సమన్యాయం నుండి సమైక్యం దాకా

 

సమన్యాయం కోరుతూ అందరికంటే ముందుగా రాజీనామాలు చేసిన వైకాపా తొలుత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పేందుకు సంకోచించినప్పటికీ, గత నెలరోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను చూసి, ఇక సమైక్యవాదానికి డోకా లేదని పూర్తిగా నమ్మకం కలిగిన తరువాత నేడు షర్మిల ‘సమైక్య శంఖారవం’తో వైకాపా పూర్తి సమైక్యవాద పార్టీగా మార్పు చెందింది. తమ రాజీనామాలతో ప్రజలను, పార్టీలను సమైక్య దిశగా కదిలేలా చేసిన వైకాపా, ఇప్పుడు ఆ ప్రజల అభీష్టం మేరకే సమైక్య పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పుకొంటోంది.

 

తెలంగాణాలో ఎటూ తనకిక పనిలేదు కనుక, అక్కడ పార్టీని బ్రతికించుకోవాలని తిప్పలు పడుతున్న తెదేపాను, సరిగ్గా ఆ బలహీనతమీదనే సమైక్య దెబ్బతీయాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఇంత కాలం యావత్ తెలుగు ప్రజల గురించి పోరాడుతున్నట్లు చెప్పుకొన్న వైకాపా, ఇప్పుడు కేవలం సీమంధ్ర ప్రజల సంక్షేమం, హైదరాబాదులో నివసిస్తున్నవారి భద్రత గురించి మాత్రమే మాట్లాడుతోంది.

 

ఇంతవరకు విస్వసనీయతకు పేటెంట్ హక్కులు తమవేనని వాదించిన వైకాపా, తెలంగాణాలో తన నేతలకు, అక్కడి ప్రజలకు హ్యండిచ్చి బయటపడిన తరువాత ఇప్పుడు విశ్వసనీయతను వదిలిపెట్టి, సమైక్యంపై పూర్తి పేటెంట్ హక్కులు కోసం చాల కృషి చేస్తోంది. ఈ శ్రమంతా అంతిమంగా ఓట్ల రూపంలో మార్చుకోవడానికేనని అందరికీ తెలుసు.

 

ఈ రోజు హోంమంత్రి షిండే ‘ఇరవై రోజుల్లో తెలంగాణా నోట్’ సిద్డంచేయబోతున్నట్లు చెప్పిన తరువాత, ఇక రాష్ట్ర విభజన అనివార్యమని అర్ధం అవుతోంది. అటువంటప్పుడు వైకాపా ఇంకా సమైక్యం గురించి మాట్లాడటం కంటే ‘సమన్యాయం’ గురించి మాట్లాడటం సబబుగా ఉంటుంది. సమైక్యం ద్వారా సీమంధ్రపై పేటెంట్ హక్కులు పొందాలని తపిస్తున్నవైకాపా, విభజన అనివార్యం గనుక, ఇప్పుడు సీమంధ్రకు ఏవిధంగా న్యాయం జరగాలని కోరుకొంటోందో నిర్దిష్టంగా వివరిస్తే బాగుంటుంది.

 

తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలని తిప్పలుపడుతున్న తెదేపా ఆవిధంగా చెప్పే సాహసం ఎలాగూ చేయలేదు గనుక, ఆ అవకాశం ఉన్న వైకాపా నిర్దిష్టంగా సీమంధ్ర కోసం ఆశిస్తున్నప్రయోజనాల గురించి దైర్యంగా ప్రకటించగలిగితే, సీమంధ్ర ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిన కారణంగా ఆ పార్టీ లాభపడవచ్చును. అలా కాకుండా నీటి సమస్యలు, ఉద్యోగాలు, ఆదాయం, రాజధానిలో భద్రత అంటూ గాలిలో గీతలు గీస్తూపోతే, విభజన వల్ల వచ్చే సమస్యలపట్ల ఆ పార్టీకి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు అవుతుంది.