో టీమ్ ఉంది. 'మహర్షి' తరవాత మహేష్ బాబుతో మరోసారి దిల్ రాజు అసోసియేట్ అవుతున్నారు. అనిల్ సుంకరతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   
నాగార్జున సినిమాలోని ఈ పాట అంద‌రికీ గుర్తుకుండే ఉంటుంది. ఇప్పుడు అంద‌రూ ఇదే పాట పాడుతున్నారు. ఎందుకంటారా? స‌మంత నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఓ బేబి` సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమా టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది.  టీజ‌ర్ లో స‌మంత ను చూసిన వాళ్లు ఓ బేబి నీ మీద బెంగ ప‌డ్డా అంటూ పాడుకుంటున్నారు. సినిమా సినిమాకు త‌న గ్లామ‌ర్ తో ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది అక్కినేని స‌మంత‌. ఇక ఓ బేబి టీజ‌ర్ చూసాక స‌మంత ఓల్డ్ లేడీ క్యార‌క్ట‌ర్ చేసిన‌ట్లు అర్థ‌మవుతోంది. అనుకోకుండా ఆమె పాతికేళ్ల భామ‌గా మారిపోతుంద‌ట‌. ఆ త‌ర్వాత త‌న కోరిక‌ల‌న్నీ నెర‌వేర్చ‌కుంటుంద‌ట‌. అది ఎలా సాధ్య‌మైంది? ఏంటి ? అన్న‌దే చిత్ర క‌థాంశ‌మ‌ట‌. ఇక ఈ రోజు విడుద‌లైన టీజ‌ర్ సినిమా పై ఇంట్ర‌స్ట్ పెంచింది. సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కొరియ‌న్ సినిమా `మిస్ గ్రానీ` కిది రీమేక్. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఫిలింస్ మ‌రో సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తోంది.  ఇందులో నాగ‌శౌర్య ఒక ఇంట్ర‌స్టింగ్ క్యార‌క్ట‌ర్ చేస్తున్నాడు. మ‌రి `నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు `` అంటూ ఎండ్ అయింది సినిమా టీజ‌ర్. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.   
  బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యర్థి పార్టీలు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఒంటి కాలు మీద లేస్తారు. అయితే ఇదంతా జాతీయ రాజకీయాల్లోనేనట. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు శ్రేణులు కలిసి పనిచేసి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో టీఆర్ఎస్ భావించినట్లు 16 సీట్లు గెలిచే అవకాశం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు,మూడు సీట్లు వరకు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. అయితే బీజేపీకి రెండు మూడు స్థానాల్లో గెలుపు అవకాశాలు రావడానికి కారణం కాంగ్రెస్ సహకారమే అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రెండో దఫా పోటీ చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ బరిలోకి దిగారు. అయితే అరవింద్.. గతంలో కాంగ్రెస్ లో బలమైన నేతగా పేరు తెచ్చుకున్న డి. శ్రీనివాస్ తనయుడు కావడంతో.. ఆయన వెంట మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలిచారని ప్రచారం జరుగుతోంది. అదీగాక ఎలాగైనా కవిత గెలుపుకి బ్రేకులు వేయాలని భావించిన మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు.. ఓట్లు చీల్చకూడదని భావించి అరవింద్ కి ఓటేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ స్థానంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడర్ ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటు వేయాలని కోరినట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ లో బండి సంజయ్ కి ఉన్న సొంత ఇమేజ్ కి తోడు, కాంగ్రెస్ కేడర్ కూడా తోడు కావడంతో.. కరీంనగర్ లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కరీంనగర్ లలోనే కాదు.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణ పోటీ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన కాంగ్రెస్ నేతలు.. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి వెళ్లిన డీకే అరుణ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ జోరుకి అడ్డుకోవడం కోసం.. కాంగ్రెస్ తన ప్రత్యర్థి అయిన బీజేపీ గెలుపుకి కృషి చేసిందని ప్రచారం జరుగుతోంది.
  ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు టీడీపీ ప్లాన్ కూడా సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాటలు కూడా ఇందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 అర్థరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన.. తప్పనిసరి అయితే రీపోలింగ్ జరిపిస్తామన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వచ్చినా, ఈవీఎం డీకోడ్ కాకపోయినా, ఈవీఎంలు మొరాయించినా, పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నా రీపోలింగ్‌ జరిపించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు. ఈ మాటలను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సరే. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడా కొట్టిందనీ, అంతా గందరగోళం అయిపోయిందనీ మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని టీడీపీ పట్టుపట్టే ఛాన్సుందని తెలుస్తోంది. వైసీపీ వైపు నుంచీ చూస్తే... ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు అనే ఆలోచనలోనే లేదు. ఎందుకంటే కచ్చితంగా తామే గెలుస్తామని బలంగా నమ్ముతోంది. ఈ నమ్మకమే టీడీపీని మళ్లీ ఎన్నికలవైపు నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే.. ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్ జరిగిందనీ, దాన్ని ఎలాగైనా కనిపెట్టి.. మొత్తం ఎన్నికల్ని రద్దు చేసైనా సరే నిజానిజాల్ని బయటకు తేవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గందరగోళం జరిగినట్లు టీడీపీ నిరూపిస్తే, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలను కనిపెడితే, అప్పుడు ఈసీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. అది రీపోలింగ్‌కి దారితీస్తుంది. మరి రేపటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, ఒకవేళ టీడీపీకి ప్రతికూలంగా ఉంటే రీపోలింగ్‌ అంటారేమో చూడాలి.
  ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిజానికి వైసీపీ శ్రేణులు తమదే అధికారమని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నాయి. వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం, జగన్ డ్రీం కేబినెట్ లిస్ట్.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని పరిశీలిస్తే చాలు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కీలక నేత విజయసాయి రెడ్డిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విజయ సాయి రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. అందుకే జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ సాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. అయితే విజయ సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఉన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది.
  సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగా కరీంనగర్ పేరు వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగారు. బండి సంజయ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలబడ్డారు. దీన్నిబట్టి చూస్తుంటే బండి సంజయ్ పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ ఖాతాలో ఒక సీటు పడేలా ఉంది. ఇక బీజేపీ మరో రెండు స్థానాల్లో కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవే సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలు. ఈ రెండింట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ లో బీజేపీకి పట్టు ఉండటమే కాకుండా కిషన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందని చెప్పలేము కానీ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు తెలంగాణలో బీజేపీ బోణి కొడుతుందో లేదో ఈ నెల 23 న తేలనుంది.
  విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు. విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు. పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.
  తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
