పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ
posted on Aug 14, 2025 11:15AM

అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది. మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి 6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
