టార్గెట్ సీయం కిరణ్ కుమార్ రెడ్డి

 

ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ తెరాసపై ఏవిధంగా ప్రభావం చూపిందో అదేవిధంగా వైకాపాపై కూడా బాగా ప్రభావం చూపింది. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు అంతకు మూడు రెట్లు ఉండే వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ సభలో ఒక్కరు కూడా వైకాపా చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటాన్ని మెచ్చుకోలేదు, కనీసం గుర్తించను కూడా లేదు. పైగా ఈ రధ యాత్రలు, పాదయాత్రల భాగోతాలు కట్టిబెట్టి ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించమని హెచ్చరికలు కూడా జారీ చేసారు.

 

ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం సమైక్యాంధ్ర రధసారధిగా గుర్తించి పొగడ్తలు కురిపించారు. ఇది సహజంగానే వైకాపాకు జీర్ణం కావడం చాలా కష్టం. సమైక్యాంధ్ర కోసం అందరి కంటే ముందుగా రాజీనామాలు చేసి, ఆ తరువాత తెలంగాణాను త్యాగం చేసి, ఆమరణ దీక్షలు, బస్సుయాత్రలు చేస్తుంటే, దానిని ఏపీఎన్జీవోల సభ మెచ్చుకొనకపోగా, తీవ్రంగా తప్పుపట్టడం సహించలేకపోయింది. దాదాపు ఏడాదిగా ఎండనకా వాననకా రోడ్లపై తిరిగి కష్టపడినప్పటికీ తమకి దక్కని ఫలితం, ఏసీ గదిలో కూర్చొని కేవలం రెండంటే రెండే రెండు మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఖ్యాతిని అమాంతం స్వంతం చేసుకోవడం వైకాపాకు బాధ కలిగించడం సహజమే.

 

ఇక, ఏపీఎన్జీవోల దన్నుతో ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగినట్లయితే, తాము ఇంతకాలంగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వైకాపా భయపడుతోంది. సీమాంధ్రలో పట్టు సాధించడానికి తెలంగాణాను బలిపెట్టడం వలన ఇప్పుడు అక్కడ కాలుమోపలేని పరిస్థితి. కానీ తెదేపా మాత్రం ఇప్పటికీ తెలంగాణాను చేజారకుండా జాగ్రత్త పడుటం చూసి, ఈ విషయంలో తొందర పడ్డామా? అని ఆలోచనలో పడింది. కానీ ఇప్పటికే అక్కడ జరుగవలసిన నష్టం జరిగిపోయింది.

 

సీమాంధ్రపై ఆధిపత్యం సంపాదించేందుకు తెదేపాతో పోటీ పడుతుంటే, ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్యాంధ్ర హీరోగా ముద్రతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేసులో ప్రవేశిస్తే సీమాంధ్ర కూడా చేయి జారితే, అప్పుడు తమ పరిస్థితి ఏమిటనేది వైకాపా ఆందోళన చెందుతోంది. బహుశః అందుకే షర్మిల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తన దాడి తీవ్ర తరం చేసారని భావించవచ్చును.