రెండేళ్లలో అవినీతి 250 కోట్లు! వైసీపీ ఎమ్మెల్యే బండారం బయటపెట్టిన సొంత పార్టీ నేతలు.. 

posted on: Jan 8, 2022 8:43AM

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అవినీతి ,అక్రమాలకు హద్దే లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏ రంగాన్ని వదలకుండా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్, ఇసుక, మద్యం దందా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలను బయటపెడుతూ టీడీపీ నేతలు ఎంతో పోరాటం చేస్తున్నారు. అయినా వాళ్ల తీరు మారలేదు. అయితే విపక్ష నేతలు కాకుండా సొంత పార్టీ నేతలే ఇప్పుడు బయటికి వస్తున్నారు. మా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. అక్రమాల చిట్టా కూడా బయటపెడుతున్నారు. 

తాజాగా అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అవినీతిని ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలే మీడియా ముందు విడుదల చేయడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతి భాగోతం ఎంత భారీగా ఉందన్న విషయాన్ని వివరాలతో సహా బయటపెట్టారు ఆ నియోజకవర్గ నేతలు. రూ.250 కోట్ల అవినీతి వివరాల్ని వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టారు. మాల మహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు.. వైసీపీ బీసీ సెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ లు ఈ ఆరోపణలు చేశారు. మాట వరసకు అవినీతి బురద వేసి.. వదలకుండా దానికి సంబంధించిన  వివరాల్ని వెల్లడించారు.

తన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని దూలం నాగేశ్వరరావు రూ.250 కోట్లు అవినీతికి పాల్పడ్డరని చెప్పారు. కొల్లూరులో 1600 ఎకరాల బినామీ వ్యక్తులకు లీజుకు ఇచ్చి రూ.50కోట్ల మేర లబ్థి పొందారన్నారు. కైకలూరులో 80 ఎకరాలు.. పామర్రులో 40 ఎకరాలు.. రామోజీ ఫిలిం సిటీ వద్ద 50 ఎకరాలు.. విశాఖపట్నంలో 50 ఎకరాలు.. నడిపురులో 13 ఎకరాల భూమి ఉందన్నారు.గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో తమ పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూముల సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటమా అని విస్తుపోతున్నారు. పార్టీ కోసంపని చేస్తున్న వారిని దూరం పెడుతున్నారని ఆరోపించిన వారు.. వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటును ఎస్సీ అభ్యర్థికి లేదంటే బీసీ అభ్యర్థికి కేటాయించాలని కోరారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే మాత్రం ఓటమి ఖాయమని వారు స్పష్టం చేశారు. 

ఒక ఎమ్మెల్యే అవినీతే రూ.250 కోట్ల వరకు ఉందంటే.. మరి.. మిగిలిన వారి సంగతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అదునుగా రంగంలోకి దిగిన విపక్షనేతలు ఎమ్మెల్యేనే ఇంతలా వెనకేస్తే ఇక మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఏ రేంజ్ లో దండుకున్నారో అని ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు.. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్నారు వైసీపీనేతలు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేల మీద సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తలనొప్పిగా మారిన వేళ.. తాజాగా తెర మీదకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి షాకింగ్ గా మారింది

google-ad-img
    Related Sigment News
    • Loading...