    ఒక బడిలో పిల్లలు నిరంతరం గొడవలుపడుతూ, కొట్టుకుంటూ ఉండేవారు. పిల్లలంతా చదువులో బాగున్నారు, ఆటపాటల్లో బాగున్నారు. కానీ వారిలో సంస్కారం మాత్రం లేదని ఉపాధ్యాయులంతా తెగ బాధపడేవారు. ఇంత చిన్న వయసులోనే ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారంటూ దిగాలు పడిపోయేవారు. పిల్లల తీరు మార్చేందుకు ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా ప్రభావం లేకుండా పోయింది. చివరికి ఓ ఉపాధ్యాయుడికి ఓ ఆలోచన తట్టింది. మర్నాడు తన తరగతిలో అడుగుపెడుతూనే ఆ ఉపాధ్యాయుడు ‘నేను మీతో ఓ సరదా ప్రయోగం చేయించాలనుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని చివరివరకూ చేసినవారికి పరీక్షలలో ఐదేసి మార్కులు కలుపుతాను,’ అన్నాడు. ప్రయోగం, మార్కులు అనగానే పిల్లలంతా ఉత్సాహంగా తల ఊపారు. ‘మీకు ఈ ప్రపంచంలో కొందరు ఇష్టం ఉండకపోవచ్చు కదా! అలా మీకు ఎంతమందిమీద ద్వేషం ఉంటే అన్ని టమాటాలని రేపు తీసుకురండి,’ అని చెప్పాడు. టీచరుగారు చెప్పింది సరదాగానే ఉంది. దాంతో ఒకో విద్యార్థీ తనకి ఎందరి మీద ద్వేషం ఉందో అన్నేసి టమాటాలు తీసుకువచ్చాడు. కొందరు మూడు టమాటాలతో సరిపెట్టుకున్నారు, కొందరు పది తెచ్చారు, ఇంకొందరు ఏకంగా ఇరవై టమాటాలు మోసుకువచ్చారు. ‘వెరీ గుడ్‌! మీరు తెచ్చిన టమాటాలన్నీ మీ డెస్క్‌లో పెట్టుకోండి. ఒక వారం గడిచాక వాటిని తీసేయవచ్చు. ఇదే మీరు చేయబోయే ప్రయోగం,’ అన్నారు టీచరుగారు. టీచరుగారి మాటలకు పిల్లలు పగలబడి నవ్వారు. ఇది కూడా ఓ ప్రయోగమేనా! అంటూ గుసగుసలాడుతూ  ఎగతాళి చేశారు. కానీ ఎంతైనా టీచరు కదా! అందుకని మారుమాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేశారు. ఓ రెండు రోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మొదలైంది అసలు కథ! డెస్క్‌లో టామాటాలు గభాలున చేయి తగిలితే పగిలిపోయేవి. మరికొన్ని కుళ్లపోయేవి. దాంతో పుస్తకాలు పెట్టుకోవడానికి కాదు కదా! కనీసం తలుపు తెరిచి చూడ్డానికి కూడా విద్యార్థులకి భయం వేసిపోయింది. ఎక్కువ టమాటాలు ఉన్నవారి బాధ మరింత ఎక్కువగా ఉంది. వాళ్లు బడికి రావడానికే భయపడిపోయారు. డెస్క్‌ మీద చేయి వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఇలా వారం రోజులూ క్షణమొక యుగంగా గడిచాయి. చివరి రోజుకి పిల్లలంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు. ‘నేను చెప్పినట్లుగానే ప్రయోగం కోసం మీరంతా వారం పాటు టమాటాలను మీ దగ్గర ఉంచుకున్నారు. ఈ పరీక్షలో మీరంతా నెగ్గారు కాబట్టి మీ అందరికీ ఐదేసి మార్కులు ఇస్తున్నాను. కానీ మార్కులకి మించిన పాఠం ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంది,’ అన్నారు టీచరుగారు చిరునవ్వుతో! టీచరు మాటలకి విద్యార్థులందరూ నోరువెళ్లబెట్టుకొని చూశారు. వాళ్లని చూస్తూ టీచరుగారు ఇలా చెప్పారు... ‘మీరు ఏర్పరుచుకున్న ద్వేషాలు మీ డెస్క్‌లో ఉన్న టమాటాలులాంటివి. ఎంతమంది మీద ద్వేషం ఏర్పరుచుకుంటే మీ మనసులో అంత దుర్గంధం చేరుతుంది. చూసేవాళ్లకి కూడా మీ మనసు అంత స్వచ్ఛంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. క్రమంగా అంతా మీ నుంచి దూరమైపోతారు. కొన్నాళ్లకి మీరే మీకు అర్థం కాకుండా పోతారు. మనసులో ఏదో తెలియని బరువు, చిరాకు మాత్రమే మిగులుతాయి. ప్రేమ, కరుణలాంటి గుణాలు దూరమైపోతాయి. ద్వేషంతో మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలా? ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించాలా?’ మీరే నిర్ణయించుకోండి అంటూ ముగించారు టీచరుగారు. ఆయన మాటలు విన్న విద్యార్థులంతా ఆలోచనలో మునిగిపోయారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  ఒక ప‌న్నెండేళ్ల పిల్ల‌వాడు ఏదో ఘోర‌మైన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని కుడి చేయి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్ల‌వాడికి చిన్న‌ప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను క‌రాటేలో గొప్ప ప్ర‌తిభావంతుడిని కావాలన్న‌దే ఆ కోరిక‌! కానీ ఇప్పుడేం చేసేది? త‌న కుడి చేయి ఇక క‌రాటేకి స‌హ‌క‌రించ‌దు క‌దా! అయినా ఆశ చావక తన బ‌డిలో ఉంటున్న క‌రాటే మాస్ట‌రు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.   `నేను ఇంక జీవితంలో క‌రాటేని నేర్చుకోలేమోన‌ని అనిపిస్తోందండీ` అన్నాడు బాధ‌గా. ఆ మాస్ట‌రుగారు ఒక్క‌నిమిషం ఆలోచించి `నీలో క‌నుక నిజంగా ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప‌కుండా క‌రాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రేనా!` అని అన్నాడు. `నా చిన్న‌ప్ప‌టి కోరిక‌ను నెర‌వేర్చుకునేందుకు నేను ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్ల‌వాడు. మ‌రుస‌టి రోజు నుంచి పిల్ల‌వాడు రోజూ క‌రాటే మాస్టరుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్ట‌రు రోజూ పిల్ల‌వాడికి ఒక‌టే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే ప‌ని. అదే కదలిక‌ని అభ్యాసం చేసీ చేసీ పిల్ల‌వాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒక‌టే ర‌కం భంగిమ‌తో అత‌నికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాట‌కి క‌ట్టుబ‌డి ఊర‌కుండిపోయేవాడు. కొన్నాళ్ల‌కు ఇంక ఉండ‌బ‌ట్ట‌లేక `కరాటే అంటే ఇంతే కాదు క‌దా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలిక‌నే సాధ‌న చేస్తూ ఉండు. చాలు!` అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడ‌కుండా అదే భంగిమ‌ను సాధ‌న చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండ‌గా కొన్నాళ్ల‌కి ఆ బ‌డిలో కరాటే పోటీలు మొద‌లుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీల‌లో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమ‌న‌తోనా!` అంటూ ఉక్రోషంగా బ‌దులిచ్చాడు పిల్ల‌వాడు.   గురువుగారు ఓ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్ల‌వాడు త‌న‌కి పోటీలో ఎదుట‌ప‌డిన ఇద్ద‌రు ప్రత్యర్థుల‌నీ చాలా తేలికగా మ‌ట్టి క‌రిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మ‌రింత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఎదురుపడ‌సాగారు. కానీ ఎలాగొలా చివ‌రిక్ష‌ణంలో అయినా వాళ్ల‌ని ఓడించగ‌లిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అత‌నిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివ‌రికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అత‌నే విజేత‌గా నెగ్గాడు. `గురువుగారూ! జ‌రిగింది న‌మ్మ‌లేక‌పోత‌న్నాను. నేనీ ఒక్క క‌ద‌లిక‌తోనే విజ‌యాన్ని సాధిస్తాన‌ని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చ‌ర్యంగా. `మ‌రేం లేదు! నీకు నేర్పిన ఈ క‌ద‌లిక క‌రాటేలోనే చాలా క‌ష్ట‌మైన‌ది. అందుక‌ని చాలామంది దాన్ని నేర్చుకోవ‌డానికి వెనుకాడ‌తారు. ఇక‌పోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బ‌లంగా ఎడ‌మ‌చేత్తో పోరాడ‌లేరు. అందుక‌నే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజ‌యాల‌ను సాధించ‌గ‌లిగావు` అన్నారు గురువుగారు. ఎంత‌సేపూ త‌న బ‌ల‌హీన‌త గురించి ఆలోచించే ఆ పిల్ల‌వాడు, ఆ బ‌ల‌హీన‌త‌ని సైతం బ‌లంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.  
  కొందరిని చూస్తే ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఎప్పుడు ఆనందం గా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏది కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకం గా నిలబెడతాయి . ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా ? పాజిటివ్ మైండ్ సెట్ ...తో జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం . ఆ ఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకం గా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాసం కనిపిస్తుంది .అంటున్నారు ఆయన. మరి అలాంటి మాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే ? ఆయన చెబుతున్న ఈ కింది వాటిని ఫాలో అవ్వటమే.   లోపలినుంచి మొదలు కావలి .. మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతం గా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆ ప్రశాంత తని  అలవాటు చేయాలి. దానికోసం రోజు ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు . ఆ రోజు లో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలు ని ఆందోళన పడకుండా దాటగలుగుతాము .ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది . సమస్యలు కి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతం గా వుండటం వల్లే సాధ్యమవుతుంది .   ఓ చిన్న మంత్రం ఇది కూడా గడిచి పోతుంది ...ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలా సారులు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురయ్యిన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి . అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రం లో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగి పోవటం లో అర్ధం లేదుకదా   నీకు నీవే శత్రువు కావద్దు ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు ..నేనింతే ..అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువు తో పోరాడలేము , గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి .అంతే సగం బాధ తీరిపోతుంది. చాలా సారులు జరిగిన విషయాన్నే తలుచుకు , తలుచుకు బాధ పడుతుంటారు . దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.   చుట్టూ వైఫైలా వుండాలి మంచి ఆలోచనలతో , ఉత్సాహం గా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వబావం మూలం గా మనం కొని తెచ్చు కునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.   ప్రతి చిన్న విజయం విలువైనదే ప్రతి రోజు చిన్నదో , పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే.ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది.  
