చంద్రబాబు నల్లచొక్కా.. మరో కొత్త డ్రామా

posted on: Feb 6, 2019 3:51PM

 

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో వైసీపీ సమర శంఖారావం నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘9 ఏళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డారు. చాలా గర్వంగా చెబుతున్నా మీరందరూ నా కుటుంబసభ్యులే. మనం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ పథకాలు అందించడంలో మీ పాత్ర కీలకం. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుంది. వైసీపీ అధికారంలోకి రావాలంటే మీరంతా కీలక బాధ్యత తీసుకోవాలి' అన్నారు. చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని, బాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు చూశానని, రాజకీయంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేస్తున్నారని విమర్శించారు.

చాలాచోట్ల వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని.. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు అని విమర్శించారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు. రానున్న ఎన్నికలు ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలు అన్నారు. 

'2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. ఆయనొస్తున్నాడు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యుత్‌ అన్నారు. పేదవారికి ఇల్లు కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని డైలాగులు కొట్టారు. ప్రత్యేక హోదాను ఐదు కాదు.. పదికాదు.. 15 ఏళ్లు తెప్పిస్తామన్నారు. హోదా తెస్తానని డ్రామాలు చేస్తూ.. చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు నల్లచొక్కా వేసుకున్నారు.' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే పసుపు​-కుంకుమ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని జగన్ మండిపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...