శాసనసభకి జగన్మోహన్ రెడ్డి శలవు!

 

శాసనసభ సమావేశాలలో ఒకసారి ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తే మరొకసారి ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోతుంటారు. ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా అరిటాకుకే నష్టం అంటారు. కానీ ప్రతిపక్షాలకి ఆ సూత్రం వర్తించదనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసినా, ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోయినా తప్పంతా అధికార పార్టీదేనని వాదిస్తుంటాయి. మొన్న వైకాపా సభ్యులందరినీ సభ నుంచి రెండు గంటల పాటు సస్పెండ్ చేసినపుడు అది చాలా అన్యాయమని వాదించారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని జగన్ చాలా ఆవేదన పడిపోయారు. ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా? కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చిస్తారా? లేదా అని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ని ప్రశ్నించారు. ఆయన నిరాకరించడంతో “అయితే ఇక శలవు” అంటూ జగన్ తన ఎమ్మెల్యేలతో సహా సభను బహిష్కరించి బయటకి వెళ్ళిపోయారు.

 

సభ నిర్వహణకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందరూ దాని ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. కానీ శాసనసభలో కార్యక్రమాలు తను ఆశించినట్లు జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకొంటున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం ఆయనకీ తెలుసు. సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ అందుకు కారణం అధికార పార్టీ నిరంకుశ వైఖరేనని ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి సభను తమకు ఇష్టం వచ్చినట్లు నడిపించుకొంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే కాల్ మనీ వ్యవహారంలో సభలో జగన్ గంటల తరబడి ధాటిగా మాట్లాడిన విషయం మరిచిపోయినట్లున్నారు.

 

ఈరోజు శాసనసభలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విదేశీ మద్యం సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, మెట్రో పాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బిల్లులపై చర్చ జరుగబోతోంది. ఆ చర్చలో పాల్గొని వాటిలో లోటుపాట్లను ఎత్తి చూపించవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా మీద ఉంది. కానీ ఆ చర్చలో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయి తిరిగి ప్రభుత్వాన్నే నిందిస్తోంది.

 

ఇంతకు ముందు సమావేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే తొందరపాటు ప్రదర్శించి సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ఆవిధంగా చేసినందుకు ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో మళ్ళీ సభకు తిరిగి వచ్చేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం. కనుక తన జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకే సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారని అప్పుడే మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనుక మళ్ళీ రేపు సభకు తిరిగి వస్తారేమో?

 

తెదేపా ప్రభుత్వం ఈసారి శాసనసభ సమావేశాలను కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకొన్నప్పుడు వైకాపా దానిని తప్పు పట్టింది. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరుగవలసి ఉండగా కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడం సరికాదని, కనీసం మరో వారం రోజులయినా పొడిగించాలని డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఈ ఐదు రోజుల సమావేశాల్లోనే ఒకరోజు సస్పెండయ్యి బయటకు వెళ్ళగా, ఈరోజు వైకాపాయే సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయింది. అయితే ఈ ఒక్కరోజుకే సభను బహిష్కరించి వెళ్ళిపోతున్నారా లేక రేపు శాసనసభ సమావేశాలు ముగిసేవరకు బహిష్కరించబోతున్నారో జగన్ చెప్పలేదు. కనుక వైకాపా సభ్యులు రేపు సభకు వస్తారో రారో తెలియదు. మరి ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు శాసనసభ సమావేశాల నిర్వహణ కోసం వైకాపా పట్టుబట్టడం దేనికో?