జగన్ కారుకు తాళం..తీయడానికి నేతలు ఏం చేశారంటే
posted on May 20, 2017 6:02PM
.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన పార్టీ నేతలను, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉత్తరాంధ్ర పర్యటన కోసం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో విశాఖ వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో అధికారులు ప్రోటోకాల్ ప్రకారం జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారును సిద్ధం చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో కారు తాళాలను లోపలే వదిలేసి డోర్ వేయడంతో అది లాక్ అయింది. దీనిని ఓపెన్ చేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేదు. పోనీ శ్రీకాకుళం నుంచి మరో కారు తెప్పిద్దాం అంటే అక్కడి నుంచి విశాఖ రావడానికి కనీసం గంట సమయం పడుతుందనీ..ఈలోగా జగన్ వచ్చి వేచి ఉండాలంటే ఇబ్బందులు తప్పవని భావించిన పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే నగర పోలీస్ కమిషనర్‌ను మరో కారు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు..దీనిపై స్పందించిన కమిషనర్ మరో కారు ఏర్పాటుకు అనుమతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ సమయానికి విశాఖ చేరుకున్న జగన్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.