  ఇటీవల నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత భవిష్యత్తు ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  అయితే కవిత హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లో కవిత ఓటమితో కేసీఆర్ నైరాశ్యంలో కూరుకుపోయారట. తన కూతురును ఎలాగైనా సరే.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొదట ఆమెను రాజ్యసభకు పంపిద్దామనుకున్నారట. కానీ, అలా దొడ్డిదారిన వెళితే విశ్వసనీయత ఉండదన్న భావనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారట. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తేనే సత్తా చాటుకున్నట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కవితను హుజూర్ నగర్ ఎమ్మెల్యే నిలపాలని భావిస్తున్నారట. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. దీంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కవితను నిలబెట్టాలని, ఆమెను గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అంతేకాదు కవిత గెలవగానే, మహిళా కోటాలో మంత్రి పదవి కూడా ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
  కొందరు బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతుంటే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే ఓ ఉద్యోగి మాత్రం ఖాతాదారులు, రైతుల‌కు కుచ్చుటోపి పెట్టాడు. కోటి రూపాయ‌ల‌కు పైగా విలువైన బంగారాన్ని దోచుకుని ప‌రార‌య్యాడు. కృష్ణా జిల్లాలోని కంచిక‌చెర్ల మండ‌లం ప‌రిటాల ఎస్‌బీఐలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ ఉద్యోగి పేరు శ్రీనివాస్‌. ప‌రిటాల బ్రాంచ్ ఎస్‌బీఐలో క్యాషియ‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రుణాల కోసం బ్యాంకుకు వ‌చ్చే రైతులు, నిర‌క్ష‌రాస్యులైన ఖాతాదారుల‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. బ్యాంకులో 700 మంది ఖాతాదారులు రుణాలు తీసుకోగా వారిలో 40 మందికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను సేక‌రించాడు. వారికి తెలియకుండా తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని మ‌రోసారి కొత్త‌గా పెట్టినట్టు ఖాతాల‌ను సృష్టించాడు. రైతులు, ఇత‌ర ఖాతాదారులు బ్యాంకులో తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని డ‌బుల్ ఎంట్రీ చేశాడు. పాత బంగారాన్నే కొత్త‌గా డిపాజిట్ చేసిన‌ట్లు రికార్డుల‌ను సృష్టించాడు. బంగారాన్ని కూడా తాను త‌స్క‌రించేవాడు. ఖాతాదారులకు చెందిన సుమారు కోటి రూపాయ‌ల రుణ మొత్తాన్ని మెక్కేసి, పరారైన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం బయటపడటంతో బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇప్ప‌టికిప్పుడు తమ బంగారాన్ని చూపించాలంటూ వారు ప‌ట్టుబ‌ట్టారు. బ్యాంక్ మేనేజర్ బంగారాన్ని కొంతమందికి చూపిస్తున్నారు. మ‌రి కొంత‌మంది ఖాతాదారులు రుణ మొత్తాన్ని బ్యాంకుకు కడుతున్నారు. త‌మ బంగారాన్ని వెన‌క్కి ఇవ్వమని అడుగుతున్నారు. బ్యాంకు మేనేజర్ ఖాతాదారులకు హామీ ఇస్తూ మీరు తీసుకున్న లోన్ మాత్రమే కట్టండని సర్ది చెప్పి ఖాతాదారులను శాంతింపజేశారు.
  ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి.. పార్టీ సీనియర్ నేతలు మరింత షాక్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో తాము.. వైసీపీని ఎదుర్కోలేమన్న భావనతో కొందరు నేతలు బీజేపీ పంచన చేరాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వర్గపోరు, ముఠాకక్షలు ఎక్కువగా ఉన్న రాయలసీమలోని టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారట. వారు సామాన్య నేతలు కూడా కాదు. రాయలసీమ టీడీపీకి ఐకాన్‌గా నిలిచిన దివంగత పరిటాల రవి కుటుంబం ఇప్పుడు బీజేపీ అండ కావాలని కోరుకుంటోందని ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబానికి శత్రువులుగా పేరొందిన వారు.. ఈ ఎన్నికల్లో గెలిచారని, వారితో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, దాంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే ప్రాణముప్పు ఉండదనే భావన వారిలో ఉందట. గతంలో పరిటాల రవి హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుని విదేశాలకు వెళ్లాలని ఆయన సన్నిహితులు కొందరు సూచించినా.. ఆయన లెక్క చేయలేదని, చివరకు.. ఆ నిర్లక్ష్యం ఆయన ప్రాణాలను తీసిందని, ఈసారి మాత్రం అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే భావనతో.. పార్టీ మారితే ఎలా ఉంటుందనే చర్చ పరిటాల కుటుంబంలో జరుగుతుందని ఆ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి గెలిచిన పరిటాల సునీత తరువాత ఐదేళ్లు మంత్రిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కుమారుడు శ్రీరామ్ ని బరిలో నిలిపారు. కానీ శ్రీరామ్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉంటే కుమారునికి హాని జరుగుతుందనే ఆందోళనతో.. పరిటాల కుటుంబీకులు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిలో నిజమెంతో కానీ.. ప్రస్తుతం రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్‌ కత్తులతో వీరవిహారం చేయడం గమనిస్తే.. అటువంటి చర్యలు జరిగే ప్రమాదం ఉందనే భావన ప్రజల్లో ఉంది. ఎన్నికల్లో గెలిచిన తోపుదుర్తి బ్రదర్స్‌ వేటకొడవళ్లతో నియోజకవర్గంలో ఊరేగింపులు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఈ ఐదేళ్లు ఎలా గడపాలన్న ఆందోళన కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది.
