రేవంత్ టార్గెట్ గానే జగనన్న బాణం! కేసీఆర్, అమిత్ షా ఉమ్మడి వ్యూహం? 

తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారని, ఫిబ్రవరిలో ఆమె  పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై కొంత కాలంగా  షర్మిల ఆగ్రహంగా ఉన్నారని... తన అన్నకు షాకిచ్చేందుకే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందని కొందరు చెబుతున్నారు. కాని వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనపరిచే ఎత్తులో భాగంగానే  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పీసీసీ రేసులో ముందున్న ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొత్త పార్టీకి ప్లాన్ చేశారని తెలుస్తోంది. వైఎస్  షర్మిల పెడతారని చెబుతున్న పార్టీకి కర్త, కర్మ, క్రియ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని, బీజేపీ అండదండలు కూడా ఉన్నాయని.. ఏపీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని  విశ్వసనీయవర్గాల సమాచారం.  

 తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. సీఎం సొంత గడ్డ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో ఇది రుజువైంది. వరుస ఓటములతో టీఆర్ఎస్ కేడర్ ఢీలా పడగా.. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా  ఎంపీ రేవంత్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. దీంతో  రోజురోజుకు ఆయన గ్రాఫ్ పెరిగిపోతోంది. గత ఏడేండ్లుగా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పోరాటానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  రేవంత్ రెడ్డి ఇంకా బలపడితే తమకు  మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనగా ఉన్నారట. అందుకే రేవంత్ రెడ్డి బలం పెరగకుండా చూసేందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు.

తెలంగాణలోని  రెడ్డి సామాజికవర్గమంతా ఇప్పుడు అధికారం కోసం తహతహలాడుతోంది. వాళ్లందరికి రేవంత్ రెడ్డి ఆశాకిరణంలా మారిపోయారు.  ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో భారీగా అభిమానులున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో వైఎస్సార్ అంటే ఇప్పటికి క్రేజ్ ఉంది. షర్మిల పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్త మద్దతు ఆమెకు లభిస్తుందని అంచనా. దీంతో రేవంత్ రెడ్డిని కొంత బలహీనం చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహమని చెబుతున్నారు. అందుకే తన మిత్రుడైన జగన్ తో మాట్లాడి.. అతని డైరెక్షన్ లోనే షర్మిల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారని, తెలంగాణలో రాబోయే కొత్త పార్టీకి ఫండింగ్ కూడా కేసీఆరే సమకూర్చనున్నారని  సమాచారం.  

 ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వైసీపీ గతంలో బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 32 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. వీటిలోని చాలా నియోజకవర్గాల్లో ముస్లిం, క్రిస్టియన్, సీమాంధ్ర ఓటర్లు కీలకంగా ఉన్నారు.  షర్మిల పార్టీ పెడితే .. ఈ వర్గ ఓట్లను ఆమె దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. షర్మిల పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా తమకు ఇబ్బంది ఉండదని.. వచ్చే ఎన్నికల్లో తమకు మెజార్టీ తగ్గినా  ఆ  పార్టీ మద్దతు తీసుకోవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే అన్ని పక్కాగా ఆలోచించాకే  వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు.  

వైఎస్ షర్మిల కొత్త పార్టీకి బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా ఉందంటున్నారు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. తెలంగాణలో తాము బలపడాలంటే హస్తం బలహీనపడాలని కమలం నేతలు కోరుకుంటున్నారు. దీంతో తమ  ప్రత్యర్థి పార్టీ టార్గెట్ గానే కొత్త పార్టీ పెడుతున్నందున కమలనాధులు కూడా సై అన్నారని చెబుతున్నారు. ఏపీలో ఎలాగూ జగన్ తమ కనుసన్నల్లోనే ఉన్నారు కాబట్టి.. షర్మిల పార్టీ కూడా తమతోనే ఉంటుందని బీజేపీ నేతల ప్లాన్. అందుకే కాంగ్రెస్ ను ఖతం చేసే కేసీఆర్ వ్యూహంలో  బీజేపీ కూడా భాగం పంచుకుందని, అందరూ కలిసి షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.  ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా సమావేశంలో షర్మిల పార్టీపై కూడా చర్చించారని హస్తం నేతలు చెబుతున్నారు. 

మొత్తంగా  మొదటి నుంచి తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి బలం పెరగకుండా చూసేందుకే టీఆర్ఎస్, వైసీపీలు కలిసి ఈ కొత్త వ్యూహం పన్నాయని.. కాంగ్రెస్ బలహీనపడితే తమకు ప్రయోజనమేనన్న రాజకీయ కారణంతో కమలం పార్టీ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి  టార్గెట్ గా  మూడు పార్టీల ఆపరేషన్ లో భాగంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని గాంధీభవన్ వర్గాలు నిర్దారణకు వచ్చాయంటున్నారు.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.