ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా..

 

రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని కోరుతూ ఉద్యమిస్తే, వైకాపా అసలు రాష్ట్రవిభజన జరపడానికే వీలులేదని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసింది. ఆనాడు వైకాపా చేప్పట్టిన ఉద్యమం ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగినట్లు కనిపిస్తే, తెదేపా రాష్ట్ర విభజన కోరుకొంటున్నట్లుగా కనబడేది. కానీ నిజానికి తెదేపాయే రాష్ట్రం కలుసుండాలని మనస్పూర్తిగా కోరుకొంటే, వైకాపా రాష్ట్రం విడిపోవడం వలననే ఆంధ్రాలో తను అధికారం సంపాదించగలనని భావించిన సంగతి పెద్ద రహస్యమేమీ కాదు.

 

రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి గ్రహించినందునే తెదేపా వాస్తవిక దృక్పధంతో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరింది. ఇదంతా వైకాపాకు కూడా తెలుసు. కానీ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను దెబ్బతీయడాని కోసం, తాము రాష్ట్రం విడిపోకుండా ఉద్యమిస్తుంటే, తెదేపా రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటోందని ప్రచారం చేసుకొంది. ఒకవేళ వైకాపా నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొని ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణాను విడిచి పెట్టి బయటకువచ్చేసేదే కాదు. ఎలాగూ రాష్ట్రం విడిపోతోంది కనుక ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకోవాలంటే, రెండు రాష్ట్రాలకు సమ న్యాయం అనడం కంటే ప్రజల అభీష్టానికి అనుగుణంగా నలుగురితో నారాయణ అనడమే మంచిదనే ఉద్దేశ్యంతోనే వైకాపా సమైక్య ఉద్యమాలు చేసినమాట వాస్తవం. ఆ సమయంలో తెదేపా దాని అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమయిన ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చును. కానీ ఆయన తుదివరకు కూడా తన నిర్ణయానికే కట్టుబడి ఉంటూ రెండు రాష్ట్రాలలో తన పార్టీని కాపాడుకోగలిగారు. బహుశః ఆయన కనబరిచిన ఆ స్థిత ప్రజ్ఞతే ప్రజలను ఆకట్టుకోందని చెప్పవచ్చును.

 

నిజానికి రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి ఆంద్ర ప్రజలకు కూడా తెలియదనుకోలేము. కానీ విభజన జరిగితే రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందోననే తీవ్ర ఆందోళన, అంతకాలం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతి విడిపోతోందనే ఆవేదన, ఇంకా అనేక ఇతర కారణాల చేత ప్రజలు ఉద్యమించారు. వారి ఆ ఆవేదనని, ఆవేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు వైకాపా సమైక్యఉద్యమాలు చేసింది. ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల వైఖరిని వాటి వెనుక వారి అంతర్యాన్ని ప్రజలు బాగానే అంచనా వేయగలిగారు. అందుకే చిత్తశుద్ధి లేని ఉద్యమాలు చేసిన వైకాపాను ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. చేదునిజాలు మాట్లాడిన తెదేపాకు పట్టం కట్టారు.

 

ఆ తరువాతయినా వైకాపా తన తీరు మార్చుకోలేదని ఆ పార్టీ తీరు గమనిస్తే అర్ధమవుతుంది. అధికారం చేజిక్కించుకోలేక ఆ దుగ్ధతో ప్రభుత్వం చేప్పట్టే ప్రతీ పనికి అడ్డుతగులుతోంది. రాజధాని లేకపోవడం అవమానకరమనే ఆలోచన కూడా లేకుండా రాజధాని నిర్మాణానికి అడుగడునా అడ్డుతగులుతోంది. తీవ్ర ఆర్ధిక సమస్యలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఇస్తూ, పంట రుణాలను మాఫీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలుచేసేందుకు, పనిలోపనిగా తన పార్టీ ఉనికిని కాపాడుకొంటూ, తన ఉనికిని చాటుకొనేందుకు వైకాపా అధినేత జగన్ ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు.

 

అదేవిధంగా తెలంగాణాను విడిచిపెట్టి వచ్చేయడం చాలా పెద్ద పొరపాటనే విషయం గ్రహించిన తరువాత ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో మళ్ళీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా...అన్నట్లుగా చిత్తశుద్ధిలేని ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండబోదు. పైగా అటువంటి ప్రయత్నాల వలన ఆ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న ‘విశ్వసనీయత’ కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చును.