విశ్వరూపం చూపిన కిరణ్ కుమార్

 

ఎప్పుడూ సౌమ్యంగా, మృదువుగా మాట్లాడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నిన్న సమర దీక్ష అనంతరం కేసీర్ జాతీయనేతలయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగుల గురించి చాలా చులకనగా మాట్లాడటంతో, మొట్ట మొదటిసారిగా తీవ్ర స్వరంతో కేసీర్ ను హెచ్చరించారు. ఈ రోజు డిప్యుటీ సీయం రాజానరసింహతో సహా మొత్తం తెలంగాణా మంత్రులందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కేసీర్ పై తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు.

 

“దేశ ప్రజలందరూ గౌరవించే జాతీయ నాయకులయిన జవహార్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, సోనియాగాంధీలను చులకన చేస్తూ నిన్న మీరు మాట్లాడిన తీరుగానీ, భాషగానీ చాలా నీచంగా ఉన్నాయి. మీ బాష మీ(కేసీర్) సంస్కృతికి అద్దం పడుతోంది. మీ భాషను వింటే మాకే కాదు ప్రజలందరికీ, చివరికి తెలంగాణా ప్రజలకి సైతం అసహ్యం కలుగుతోంది. జాతీయ నేతలయిన వారెక్కడ? మీరెక్కడ? మీ స్థాయేమిటి? మీరు మాట్లాడుతున్న నాయకుల స్థాయేమిటి? మీరొక ప్రాంతీయ పార్టీకి, అందునా రాష్ట్రంలో ఒక ప్రాంటానికి మాత్రమే ప్రాతినిద్యంవహించే ఒక చిన్నపార్టీకి చెందిన ఒక చిన్న నాయకుడివి మాత్రమే. పెద్దలగురించి మాట్లాడే ముందు అసలు మన స్థాయి ఏమిటని ఆలోచించనవసరం లేదా? అటువంటి మహనీయులను విమర్శించినంత మాత్రాన్న మీరేమి మహానీయులయిపోరని తెలుసుకోండి. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి అది మీ మొహం మీదనే పడుతుందని తెలుసుకోండి.”

 

“యావత్ ప్రపంచం చేత మేధావిగా కీర్తింపబడుతున్న ప్రధాని డా.మన్మోహన్ సింగును కించపరుస్తూ మాట్లాడిన మీ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి పెద్దమనిషి పేరు ప్రస్తావించే హక్కు కూడా మీకు లేదు.”

 

“ఇక్కడ కూర్చొన్న ప్రతీ తెలంగాణా శాసన సభ్యుడు, మంత్రీ, పార్లమెంటు సభ్యుడు కూడా తన స్వశక్తితో గెలిచేరే తప్ప మీ దయతో గెలవలేదని తెలుసుకోండి. మా ప్రభుత్వాన్ని పడగోడతామని మీరు విసిరిన సవాలును మేము స్వీకరిస్తున్నాము. మీరు వెంటనే అ పని చేసి చూపించమని ప్రతిసవాలు కూడా చేస్తున్నానిప్పుడు. మా ప్రభుత్వం మీ దయతోనో లేదా మీ పార్టీ దయతోనో మనుగడ సాగించడంలేదని గుర్తుంచుకోండి. గత ఎన్నికలలో మీరు ఎంత మందితో చేతులు కలిపినా కూడా కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగా, జాతీయ పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఒంటిగా 50 సీట్లను గెలుచుకొని తన సత్తా నిరూపించుకొంది.”

 

“సున్నితమయిన, క్లిష్టమయిన తెలంగాణా అంశం పరిష్కరించాలంటే మీరు చెప్పినంత తేలిక కాదు. దేశాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీగా అటు తెలంగాణా, ఇటు ఆంధ్రా ప్రాంతాల ప్రజలను సమ దృష్టితో చూస్తోంది గనుకనే సున్నితమయిన ఈ సమస్యని అందరికి ఆమోదయోగ్యమయిన రీతిలో పరిష్కరించాలని మా పార్టీ కోరుకొంటోంది. అందుకు మరి కొంత సమయం అడగడం తప్పా? ఒక క్లిష్టమయిన సమస్యని పరిష్కరించే ముందు దాని వల్ల ప్రభావితులయ్యే వారందరితో మాట్లాడాలనుకోవడం ఏరకంగా తప్పు అవుతుంది?”

 

“ఇంతవరకు మీ ప్రవర్తనతో, నీచమయిన మీ మాటలతో మమ్మలిని, మా మంత్రులను, మా నాయకులను ఎంతగా అవమానిస్తున్నా కూడా ఓపిగ్గా సహిస్తున్నాము. గానీ, ఇప్పుడు ఏకంగా జాతీయ నాయకులయినే తూలనాడేవరకు వెళ్ళిపోయారు మీరు. ఇక చట్టం తన పని తానూ చేసుకు పోతుంది. మా ప్రభుత్వం ఆ విషయంలో ఇక జోక్యం చేసుకోబోదు.”

 

బహుశః కిరణ్ కుమార్ రెడ్డి తన జీవితంలో ఇంత తీవ్ర స్థాయిలో మాట్లాడటం ఇదే మొదటిసారయి ఉండవచ్చును. ఆయన అంత కోపంగా, పరుషంగా మాట్లాడటం అయన సహచర మంత్రులను సైతం విస్తుపోయేలా చేసింది. నిన్న కేసీర్ తీవ్రపదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో తెలంగాణా మంత్రులను, శాసన సభ్యులను, పార్లమెంటు సభ్యులను ఈసడించిన తీరుకి డీలా పడిపోయిన తన మంత్రి వర్గ సహచరులను తిరిగి పునరుత్తేజపరిచి కేసీర్ కు దీటుగా నిలబడేందుకే కిరణ్ కుమార్ రెడ్డి తన తెలంగాణా మంత్రులందరి సమక్షంలో ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చును.

 

ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో కేసీర్ ను ఎదిరించి నిలవడమే గాకుండా, అతని తెలంగాణావాదనని సైతం దైర్యంగా తిరస్కరిస్తున్న ఒకే ఒక్క తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) మాత్రమే. మిగిలిన వారందరూ కూడా అటు కేంద్రం నుండి సహకారం లేక, ఇటు రాష్ట్రంలోనూ తమకి అండగా నిలబడే నాధుడు లేక కేసీర్ నోటికి బలవుతున్నవారే. అందువల్ల, అటువంటి కాంగ్రెస్ తెలంగాణావాదులకు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కొండంత బలం ఇస్తాయని చెప్పవచ్చును. తద్వారా అయన తెలంగాణా మంత్రులకు బాసటగా నిలిఛి వారి విశ్వాసం కూడా పొందగలుగుతారని ఖచ్చితంగా చెప్పవచ్చును.