కేసీఆర్ ను ఇరకాటంలో పడేసిన జగన్ నిర్ణయం... తెలంగాణలో మోగిన సమ్మె సైరన్

 

ప్రగతి రథ చక్రాలు... ఇకపై ప్రభుత్వ రథ చక్రాలుగా మారనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరబోతోంది. దాంతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌... త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం... కేసీఆర్ ను చిక్కుల్లో పడేసింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ వేశారు. వివిధ కోణాల్లో అధ్యయనం జరిపిన కమిటీ... ముఖ్యమంత్రి జగన్ కు మధ్యంతర నివేదికను అందజేసింది. దాంతో సంబంధిత మంత్రులు, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన జగన్మోహన్ రెడ్డి.... ఆర్టీసీ విలీనానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. నిపుణుల కమిటీ సూచించిన మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ను ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. అయితే, ఆర్టీసీ విలీనం ద్వారా ప్రభుత్వంపై ఏటా 3వేల 500కోట్ల రూపాయల భారం పడనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కానుండటంతో, కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్న పేర్ని నాని... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తామన్నారు.

అయితే, ఆర్టీసీ విలీనానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగకపోవడం, అలాగే ఆస్తుల విభజన పూర్తికాకపోవడం, తెలంగాణతో సమస్యలు ఉండటంతో,  ఇప్పటికిప్పుడు విలీనం సాధ్యంకాదని చెప్పింది. ఈ సమస్యలన్నీ కొలిక్కిరావడానికి కొంత సమయం పడుతుందని, అలాగే కేంద్రం వాటాను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కమిటీ నివేదిక ఇఛ్చింది. దాంతో, ఆర్టీసీ కార్పొరేషన్ ను కొనసాగిస్తూనే, ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. 

మొత్తానికి, జగన్ సర్కారు నిర్ణయంపై ఆంధ్రా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో చేసినట్లే... ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులిచ్చిన ఎంప్లాయిస్ యూనియన్... సెప్టెంబర్ 17 తర్వాత ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించింది. దాంతో జగన్ నిర్ణయం ఇక్కడ కేసీఆర్ ను చిక్కుల్లో పడేసినట్లయ్యింది.