వైకాపాకు కష్ట కాలం!

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దిల్లీలో అలా హడావుడి చేసి ఇలా తిరిగి వచ్చారో లేదో... తెలంగాణలో తన పార్టీ ఖాళీ అవనున్న విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. తెలంగాణలో వైకాపాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఒకే ఒక్క ఎంపీ తెరాసలోకి మారడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. అటు పక్క ఆంధ్రాలో పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది! ఇందులో జగన్ స్వయంకృతం కూడా కొంత లేకపోలేదు.

 

సాక్షాత్తూ వైకాపా వెబ్‌సైట్‌ ప్రకారం ఆంధ్రాలో వారి ఎమ్మెల్యేల బలం 51. అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు... గడచిన రెండేళ్లలో దాదాపు 16 మంది ప్రతినిధులు పార్టీ నుంచి జారుకున్నారు. రోజూ ఉదయాన్నే లేచి ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు గట్టు దాటనున్నారు అని తెలుసుకోవాల్సిన దుస్థితిలోకి అక్కడి వైకాపా జారిపోయింది. ఇతర  నేతలను తన పార్టీ వైపు లాక్కొని, నిదానంగా ప్రతిపక్షాలను ఖాళీ చేసే యుక్తి జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ కాలం నుంచే ఊపందుకుందని చెబుతారు. కాకపోతే ఇప్పుడు వైఎస్‌ఆర్‌ తనయుడే ఆ తంత్రానికి చిక్కుకోవడం ఓ వైచిత్రి.

 

పార్టీలో దాదాపు నాలుగో వంతు ఖాళీ అయిపోవడంతో కంగారుపడ్డ జగన్‌ హుటాహుటిన దిల్లీకి చేరుకున్నారు. ‘ఎంపరర్ ఆఫ్‌ కరప్షన్‌’ పేరుతో చంద్రబాబు మీద ఓ చిరుపుస్తకాన్ని ముద్రించి అక్కడి కనిపించినవారందరికీ పంచిపెట్టారు. పనిలో పనిగా తన ఎమ్మెల్యేలు అందరూ పసుపురంగు పులుముకుంటున్న విషయాన్ని కూడా ఏకరవు పెట్టారు. అసలు పార్టీని ఫిరాయించినవారి మీద స్పీకరు కాకుండా ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్‌ చేశారు. కానీ జగన్‌ సూచనలను దిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వయంగా పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి ఉన్న జగన్‌, చంద్రబాబు మీద ఆరోపణ చేయడంతో దిల్లీగణం లైట్ తీసుకున్నారు. ఇక పార్టీ ఫిరాయింపు గురించి కూడా బీజేపీ నేతలు అంత పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఉత్తరాఖండ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి వ్యవహారాలతోనే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

 

దిల్లీ మంత్రాంగం ఫలించకపోవడంతో ఉసూరుమంటూ తిరిగివచ్చిన జగన్‌కు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో మరికొందరు సభ్యలు గోడ దూకేందుకు సిద్ధంగా కనిపించారు. పైగా వైకాపాలో ఏకైక పెద్దదిక్కుగా ఉన్న మైసూరారెడ్డి కూడా వైకాపాను వీడటమే కాకుండా, వీడ్కోలు సమావేశంలో జగన్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆంధ్రాలో వైకాపాకు ఛర్మిష్మాను అందించే నేతలు కరువైపోయారు. ప్రతిపక్ష సభ్యులు అధికారం కోసం వలసబాట పట్టడం కొత్తేమీ కాదు. ఇందుకు జగన్‌ ఒంటెద్దు పోకడలు, తన కంటే ఎత్తుగా మరో నేత కనిపించకూడదన్న పంతం ఫిరాయింపులకు కలిసివచ్చాయి. దానికి తోడు జగన్ ఎప్పుడు ఏ వైఖరిని ఎందుకు అవలంబిస్తారో తెలియని అయోమయం ఎలాగూ ఉంది. తెలంగాణలో వైకాపా తీరే ఇందుకు ఉదాహరణ! తొలుత అక్కడ వైకాపా, తెరాసతో వైరం ఎందుకన్నట్లు సుతిమెత్తటి ఆరోపణలతో సరిపుచ్చుకునేది. ఒకదశలో తెలంగాణలో వైకాపా, తెరాస మిత్రపక్షాలేమో అన్నంత అనుమానం కలిగేది. కానీ ఇంతలోనే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష, పాలేరు ఉప ఎన్నకలలో కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో... తెరాస తన ఫిరాయింపు తంత్రాన్ని వైకాపు వైపు పారించింది. ఆ పార్టీకి ఉన్న ఇద్దరంటే ఇద్దరు ప్రజాప్రతినిధిలను తన వైపుకి మళ్లించుకుంది. ప్రస్తుతానికి తెలంగాణలో వైకాపా తన పార్టీని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో వైకాపాకు బలమైన క్యాడర్‌ నిర్మించగల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీకి దూరం కావడం నిజంగా జగన్‌కు శరాఘాతమే! తాజా పరిణామంతో తెలంగాణలో వైకాపాకు వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోయింది.

 

ఆంధ్రాలో పరిస్థితి కూడా వైకాపాకు ఏమంత స్థిరంగా కనిపించడం లేదు. అక్కడ ప్రత్యేక హోదా, కరువు, నిరుద్యోగం... లాంటి నానారకాల సమస్యలు ఉన్నా కూడా జగన్‌ వాటి మీద పోరాటం చేయకపోవడం విచిత్రం. అది మానేసి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులోను, ఫిరాయింపులకు వ్యతిరేకంగా దిల్లీలో ఎందుకు పోరాడుతున్నారో ఎవరికీ కొరుకుడపడని అంశం. అసలు సమస్యలని గాలికొదిలేసి కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యలను సృష్టించడం , అరకొర అవినీతి ఆరోపణలు చేయడంతో వైకాపా నిబద్ధత మీదే ప్రశ్నలు చెలరేగాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైకాపా తరచూ వైఫల్యం చెందుతోందన్నది మరో ఆరోపణ. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశ సమయంలో వైకాపా తీరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆ సమయంలో వైకాపా తీసుకున్న అవిశ్వాస తీర్మానం వంటి నిర్ణయాలు ఆ పార్టీనే ఇరుకున పెట్టాయి.

 

ఇప్పటికైనా వైకాపాకు సమయం మించిపోయింది లేదు. ఆ పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికైనా బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. అటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలో పోరాడవలసిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. వైకాపాలోకి చేరేందుకు దాసరి వంటి నేతలూ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విభజన విషయంలో కాంగ్రెస్‌ అంటే గుర్రుగానే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపుతున్న బీజేపీ అన్నా మండిపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తెదెపాకు ప్రత్యామ్నాయంగా ఒక్క వైకాపానే కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వైకాపా తాను ప్రజల పక్షం అని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణలో తెరాసది ఏకఛత్రాధిపత్యంలో మిగిలిపోయినట్లుగా, ఆంధ్రాలో తెదెపా దెబ్బకి కునారిల్లక తప్పదు.