జగన్‌‌‌ ప్రతిపక్షనేత పదవికి సు"జయం"గా ఎర్త్ ?

ఒకరి తర్వాత ఒకరు పార్టీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి జంప్ అవుతుండటంతో వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ప్రాణం పోయినా సరే జగనన్నను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని మీడియా ముందు చిలుక పలుకులు పలుకుతున్న నేతలంతా పోలోమని పచ్చకండువా కప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అందరు ఎమ్మెల్యేల్లాగా సుజయ చేరిక ఆషామాషీ కథ కాదు. దీని వెనుక పెద్ద స్కెచ్ ఉంది.

 

అసలే అధికారం కోల్పోయి చివరికి ప్రతిపక్షనేత హోదా అయినా మిగిలినందుకు సంతృప్తి పడ్డారు జగన్. కాని ఇప్పుడు ఆ హోదా కూడా లేకుండా చేయడానికి టీడీపీ చేతిలోని బ్రహ్మాస్త్రమే సుజయ కృష్ణరంగారావు. ఇప్పటికే 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా సైకిలెక్కించి, జగన్ ప్రతిపక్షనేత హోదాకు ఎసరు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొత్తం 37 మంది ఎమ్మెల్యేల ద్వారా  పార్టీలో చీలిక తెచ్చి జగన్ స్థానంలో, జ్యోతుల నెహ్రూను వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని అయితే ఈ వ్యవహారం అంతా సాంకేతికంగానే జరిగిపోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

 

దీనిలో భాగంగానే వైసీపీఎల్పీ కార్యదర్శి హోదాలో ఉన్న సుజయకృష్ణ రంగారావును ముందుగా టీడీపీలో చేర్చుకుంది. సుజయ వైసీపీఎల్పీ కార్యదర్శి హోదాలో వైసీపీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాయనున్నారు. అప్పుడు అది వైసీపీ అధికార సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో 37 మంది శాసనసభ్యుల సంతకాలు తీసుకుంని, తాము వైసీపీఎల్పీ నేతగా జ్యోతుల నెహ్రూను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు లేఖ రాస్తారు. తర్వాత స్పీకర్..ఆ లేఖ మేరకు జ్యోతుల నెహ్రూని విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తారు. కార్యదర్శిగా ఉన్నందున అంతా సుజయ చేతుల మీదుగా నడిపిస్తే తర్వాత జగన్ న్యాయస్థానాలను ఆశ్రయించినా ఎలాంటి ఇబ్బందులు రావని టీడీపీ స్కెచ్. సుజయ కృష్ణరంగారావు పార్టీ మారి ఇన్ని రోజులైనా జగన్ ఇప్పటివరకు మరో కార్యదర్శిని నియమించకపోవడం కొసమెరుపు.