పవర్ లెస్ సీఎం ప్రెస్ మీట్ ని అడ్డుకున్నాడా?

 

విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు.

విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు.

పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు.

ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.