ఈ తపన అంతా జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనా?

 

వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖ నుండి పోటీ చేసి ఓడిపోవడం ఆ పార్టీకి తీరని అప్రదిష్టగా మిగిలింది. ఆ తరువాత విశాఖకు చెందిన దాడి వీరభద్ర రావు, కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి, చొక్కాకుల వెంకట రావు తదితర సీనియర్ నేతలు పార్టీని వీడిపోయారు. త్వరలో మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయెందుకు మూట ముల్లె సర్దుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇటువంటి సమయంలో విశాఖ నగర మునిసిపల్ కార్పోరేషన్ (జి.వి.యం.సి.) ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వెంటనే అప్రమత్తమయిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ధర్నాకు కూర్చొని బలప్రదర్శన చేసారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలు అందరూ కలిసి జనసమీకరణ చేయడంతో భారీగానే జనం వచ్చేరు. కనుక జగన్ చేసిన ధర్నా విజయవంతమయిందనే ఆ పార్టీ చెప్పుకొంది. అంతకు ముందు హూద్ హూద్ తుఫాను బాధితులకు న్యాయం జరగలేదంటూ ఓ పంట రుణాల మాఫీతో కలిపి ఒక రీమిక్స్ ధర్నా కూడా చేసారు.

 

హూద్ హూద్ తుఫాను బాధితులకు కేంద్రం ప్రకటించిన వెయ్యి కోట్లు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని, నిర్లక్ష్యం చూపుతోందంటూ జగన్ స్వయంగా డిల్లీ వెళ్లి హోంమంత్రిని, ఆర్ధిక మంత్రిని కలిసి వారి చేతిలో విజ్ఞప్తి పత్రాలు పెట్టి చక్కా వచ్చారు. కానీ అప్పటికే కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. అయితే నేటికీ మిగిలిన రూ.450 కోట్లు ఇంకా విడుదల చేయలేదు. కానీ జగన్ మళ్ళీ డిల్లీ వెళ్ళలేదు ఎందుకో? బహుశః జి.వి.యం.సి.ఎన్నికల తేదీలు ఖరారు అయిన తరువాత వెళ్ళడం వలన ఎక్కువ లాభం ఉంటుందని ఆగేరేమో మరి తెలియదు.

 

ఉంగరం పడిపోయిన చోటే వెతుకోవలసి ఉంటుంది కనుక, జగన్ కూడా ఓడిపోయినా చోటే గెలిచి పోయిన పరువు తిరిగి సంపాదించుకోవాలనే తాపత్రయంతో జి.వి.యం.సి.ఎన్నికల కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లున్నారు. బహుశః అందుకే ఆయన హూద్ హూద్ భాదితుల కోసం అంతగా బాధపడిపోతున్నారేమో. లేకుంటే ఎవరో వాలంటీర్లు ఎక్కడో ఒక చోట విసిరేసిన పులిహోర పొట్లాలు పట్టుకొని అసెంబ్లీలో అంత రచ్చ రచ్చ చేసేవారు కాదు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించేవారు కాదేమో?

 

ఆయన పదేపదే పులిహోర పొట్లాల గురించి ప్రస్తావిస్తూ ఎందుకు బాధపడిపోతున్నారంటే, చంద్రబాబు నాయుడు హూద్ హూద్ తుఫాను సమయంలో విశాఖలో వారం రోజులు తిష్టవేసి స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి ప్రజలలో చాలా మంచి పేరు తెచ్చుకొన్నారు. కనుక ఆయనపై బురద జల్లితే దాని వల్ల తన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించి, అందుకోసమే ఈ పాచిపోయిన పులిహోర పొట్లాలు పట్టుకొన్నట్లున్నారు. “కుక్కలకు విసిరేసినట్లుగా ప్రభుత్వం పులిహోర పొట్లాలు విసిరేసి వైజాగ్ ప్రజలను అవమానించారని” పదేపదే చెపుతూ చాలా బాధపడిపోతున్నారు. తద్వారా విశాఖ ప్రజల మనసులను గెలుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లున్నారు.

 

అయితే పులిహోర పొట్లాల గురించి ఇంతగా బాధపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఏదో గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్ పెట్టుకొనేందుకు బల్ల లేకపోతే అప్పుడు తన సెక్యురిటీ గార్డునే వంగోబెట్టి అతని వీపునే బల్లగా చేసుకొని అతని వీపు మైకు పెట్టి ప్రసంగించినప్పుడు, అది అవమానకరంగా భావించలేదు. చేసిన తప్పును ఒప్పుకోకుండా ‘చెయ్యి నొప్పి..వేలు నొప్పి అందుకే తప్పలేదు మరి’ అంటూ నిసిగ్గుగా వైకాపా నేతలు సమర్ధించుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరో వాలంటీర్ ఎక్కడో ఒకచోట మీదకు ఎగబడుతున్న జనాలకు అందించలేక ప్యాకెట్లు విసిరేస్తే దానిని పట్టుకొని ఇంతగా చిందులు ఎందుకు వేస్తున్నారు? అంటే జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనని చెప్పక తప్పదు.

 

ఇదేదో బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతున్నట్లు అనిపిస్తున్నప్పటికీ, విశాఖ ప్రజలను ఆకట్టుకోవడానికి జగన్ పడుతున్న ఈ ఆరాటమంతా చూస్తుంటే జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనని అర్ధమవుతుంది. ఇదివరకు సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినట్లే, ఇప్పుడు జి.వి.యం.సి.ఎన్నికల కోసం హూద్..హూద్...పులిహోర..హూద్...హూద్..పులిహోర...అనే మంత్రం పటిస్తున్నారు. అయితే ఇటువంటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో ఎన్నికల తరువాతనే తెలుస్తుంది.