మోడీ దగ్గర మొత్తుకున్న జగన్

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలిశారు. సమావేశం అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రస్తావించామన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీలోకి నెట్టి.. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తేవడం దారుణమని, పట్టిసీమ ప్రాజెక్టులో అంశాలన్నీ విస్మయం గొలిపేలా ఉన్నాయని ప్రధానికి వివరించామని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరామని తెలిపారు.