అంతరిక్షంలో యోగా

 

యోగా గొప్పతనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకీ యోగా కూడా తగిన పరిష్కారం చూపగలదని నమ్ముతున్నారు. కానీ అంతరిక్షంలో సంచరించే వ్యోమగాములకి కూడా యోగా ఉపయోగపడుతుందని తేలడం మాత్రం ఆశ్చర్యమే!

 

వ్యోమగాములకీ కష్టాలు

హాయిగా రెక్కల్లేని పక్షుల్లాగా శూన్యంలో విహరించే వ్యోమగాములకీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్‌ వల్లా, గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్లా రకరకాల ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. ఇక ఒంటరితనం వల్ల, ఒకే పెట్టెలో బందీగా ఉండటం వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతాయి. వీటన్నింటినీ తట్టుకొనేందుకు వారికి రకరకాల సౌకర్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇంచుమించుగా ప్రతి అంతరిక్ష వ్యోమగామికీ వస్తున్న నడుం నొప్పికి మాత్రం ఇప్పటివరకూ సరైన కారణం కానీ, చికిత్సను కానీ కనుగొనలేకపోయారు.

 

కారణం తేలింది

ఇంతవరకూ వ్యోమగాల వెన్నుపూసలో ఉండే డిస్కులు వాయడం వల్లే వారికి నడుంనొప్పి వస్తుందని భావించేవారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తరువాత కూడా వ్యోమగాములు వారాల తరబడి నడుంనొప్పితో బాధపడాల్సి వచ్చేది. కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు దీనికి తగిన కారణాన్ని కనుగొనేందుకు ఒక ఆరుగురు నాసా వ్యోమగాములను పరిశీలించారు. వారు అంతరిక్షంలోకి బయల్దేరక ముందు, అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపి తిరిగి వచ్చిన తరువాత వారికి MRI పరీక్షలు నిర్వహించారు. వీటిలో నడుంనొప్పికి డిస్క్‌ వాపు కారణం కాదని తేలింది. వెన్ను చుట్టూ ఉండే కండరాలు దాదాపు 20 శాతం కుంచించుకుపోవడం వల్ల ఈ నొప్పి ఏర్పడుతోందని బయటపడింది. ఇలా దెబ్బతిన్న కండరాలు కొన్ని నెలలు గడిచిన తరువాత కానీ తిరిగి సాధారణ స్థితికి చేరుకోలేదట.

 

యోగాతో బాగు

వ్యోమగాములు నడుముకి సంబంధించిన సమస్యలకు దూరం కావాలంటే యోగా మంచి మార్గం అని తేలుస్తున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో సరైన కదలికలు లేకపోవడం, వెన్ను మీద అధిక ఒత్తిడి పడటం వంటి ఇబ్బందుల కారణంగా తలెత్తే సమస్యలన్నింటికీ యోగా తగిన ఉపశమనాన్ని కలిగించగలదని సూచిస్తున్నారు. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేటప్పుడు వారి దినచర్యలో భాగంగా యోగాను చేర్చమంటున్నారు. ఏదో ఒకటి రెండు నెలలు అంతరిక్షంలో గడిపేసి వచ్చే రోజులు పోయాయి. ఇక ముందు ఏళ్లతరబడి వారు అంతరిక్షంలో ప్రయాణించాల్సిన సందర్భాలు రానున్నాయి. అలాంటి కలలు ఎలాంటి ఉపద్రావాలూ లేకుండా నిజం అయ్యేందుకు యోగా కూడా వారికి సాయపడేట్లే ఉంది.

 

- నిర్జర.

 

International Yoga Day 2018 Special Videos