  పని ఒత్తిడి.. మారుతున్న జీవనశైలి.. కాలుష్యం కారణంగా చాలా చిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తుంది. దీంతో కళ్ల జోళ్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికమవుతోంది. అయితే కంటికి బలాన్నిచ్చే ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.. ఆ ఆహారం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?time_continue=6&v=ypQMGG7G9Yc      
కొందరు చేయి పైకెత్తితే చాలు భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతారు. మరికొందరు నాలుగడుగులు వేయగానే నడుము నొప్పంటూ కూర్చుండిపోతారు. ఇక మోకాలి నొప్పి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అది ఇంటింటి బాధగా మారిపోయింది. అందరు మనుషుల్లోనూ ఒకే తీరున ఈ బాధలు ఎందుకు కనిపిస్తున్నాయి? మనిషి పరిణామక్రమానికీ, ఈ నొప్పులకీ మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అన్న అనుమానం వచ్చింది ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులకి. దాంతో ఆ నొప్పుల వెనుక ఉన్న రహస్యం కాస్తా బయటపడిపోయింది.   నాలుగు నుంచి రెండుకి మనిషి కూడా మొదటి మిగతా జంతువులగానే నాలుగుకాళ్ల మీదే నడిచేవాడన్న విషయం తెలిసిందే! క్రమేపీ రెండుకాళ్ల మీద నిలబడటంతో అతని మేధస్సు కూడా పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇలా రెండు కాళ్ల మీద నడిచే క్రమంలో అతని కీళ్ల మధ్య కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులను తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 300 అస్థిపంజరాలను గమనించారు. వీటిలో 40 కోట్ల సంవత్సరాల నాటి మనుషుల ఎముకలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ సంస్థ సేకరించిన ఈ పురాతన ఎముకలకి సంబంధించిన స్కాన్లను పరిశీలించి ఆనాటికీ, ఈనాటికీ మన ఎముకల తీరులో వచ్చిన మార్పులను పోల్చి చూశారు.   బోలెడు మార్పులు మనిషి నిలబడి నడిచేటప్పుడు మరింత బరువుని మోసేందుకు వీలుగా, అతని తుంటి ఎముక దిగువ భాగం కాస్త వెడల్పుగా మారిందట. దీని వలన అది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఆ కారణంగానే మనలో ఆర్థ్రైటిస్ సమస్యలు తలెత్తుతున్నాయట. ఇక భుజం కీలు దగ్గరేమో దీనికి విరుద్ధమైన మార్పు కనిపించింది. నడిచేటప్పుడు భుజాల మీద భారం తగ్గడం వల్లనో ఏమో... అక్కడి కీలు ఎముక మధ్య ఉన్న ఖాళీ తగ్గిందని తేలింది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే రక్తనాళాలు, కండరాలు నొక్కుకుపోతున్నాయని గమనించారు. చేతిని పైకెత్తగానే ఒక్కసారిగా భుజం కండరాలు విలవిల్లాడిపోవడానికి కారణం ఇదే కావచ్చు. మనుషుల మోకాళ్లు త్వరగా అరిగిపోవడానికి కూడా పరిణామక్రమంలో వచ్చిన ఈ మార్పులే కారణమని బయటపడింది.   ఆరంభం మాత్రమే అసలే పరిణామక్రమంతో మన శరీరంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని బాధపడుతుంటే... ఇది మున్ముందు మరింత తీవ్రం కానుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 4000 ఏళ్ల తరువాత మోకాలు, తుంటి, భుజానికి సంబంధించి మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే తగినంత వ్యాయామం చేయడం, నిటారుగా నడవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లోపాలను కొంతవరకు ఎదుర్కోవచ్చునని సూచిస్తున్నారు.   - నిర్జర.
  నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.