దగ్గుబాటిపై నిఘా నిజమేనా? పర్చూరులో అసలేం జరుగుతోంది?

 

దగ్గుబాటి వెంకటేశ్వరావు... దగ్గుబాటి పురంధేశ్వరి... పరిచయం అక్కర్లేని పేర్లు... ఎన్టీఆర్ అల్లుడిగా, ఎన్టీఆర్ కూతురిగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ జంట... అయితే ఒకరు వైసీపీలో ఉంటే... మరొకరు బీజేపీలో ఉండటం... సమస్యగా మారుతోంది. ఒకే ఇంట్లో రెండు జెండాలు ఉండటం... వాళ్లిద్దరి వరకు సమస్య లేకపోయినా, ఆ రెండు పార్టీల అధినాయకుల్లో మాత్రం అనుమానాలు పెంచుతుందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల పురంధేశ్వరి.... వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో... దగ్గుబాటి వెంకటేశ్వరావుపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారనే వార్త వైసీపీలో సంచలనంగా మారింది.

భార్య ఒక పార్టీలో... భర్త మరో పార్టీలో... అంటూ విమర్శలు చెలరేగినా, దగ్గుబాటి దంపతులు మాత్రం తమతమ పార్టీల్లో ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు. ఇద్దరూ కూడా ఎవరి రాజకీయంలో వారు బిజీగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో అనూహ్యంగా పర్చూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరావు... టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. దగ్గుబాటి ఓడిపోయినప్పటికీ, పర్చూరు నియోజకవర్గంలో మాత్రం దగ్గుబాటి మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. అధికార యంత్రాంగంలోనూ, బదిలీల్లోనూ ఇలా ప్రతీ విషయంలోనూ దగ్గుబాటి వెంకటేశ్వరావు చక్రం తిప్పుతున్నారనే వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అలాగే, కుమారుడితో కలిసి అటు అధికారులు, ఇటు పార్టీ లీడర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోన్న దగ్గుబాటి... నియోజకవర్గంలో ప్రతీదీ తన కనుసన్నల్లోనే జరగాలని చెబుతున్నారట. అయితే దగ్గుబాటి పోకడపై సొంత పార్టీలోనే మరో వర్గం జగన్ కు ఫిర్యాదు చేసిందట. దాంతో దగ్గుబాటి వ్యవహారశైలిపై జగన్ నిఘా పెట్టారనే చర్చ సాగుతోంది.

అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారనే ప్రచారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, సొంత పార్టీ నాయకుడిపై ప్రభుత్వం నిఘా ఎందుకు పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. దీనికి, జగన్ ప్రభుత్వంపై ఇటీవల పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడాలనుకుంటోన్న బీజేపీ... ఎన్నికల తర్వాత విమర్శల దాడిని పెంచింది. అందులో భాగంగానే పురంధేశ్వరి కూడా జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటిపై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందనే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి విమర్శల నేపథ్యంలోనే... పర్చూరులో పరిస్థితేంటి? ఆమె భర్త దగ్గుబాటి వైఖరి ఎలా ఉంది అంటూ సీఎం జగన్ ఆరా తీశారని చెప్పుకుంటున్నారు. అందుకే, నిఘా అధికారులు పర్చూరు నియోజకవర్గానికి వెళ్లి, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, నివేదికలు ఇస్తున్నారని తెలుస్తోంది.

అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికార పార్టీగా నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, ప్రాధమ్యాలను జనానికి వివరించడానికి, పార్టీ పట్టు పెంచుకోవడానికే దగ్గుబాటి తన కుమారుడితో కలిసి, పర్యటిస్తున్నారని అంటున్నారు. ఇదంతా ప్రత్యర్ధుల కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు.