తెలంగాణాలో వైకాపా కోలుకొంటుందా?

 

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటనలో అకస్మాతుగా మరణించిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బయటకి వచ్చి వైకాపా పెట్టిన కొత్తలో సానుభూతి వల్లనయితేనేమి, జగన్ పట్ల ప్రజలకేర్పడిన నమ్మకం వల్లనయితేనేమి, ఆపార్టీకి తెలంగాణాలో కూడా మంచి ఆదరణ కనబడింది. అయితే, తన పార్టీని మరింత బలపరుచుకోవడానికి జగన్ తెలంగాణాలో పర్యటించబోతే, తెరాస ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆయన తెలంగాణాలో అడుగుపెట్టకుండా అడ్డుకోగలిగింది. ఇక తెలంగాణా విషయంలో ఆయన స్పష్టమయిన నిర్ణయం ప్రకటించకుండా, సెంటిమెంటును గౌరవిస్తామంటూ వైకాపా ద్వంద వైఖరి అవలంభించడంతో, ఆ పార్టీని అడ్డుకొనేందుకు తెరాసకు మరో మంచి ఆయుధం దొరికింది. 

 

ఆ తరువాత జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో వైకాపా మరిక బలపడలేకపోయింది. రాకెట్ స్పీడుతో సాగిపోయిన షర్మిల పాదయాత్రలు కానీ, విజయమ్మ రచ్చబండ కబుర్లు గానీ, ఆ పార్టీని తెలంగాణా ప్రజలు నమ్మేలా చేయలేకపోయాయి.

 

ఇక, తెరాస అధినేత కేసీఆర్ తన ఆకర్ష వ్యూహాలతో వైకాపా నేతలను తనవైపు తిప్పుకొంటూ మెల్లగా పార్టీని ఖాళీ చేసేస్తున్నాడు. తెలంగాణాలో వైకాపాకు బలమయిన నాయకుడయిన బోడ జనార్ధన్ ఆయన అనుచరులతో సహా ఇటీవలే తెరాసలోకి వెళ్ళిపోయారు.

 

ఇటువంటి పరిస్థితిలో మున్సిపల్ మరియు పంచాయితీ ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం వైకాపాకు కొంచెం కష్టంగానే ఉంది. తెదేపా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, బయ్యారం విషయంలో స్పష్టత ఇచ్చి తెలంగాణాలో నిలద్రొక్కుకొంటున్నపటికీ, ఆ రెండూ చేయని వైకాపా మాత్రం తెలంగాణా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది.

 

విజయమ్మ, షర్మిల ఇద్దరూ తెలంగాణాలో పర్యటించినప్పటికీ ‘జగనన్నవస్తాడు, రాజన్నరాజ్యం తెస్తాడు’ అని చిలకపలుకులు పలుకుతూ తెలంగాణా అంశంలో వారు స్పష్టత ఈయకుండా దాటవేయడంతో, వైకాపా తెలంగాణా వ్యతిరేఖమని కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజల మీద ప్రభావం చూపడంతో క్రమంగా ఆ పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గుతోంది.

 

కొండా సురేఖ వంటి బలమయిన నేతలు సైతం ఇప్పుడు ప్రజలకి నచ్చజెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇక అదే సమయంలో తెలంగాణావాదాన్ని బలంగా వినిపిస్తున్నతెరాస తన పోరాటం తీవ్రతరం చేసిన ప్రతీసారి కూడా, వైకాపా ఆ పోరాటంలో పాల్గొనలేక పోవడంతో, ఆపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అనే భావం ప్రజలలో మరింత బలపడి, అక్కడ అది ఒక అంటరాని పార్టీగా మిగిలిపోతోంది.

 

వైకాపా యొక్క ఈ బలహీనతను బాగా అర్ధం చేసుకొన్న కేసీఆర్ మరియు అతని పార్టీ నేతలు వైకాపాను మరింత ఇబ్బందిపెట్టేందుకు తెలంగాణా అంశంపై ఏదో నిత్యం ఒక సవాలు విసురుతూ ఆ పార్టీతో ఆడుకొంటుంటే, వారి ప్రశ్నలకు సంజాయిషీలు ఇచ్చుకోలేక వైకాపా నేతల తల ప్రాణం తోకకి వస్తోంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విజయమ్మ మళ్ళీ తెలంగాణా యాత్రలకు సిద్దమవుతున్నారు. కేసీఆర్ మాటలకు తీవ్ర ప్రభావితులయి ఉన్న తెలంగాణా ప్రజలను, తెలంగాణా ఊసే ఎత్తని వైకాపా సభలకు తరలించడానికి వైకాపా నేతలు చాల కష్టపడవలసి వస్తోంది. అందువల్ల, రేపు విజయమ్మ తెలంగాణాలో యాత్రలు మొదలు పెడితే, పార్టీని బలపరుచుకోవడం సంగతి దేవుడెరుగు, ముందు ఆమె సభలకి జనాలను తరలించగలిగితే అదే పదివేలు అని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

ఒకవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదిగా జైల్లో చిక్కుకుపోయి ఉండటం, మరో వైపు పార్టీ తెలంగాణా అంశంపై స్పష్టత ఈయకపోవడంతో వైకాపా తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచనయింది. అందువల్ల ఆ పార్టీకి మొదట్లో కనబడిన ఆదరణ ఇప్పుడు కనబడటం లేదు.

 

ఎన్నికల సమయానికి తెరాస ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొట్టినప్పుడు, దానిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు వైకాపా వద్ద ఉపాయమూ లేదు, ఉన్నా దానిని సమర్ధంగా అమలు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు లేడు గనుక వైకాపా సీమంద్రా ప్రాంతానికే పరిమితమయిపోక తప్పదు.