ఏపీ బంద్ కి మిశ్రమ స్పందన

 

ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు వైకాపా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది. ఈ బంద్ విజయవంతం చేయడానికి వైకాపా నేతలు, కార్యకర్తలు తెల్లవారుజాము నుండే బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను కదలనీయకుండా అడ్డుకొంటున్నారు. ఈ బంద్ కి రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు వైకాపా చెప్పుకొంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. అలాగే నటుడు శివాజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి దాని అనుబంధ ప్రజా సంఘాలు కూడా ఈ బంద్ కి మద్దతు తెలపకపోవడం విశేషం. వామపక్షాలు, మరికొన్ని ప్రజా సంఘాలు ఈ బంద్ కి మద్దతు ఇస్తున్నాయి. వైకాపాకి పట్టున్న ప్రాంతాలలో బంద్ సంపూర్ణంగానే సాగుతున్నప్పటికీ మిగిలిన ప్రాంతాలలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈరోజు రాఖీ పండుగ కావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో అన్ని జిల్లాలలో ముఖ్యమయిన ప్రాంతాలలో పోలీసు రక్షణతో బస్సులు నడిపిస్తున్నారు.