TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!?

Published on: Fri Jun 6, 2025 10:00AM

వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహా త్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది. జగన్ దుష్టపాలనను జనం మరచిపోయే అవకాశం లేకుండా వాటి ప్రభావంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లింది వంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ నవరత్నాలు అంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలలో ఇప్పటికీ ఒకింత సానుకూలత ఉందన్న అంచనాల నేపథ్యంలో  ఆ సానుకూలతను రూపుమాపి, అంటే జగన్ సంక్షేమ పథకాలను జనం మరిచిపోయేలా మరింత సంక్షేమం, దానితో పాటే అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలు జనానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాల పేరిట జగన్ జనానికి చేసిన దగాను సమర్థవంతంగా, ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నది.   

ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో జగన్ ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా అనే కార్యక్రమాన్ని జగన్ అప్పట్లో చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అంటూ వాహనాలను రద్దు చేసింది.  ఈ విషయంలో తొలుత ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనట్లు కనిపించినా.. ఒకటి రెండు రోజులలోనూ ఆ వ్యతిరేకత మటుమాయమైంది. అంత పకడ్బందీగా దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ అన్నది ఒక మాయావస్త్రంగా మారిందనీ, వాహనం ఇంటి ముందుకు వచ్చి రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవనీ, ఎక్కడో    కూడలిలో రేషన్ పంపిణీ వాహనం అందితే అక్కడకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు. దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ వల్ల తాము తాపీగా వెళ్లి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.  ఇక పరామర్శల పేర జగన్ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ లకు మద్దతుగా నిలుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా తెనాలి ఐతానగర్ సంఘటనలో జగన్ పరామర్శ బూమరాంగ్ అయ్యింది.

దళిత సంఘాలలో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. పోలీసులు బహిరంగంగా ఐతానగర్ లో రౌడీషీటర్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను జనం హర్షించారు. అటువంటి రౌడీ షీటర్లకు జగన్ అండగా నిలవడమేంటన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే జనవరి 4 వెన్నుపోటు దినం అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోడాన్ని వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతోంది. అధినాయకుడు నిరసనలలో పాల్గొననప్పుడు తాము మాత్రం ఎందుకు అన్నట్లుగా చాలా ప్రాంతాలలో వెన్నపోటు దినం నిరసనలకు వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆ నిరసన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఆ కారణంగా అవి జనానికి పట్టని నిరసనలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు నిర్వహించిన సంబరాలు ఆర్భాటంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. జనం కూడా ఆ వేడుకలలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ వర్గాలలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది.